శాస్త్ర సాంకేతిక విద్య పట్ల విక్రమ్ సారాభాయ్ దృక్పథం: Vikram Sarabhai and Science Education

మొన్న ఆగస్టు పన్నెండున డాక్టర్ విక్రమ్ సారాభాయ్ జయంతి. దేశంలో అంతరిక్ష, అణుశక్తి కార్యక్రమాలకు బీజం వేసిన దార్శనికుడిగా ఆయనను దేశం ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది. స్వతంత్ర భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా మార్చాలంటే శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు మాత్రమే అందుకు దోహదపడగలవని బలంగా నమ్మి ఇస్రో, పిఆర్ఎల్, ఐఐఎం-ఎ, ATIRA వంటి సంస్థలను స్థాపించి దేశంలో సాంకేతిక విప్లవానికి ఆయన చేసిన కృషి మరవలేనిది. శాస్త్ర సాంకేతిక విద్య మరింత విస్తృతంగా అందుబాటులోకి రావాల్సిన అవసరం గురించి ఆయన ఎంతగా తపించేవారో ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి.

ప్రజలలో శాస్త్రీయ దృక్పధం పెంపొందించకపోతే దేశం పురోగతి చెందలేదనే స్పష్టత సారాభాయ్ కి ఉంది. దీనిని సాధించాలంటే సైన్స్ బోధన మరింత వినూత్నంగా జరగాలనీ, శాస్త్రవేత్తలు యువతతో కలిసి పని చేసి వారిలో శాస్త్రీయ దృక్పధం అలవర్చాలనీ ఆయన భావించేవారు. చిన్నతనంలో ఇంటి వద్దనే ఎంతో మంచి వాతావరణంలో విద్యాభ్యాసం చేయడం బహుశా ఆయనలో సైన్స్ బోధన పట్ల ప్రత్యేక ఆసక్తి ఏర్పడటానికి పునాదిగా పనిచేసింది అనుకోవచ్చు.

ఈ ఆసక్తి వల్లనే 1963 లో ఆయన ఫిజికల్ రీసెర్చ్ లాబరేటరీ కి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలతో కలిసి సైన్స్ విద్యను సాధారణ పౌరులకు అందేలా చేసేందుకు కొన్ని ప్రయోగాలు చేశారు. ఈ తొలి ప్రయత్నాలు కొంత మంచి ఫలితాలు సాధించడంతో 1966 లో ‘కమ్యూనిటీ సైన్స్ సెంటర్’ అనే సంస్థను స్థాపించారు. దీనిని సారాభాయ్ గురువు, నోబెల్ గ్రహీత అయిన సర్ సివి రామన్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ సందర్భంలోనే ఆయన ‘ఎందుకు ఆకాశం నీలంగా ఉంటుంది” అనే తన ప్రముఖ ఉపన్యాసాన్ని వెలువరించారు.

ఈ కమ్యూనిటీ సైన్స్ సెంటర్ దేశంలో ఒక వినూత్న ప్రయోగంగా చెప్పుకోవచ్చు. ఈ సంస్థ ప్రయత్నాల వల్లనే దేశంలో సైన్స్ మ్యూజియంలు పుట్టుకొచ్చాయి. డాక్టర్ సారాభాయ్ మరణం తర్వాత ఈ సెంటర్ పేరును విక్రమ్ ఎ. సారాభాయ్ కమ్యూనిటీ సైన్స్ సెంటర్ (VASCSC ) అని మార్చడం జరిగింది.

Vikram Sarabhai as a boy, with his model train

ఈ VASCSC వెబ్సైటు ప్రకారం “పాఠశాల, కళాశాలల విద్యార్థులను తమ పాఠ్య పుస్తకాల పరిధి నుండి బయటకు తీసుకువచ్చి స్వంతంత్రంగా, సృజనాత్మకంగా ఆలోచించేలా చేయడం ఈ సంస్థ ధ్యేయం. విద్యార్థులు సైన్స్, గణితాలను మరింత మెరుగ్గా, దీర్ఘకాలం గుర్తు ఉండేలా నేర్చుకునేందుకు గానూ ఎన్నో వినూత్న విధానాలను ఈ సంస్థ రూపొందించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, పరిపాలకులు, సామాన్య ప్రజానీకం అందరూ కలిసి సైన్స్ ను అర్ధం చేసుకుంటూ శాస్త్రీయ దృక్పధాన్ని పెంచుకునేలా చేయడం ఈ సంస్థ లక్ష్యం.”

స్థాపించిన నాటి నుండి ఈ సంస్థ సైన్స్ ప్రదర్శనలు నిర్వహించడం, ఓపెన్ లేబొరేటరీ లను, మాథ్స్ లాబొరేటరీలను, సాంకేతిక ఆటస్థలాలను నిర్మించడం వంటి ఎన్నో వినూత్న విధానాల ద్వారా శాస్త్రీయ దృక్పధాన్ని ప్రజలలో పెంపొందించే ప్రయత్నాలు చేసింది. దేశంలో శాస్త్రీయ విద్యా కార్యక్రమానికి ఈ రోజు ఈ సంస్థే వెన్నుముకగా ఉంది. ఎంతో నాణ్యమైన విద్యా కిట్లు, వనరులను ఈ సంస్థ రూపొందించింది.

డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం రూపొందించిన సైన్స్ ఎక్సప్రెస్ ఈ సంస్థ చేసిన అనేక వినూత్న కార్యక్రమాలలో ప్రముఖమైనది. ఎన్నో సంవత్సరాల పాటు నడిచిన ఈ సైన్స్ ఎక్సప్రెస్ ను ఇండియన్ రైల్వేస్ సహకారంతో 16 బోగీలు ఉన్న ఒక రైలులో ఏర్పాటు చేశారు. ఎన్నో శాస్త్రీయ నమూనాలను ఇందులో ప్రదర్శించారు. అక్టోబర్ 2007 లో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చే ప్రారంభించబడిన ఈ రైలు దేశమంతా దాదాపు ఒక లక్ష ఇరవై రెండువేల కిలోమీటర్లు ప్రయాణించింది. 1404 రోజుల పాటు 391 ప్రాంతాలలో ఈ రైలు ప్రదర్శన జరగగా దాదాపు కోటి ముఫై మూడు లక్షల మంది దీనిని సందర్శించారు. ప్రపంచంలోనే అతి ఎక్కువమంది సందర్శించిన సైన్స్ ప్రదర్శనగా ఇది ఎంతో గుర్తింపు పొందింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆరు సార్లు తన స్థానాన్ని నమోదు చేసుకుంది.

డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ను గుర్తు చేసుకుంటూ ఒక సందర్భంలో మృణాళిని సారాభాయ్ ఇలా అన్నారు. “విక్రమ్ సారాభాయ్ తాను ఉద్యోగ విరమణ చేసాక పిల్లలతో, యువతతో ఎక్కువ సమయం గడిపి వారిలో శాస్త్రీయ దృక్పధాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తానని అంటుండేవారు”. అయితే ఆ కోరిక తీరకుండానే సారాభాయ్ తక్కువ వయసులోనే అకాలమరణం చెందారు. అయితే ఆయన ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సైన్స్ సెంటర్ ఆ దిశగా తన ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉంది.

P.S: ఈ వ్యాసకర్త మీనా రఘునాధన్ విక్రమ్ ఎ. సారాభాయ్ కమ్యూనిటీ సైన్స్ సెంటర్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులలో ఒకరు 

–Based on a piece by Meena

(Post 31)

జాతీయ జెండా రూపకర్త “పింగళి వెంకయ్య”: Flagman Pingala Venkiah

ఒక యువకుడు తన దేశానికి ఎంతో దూరంగా ఉన్న విదేశీ గడ్డపై ఎవరికో సంబంధించిన యుద్ధంలో పాలుపంచుకుంటూ పోరాటం చేస్తున్నాడు. అతని పేరు పింగళి వెంకయ్య. 19 వ శతాబ్దం చివరిలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లో సైనికుడిగా దక్షిణ ఆఫ్రికాలో జరుగుతున్న ఆంగ్లో బోయర్ యుద్ధంలో పనిచేశారు వెంకయ్య. అదే సమయంలో మరొక యువకుడు అదే దక్షిణాఫ్రికాలో సత్యం, న్యాయం, స్వేచ్చ గురించి కలలు కంటూ ఎన్నో ప్రయోగాలు ప్రారంభించాడు. అతనే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ.

1899 లో బోయర్ యుద్ధం ప్రారంభమైనప్పుడు గాంధీ మనసు నిజానికి స్థానిక బోయర్ల వైపే ఉన్నప్పటికీ నాటల్ బ్రిటిష్ క్రౌన్ కాలనీ సభ్యునిగా తాను బ్రిటిష్ వారికే మద్దతు తెలపవలసిన అవసరం ఏర్పడింది. దాదాపు 1100 మంది స్వచ్చంద సేవకులతో గాంధీ ఒక సేవాదళాన్ని ఏర్పాటు చేశారు. ఎవరైతే తమపై ఆధిపత్యం చెలాయిస్తూ తమను అణగదొక్కుతూ ఉన్నారో వారికే సేవలందించేలా ఆ సేవా దళ సభ్యులలో గాంధీ స్ఫూర్తి నింపగలిగారు. యుద్ధక్షేత్రంలో గాయపడిన సైనికులను సురక్షిత ప్రాంతాలకు మోసుకువెళ్తూ ఈ దళ సభ్యులు ఎంతో సహాయం చేశారు.

దాదాపు ఇదే సమయంలో అప్పటికి 19 సంవత్సరాల వయసులో ఉన్న వెంకయ్య గాంధీని కలిశారు. ఆయన నిరాడంబరత, సంభాషణలలో చూపించే ఆత్మవిశ్వాసం పింగళిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆ బంధం దాదాపు అర్ధ శతాబ్దం పాటు కొనసాగింది.

Source: en.wikipedia.org

ఆఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత పరాయి పాలన నుండి విముక్తి సాధించాలన్న గాంధీ స్పూర్తితో కొన్ని పోరాట సంస్థలలో చేరి ఏలూరు లో నివాసం ఏర్పరుచుకున్నారు. ఆ సమయంలో వ్యవసాయం పట్ల ఆకర్షితులై పత్తి పండించడం ప్రారంభించారు. ప్రత్తి సాగులో ఎన్నో వినూత్న ప్రయోగాలు చేశారు వెంకయ్య. అమెరికా నుండి కంబోడియన్ రకం పత్తి విత్తనాలను తెప్పించి వాటిని మన దేశపు విత్తనాలతో కలిపి వినూత్నమైన హైబ్రిడ్ పత్తి రకాన్ని రూపొందించారు. దగ్గరలో ఉన్న చెల్లపల్లి గ్రామంలో కొంత భూమిని తీసుకుని ఈ విత్తనాలతో అక్కడ సాగుచేయడం మొదలుపెట్టారు. ఈ వినూత్న పత్తి రకం 1909 లో జరిగిన వ్యవసాయ ప్రదర్శనలో ఎంతో మంది బ్రిటిష్ అధికారులను ఆకర్షించింది. రాయల్ అగ్రికల్చర్ సొసైటీ ఆఫ్ లండన్ ఆయనకు గౌరవ సభ్యత్వాన్ని అందించింది. అప్పటి నుండి స్థానికంగా ఆయనను ‘పత్తి వెంకయ్య’ అని పిలవడం ప్రారంభించారు.

వ్యవసాయంతో పాటు వెంకయ్య చదువు మీద కూడా దృష్టిపెట్టారు. కొత్త భాషలు నేర్చుకోవాలి అనుకున్నారు. ఈ ఆసక్తి వలెనే ఆయనే లాహోర్ లోని ఆంగ్లో వేదిక్ స్కూల్ కు వెళ్ళి సంస్కృతం, ఉర్దూ, జపనీస్ భాషలను నేర్చుకున్నారు. ఈ భాషలన్నింటిలోనూ ప్రావీణ్యం సాధించారు. 1913 లో ఆయన జపనీస్ భాషలో చేసిన ఒక సుదీర్ఘ ప్రసంగం ఆయనకు ‘జపాన్ వెంకయ్య’ అనే పేరును తెచ్చిపెట్టింది.

తర్వాత కాలంలో పింగళి రైల్వే సర్వీసెస్ లో గార్డుగా చేరారు. బెంగుళూరు, బళ్ళారి లలో ఆయన పోస్టింగ్. ఆ సమయంలో మద్రాస్ ప్రాంతమంతా ప్లేగు వ్యాధి వ్యాపించి ఉంది. ఆ వ్యాధికి గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నవారు దుస్థితిని చూసిన ఆయన తన ఉద్యోగాన్ని వదిలి ప్లేగు వ్యాధి నిర్మూలనా సంస్థ తరపున ఇన్స్పెక్టర్ గా కొంతకాలం పనిచేశారు.

ఆ తర్వాత స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ నిర్వహించిన అనేక సదస్సులకు హాజరయ్యారు. 1906 లో కలకత్తాలో సదస్సుకు హాజరయ్యినప్పుడు ఇంగ్లీష్ యూనియన్ జెండాను ఎగురవేయడం చూసిన ఆయన ఎంతో బాధపడ్డారు. అక్కడి నుండి తిరిగి వచ్చాక మన దేశానికి ఒక జాతీయ జెండా ఉండాలనే కొత్త ఆలోచన ఆయనలో తలెత్తింది. అనేక దేశాల జెండాలను పరిశీలించడంతో తన ప్రయత్నాన్ని ప్రారంభించారు. 1916 లో “A National Flag for India” పేరుతో ప్రచురించిన పుస్తకంలో ముఫై రకాల జెండా నమూనాలను ప్రదర్శించారు. 1916 నుండి 1921 వరకు జరిగిన ప్రతి భారత జాతీయ కాంగ్రెస్ సదస్సులోనూ వెంకయ్య జెండాకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తేవారు. ఈ ఆలోచనను ఎంతగానో సమర్ధించిన గాంధీ మన జెండా జాతికి స్ఫూర్తినిచ్చేదిగా, అన్ని మతాలకు ప్రాతినిధ్యం వహించేదిగా ఉండాలని సూచించారు.

1921 లో విజయవాడలో జరిగిన సదస్సులో వెంకయ్య జాతీయ జెండాల నమూనాలతో ఉన్న తన పుస్తకాన్ని గాంధీకి చూపించారు. ఆయన కృషిని, పట్టుదలను గాంధీ ఎంతగానో ప్రశంసించారు. మన జాతీయ జెండా పేరుతో యంగ్ ఇండియా లో రాసిన ఒక వ్యాసంలో గాంధీ ఇలా అన్నారు. “మన జెండా కోసం మనం త్యాగాలకు సంసిద్ధంగా ఉండాలి. మచిలీపట్టణం లోని ఆంధ్ర నేషనల్ కాలేజీ లో పని చేస్తున్న పింగళి వెంకయ్య జెండా కోసం ఎంతో కృషి చేసి అనేక నమూనాలతో ఒక పుస్తకాన్ని రూపొందించారు. జాతీయ జెండాకు ఆమోదం కోసం భారత జాతీయ కాంగ్రెస్ సదస్సులలో వెంకయ్య చేసిన కృషి ఎంతో ప్రశంసనీయం. నేను విజయవాడ వెళ్ళినప్పుడు ఎరుపు, ఆకుపచ్చ రంగులతో మధ్యన అశోక చక్రం గుర్తుతో ఒక జెండాను రూపొందించమని వెంకయ్యను అడిగితే కేవలం మూడు గంటల్లో దానిని తయారు చేశారు. తర్వాత కాలంలో సత్యం, అహింసలకు చిహ్నమైన తెలుపు రంగు కూడా జెండాలో ఉంటే బాగుంటుంది అని మేము అనుకున్నాము.”

ఆ స్పూర్తితో వెంకయ్య రాత్రిoబగళ్ళు శ్రమించి మరొక జెండా రూపొందించారు. అప్పుడు వెంకయ్య రూపొందించిన ఆ జెండానే తర్వాత మన త్రివర్ణ పతాక రూపకల్పనకు బ్లూ ప్రింట్ గా మారింది. దానితో అప్పటి నుండి ఆయనకు “జెండా వెంకయ్య” అనే మరో కొత్త పేరు వచ్చింది.

1931 లో చిన్న మార్పులతో భారత జాతీయ కాంగ్రెస్ వెంకయ్య రూపొందించిన జెండాను ఆమోదించింది. ఆయన కల సాకారమయ్యింది. 1947 ఆగష్టు 15 న దేశానికి స్వతంత్రం రాగానే బ్రిటిష్ యూనియన్ జెండా కిందికి దిగుతుండగా మన త్రివర్ణ పతాకం సగర్వంగా పైకి ఎగిరింది.

1947 తర్వాత వెంకయ్య ప్రత్యక్ష రాజకీయాల నుండి విరమించుకుని నెల్లూరు లో స్థిరపడ్డారు. ఆ సమయంలో ఆయనకు జియాలజి పై ఆసక్తి పెరిగింది. ఆ ప్రాంతంలో దొరికే విలువైన రంగురాళ్ల పట్ల ఎంతో పరిజ్ఞానం సంపాదించారు. ఆ తర్వాత జెమోలోజీ పై దృష్టి పెట్టారు. ఆ రంగంలో ఎన్నో పరిశోధనలు చేసి, పరిశోధనా వ్యాసాలు ప్రచురించి, ప్రభుత్వానికి క్షేత్ర స్థాయి పరిశోధనల విషయంలో సలహాలు ఇచ్చే స్థాయికి వెళ్లారు. ఇక అప్పటి నుండి ఆయనకు “డైమండ్ వెంకయ్య” అనే మరొక పేరు స్థిరపడింది.

ఎన్నో ప్రత్యేక ప్రతిభా సామర్ధ్యాలు కలిగినా ఎంతో నిరాడంబరంగా జీవించిన అరుదైన వ్యక్తి పింగళి వెంకయ్య. తన చివరి రోజులను ఎంతో పేదరికంలో గడిపారు. కొత్తగా స్వతంత్రాన్ని సాధించిన ఒక దేశం తన శక్తిని, స్థాయిని తెలియచేస్తూ గర్వంతో తన జెండాను ఎగురవేస్తుండగా దాని గురించి కలలు కని, రూపకల్పన చేసిన వ్యక్తిని మాత్రం దేశం చాలా వరకు మర్చిపోయింది.

తన జీవితంలో తాను సాధించిన వాటిలో జెండా రూపకల్పనకు అత్యంత ఉన్నతమైనదిగా వెంకయ్య భావించేవారు. తాను మరణించాక తన శరీరంపై త్రివర్ణ పతాకాన్ని కప్పి చితిపై ఉంచే ముందు మాత్రం దానిని తొలగించి ఏదైనా చెట్టు కొమ్మకు తగిలించమని ఆయన కోరుకున్నారట. 1963 జులై 4 న ఆయన మరణం తర్వాత ఆయన కోరుకున్నట్లుగానే జాతీయ జెండాను ఆయన శరీరంపై ఉంచారు.

ఈ నెల మొదటిలో మన యువ ఒలింపియన్ క్రీడాకారులు విదేశీ గడ్డపై మన జెండాను ఎగరవేస్తుంటే మనం వేడుక చేసుకున్నాం. ఈ వారాంతంలో అందరం జెండాకు సగర్వంగా తలెత్తి వందనం చేయబోతున్నాం. మనకు ఇటువంటి గర్వించదగిన క్షణాలను ఇచ్చిన మన పెద్దలందరినీ గుర్తు చేసుకునేందుకు, వారికి మన కృతజ్ఞతలు తెలియచేసుకునేందుకు కూడా ఇదే సరైన సమయం.

–From a piece by Mamata

డిఆర్డిఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్) వారి వెబ్సైట్ లో డాక్టర్ డీఎస్ కొఠారి గురించి ఇలా రాసి ఉంటుంది: Dr. DS Kothari

“సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, ఢిల్లీ యూనివర్సిటీ లోని సైన్స్ విభాగానికి డీన్ గా ఉన్న 48 ఏళ్ళ డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి 1948 లో తొలి శాస్త్రీయ సలహాదారుగా నియమించబడ్డారు. ఇందులో భాగంగా ఆయన డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజషన్ ను స్థాపించారు. దానిలో పని చేసేందుకు ఏరోనాటిక్స్, ఎలక్ట్రానిక్స్, రసాయన శాస్త్రం, గణితం, పోషకాహారం, భౌతిక శాస్త్రం, మానసిక శాస్త్రం వంటి వివిధ విభాగాలలో అనేక యూనివర్సిటీ లలో పని చేస్తున్న శాస్త్రవేత్తల నుండి కొందరిని ఈ సంస్థ కోసం ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేశారు. వీరు బాలిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్రీ, పేలుడు పదార్ధాలు, పెయింట్లు, ఆహారం, పోషణ, మానసిక దృఢత్వానికి సంబంధించిన అంశాలు, యుద్ధరంగంలో ఉండే వత్తిడి, శారీరక అలసట వంటి అనేక అంశాలలో పరిశోధనలు నిర్వహించేవారు. రక్షణ సమస్యల పరిష్కారంలో శాస్త్రవేత్తల పాత్ర ఎంత కీలకమైందో ఆయన నిరూపించారు. ఏ పరిధులు లేకుండా నేర్చుకునేందుకు అవకాశం ఉండి, పెద్ద, చిన్న తేడాలు లేని, సిబ్బంది అందరి మధ్యలో మంచి అనుబంధం ఉండే సంస్థగా దానిని మలచాలనేది డాక్టర్ కొఠారి లక్ష్యం. ఆయన తొలిగా స్థాపించిన సైన్స్ లేబొరేటరీ నే ఈ రోజు డిఆర్డిఓ అనే అత్యున్నత సంస్థ ఏర్పాటుకు పునాది.

ఎవరి వృత్తి జీవితంలో అయినా తొలి బాస్ ప్రభావం ఎంతో ఉంటుంది. వారి నాయకత్వ నైపుణ్యాలు, వృత్తి నియమాలు వారి కింద పని చేసే సిబ్బంది కెరీర్ లో కీలక పాత్ర పోషిస్తాయి. కొత్తగా ఉద్యోగంలో చేరిన యువతకి అయితే మంచి బాస్ దొరికితే వారే దేవుడి లాగా కనపడటంలో ఆశ్చర్యమేమీ లేదు. 

మా నాన్నకు డాక్టర్ కొఠారి మొదటి బాస్. ఆయన సాక్షాత్తు దేవుడే మా నాన్నకి.

డిఆర్డిఓ వెబ్సైటు లో డాక్టర్ కొఠారి గురించి రాసి ఉన్నదానికి మా నాన్న ఆయన గురించి నాతో చెప్పిన దానికి కొంచెం కూడా తేడా లేదు. 

డిఆర్డిఓ అధికారంగా ఏర్పడింది 1958 లో. అయితే దానికి ముందే ఎన్నో రక్షణకి సంబంధించిన ల్యాబ్ లు ఉండేవి. 1953 లో డిఫెన్స్ సైన్స్ ల్యాబ్ లో ఒక జూనియర్ స్థాయి ఉద్యోగానికి మా నాన్న దరఖాస్తు పంపి, ఇంటర్వ్యూ కి హాజరయ్యారు. ఆ ఇంటర్వ్యూ పానెల్ లో డాక్టర్ కొఠారి నే స్వయంగా కూర్చున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖకి శాస్త్ర సలహాదారుగా ఉన్న ఆయన తన ఎన్నో ముఖ్యమైన పనులను పక్కన పెట్టి ఆ యువ శాస్త్రవేత్తలను తానే స్వయంగా ఎంపిక చేసుకోవాలని రోజుల తరబడి ఇంటర్వ్యూ లలో పాల్గొన్నారు. అప్పుడే స్వతంత్రం పొందిన దేశంలో ఒక బలమైన రక్షణ సంస్థను ఏర్పాటు చేయాలంటే దేశం నలుమూలల నుండి ప్రతిభ గల యువ శాస్త్రవేత్తలను ఎంపిక చేయడం తన ముఖ్యమైన కర్తవ్యంగా భావించారు ఆయన.

మా నాన్న, ఆయనతో పాటు చేరిన యువ శాస్త్రవేత్తలకు మొదటగా అప్పగించిన పని అత్యంత ఎత్తైన ప్రాంతాలలో పని చేస్తున్న సైనికులకు ఇచ్చే చపాతీలు ఎంత మందంగా ఉండాలో పరిశోధించడం. చపాతీ చేయడానికి ఎంత పిండి వాడాలి, ఎంత సమయం తీసుకోవాలి, కాల్చడానికి ఎంత సమయం కావాలి, ఎంత ఇంధనం ఖర్చు అవుతుంది వంటివన్నీ వీరు అంచనా వేయాల్సి ఉంది. అన్నిటికీ మించి ఆ చపాతీలు రుచిగా ఉండాలి కూడా. రోజువారీ సమస్యల పరిష్కారంలో సైన్స్ అవసరం ఎంత ఉందో ఆ తరం శాస్త్రవేత్తలందరికీ  స్పష్టత ఉంది.  

1955 లో అప్పటి ప్రధాని నెహ్రు న్యూక్లియర్, థెర్మో న్యూక్లియర్, ఇంకా అనేక ఇతర విధ్వంసకర ఆయుధాల వినియోగంలో ఉండే పరిణామాలను అంచనా వేయాల్సిందిగా శాస్త్రవేత్తలను కోరారు. డాక్టర్ హోమీబాబా, డాక్టర్ ఖానాల్కర్ తో పాటు ఆ పరిశోధనా పత్రాన్ని వెలువరించడంలో కొఠారి ఎంతో కీలకపాత్ర పోషించారు. ఈ ప్రముఖ శాస్త్రవేత్తలకు సహకరించిన యువ రక్షణ శాస్త్రవేత్తలతో మా నాన్న కూడా ఉన్నారు.

పది నుండి పన్నెండు నెలల పాటు కొనసాగిన ఆ పరిశోధనా కాలం మా నాన్న వృత్తి జీవితంలో ఎంతో ఒత్తిడితో కూడినదైనా మరువలేని కాలం. ఆ సమయంలో ఈ అంశం మీద చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంది. క్లాసిఫైడ్ సమాచారం చాలా వరకు భారతదేశానికి అప్పటిలో అందుబాటులో లేదు. అయినా ఒక సంవత్సరం కన్నా తక్కువ కాలంలోనే ‘ న్యూక్లియర్ ఎక్సప్లోజన్స్ అండ్ దెయిర్ ఎఫెక్ట్స్’ పేరుతో 212 పేజీల ఎంతో విలువైన సమాచారంతో కూడిన నివేదికను ఈ బృందం రూపొందించింది. ఇందులో కొఠారి గారి పాత్రే ఎంతో కీలకం. దీనికి పండిట్ నెహ్రు ముందు మాట రాశారు. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో పేరు పొందిన నివేదిక ఇది. అందులో కేవలం ప్రముఖ శాస్త్రవేత్తల పేర్లు మాత్రమే కాక మా నాన్న నాగరత్నం గారి వంటి యువ శాస్త్రవేత్తల పేర్లను కూడా ప్రస్తావించడం కొఠారి గారి వినమ్ర స్వభావానికి నిదర్శనం.

మా కుటుంబంలో కూడా కొఠారి గారి ఉన్నత వ్యక్తిత్వాన్ని గురించి ఎంతో ప్రముఖంగా చెప్పుకుంటూ ఉంటాము. ఒక ఆదివారం సాయంత్రం  నాలుగు గంటల ప్రాంతంలో మా అమ్మ నాన్న నివసిస్తున్న ఇంటి తలుపు ఎవరో తట్టినట్లు వినిపించింది. తలుపు తెరిచి చూస్తే ఎదురుగా డాక్టర్ కొఠారి నిలబడి ఉన్నారు. ఆ పుస్తకంలోని ఏదో అంశం మీద ఆయన అత్యవసరంగా మా నాన్నతో చర్చించాల్సి ఉంది. అప్పటికి మా ఇళ్లల్లో టెలిఫోన్ సదుపాయం లేదు. ఆయన ఆఫీస్ లో మా నాన్న ఉంటున్న ఇంటి అడ్రస్ అడిగి తెలుసుకుని నేరుగా వచ్చేసారు. ఆయన స్థాయిలో వేరే ఎవరైనా ఉంటే ఎవరినైనా పంపి నాన్నని ఆఫీస్ కి పిలిపించేవారు. ఆయన అలా కాదు. తానే స్వయంగా రావడం ఆయన వారికి ఇచ్చిన గౌరవం, సమయం ఆదా కూడా.

ఆ అమ్మ తన చివరి రోజులలో కూడా ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉండేది. అప్పటికి ఆమెది చాలా చిన్న వయసు. తమిళనాడు నుండి వచ్చి చంకలో పసి బిడ్డతో ఉంది. హిందీ రాదు. ఇంగ్లీష్ కూడా అంతంత మాత్రంగా వచ్చు. నాన్న దైవంగా భావించే మనిషి అలా అనుకోకుండా ఇంటికి రావడం ఆమెని ఎంతో కంగారు పెట్టింది. అప్పటికి మా ఇంట్లో కొన్ని గోద్రెజ్ కుర్చీలు, ఒక స్టడీ టేబుల్, ఒక మంచం మాత్రమే ఉండేవి. ఆ చిన్న ఆవాసానికి ఆయన రావడం ఆమెకి ఆశ్చర్యం అనిపించింది. నాకు తెలిసి ఆయన కాఫీ ఇవ్వమని అడిగి ఉంటారు. అప్పటికి ఇంకా దక్షిణాది కుటుంబాలలో తేయాకులు వాడే అలవాటు అంతగా లేదు. ఆమెకి ఎలా చేయాలో కూడా తెలీదు. ఆయనకి కాఫీ ఇవ్వడానికి స్టీల్ గ్లాస్ లు తప్ప కప్పు లు కూడా లేవు ఆ ఇంట్లో.

అయితే డాక్టర్ కొఠారి కి ఇవేమీ పట్టలేదు. ఆయన వచ్చి చక్కగా ఒక గోద్రెజ్ కుర్చీ లాక్కుని అందులో కూర్చుని ఒక గంట పాటు మా నాన్నతో మాట్లాడి అన్నయకి ఆశీర్వాదాలు తెలిపి నవ్వుతూ వెళ్లిపోయారని అమ్మ చెప్పేది.

ఆయన గడిపింది కొద్ధి గంటలే కానీ మా కుటుంబంలో అన్ని తరాలకీ మా అమ్మ ఆ సంఘటన గురించి ఆయన వ్యక్తిత్వం గురించి చెబుతూనే ఉండేది.

(డాక్టర్ కొఠారి లార్డ్ ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్ మార్గదర్శకత్వంలో కేంబ్రిడ్జి యూనివర్సిటీలోని కావెండిష్ లాబరేటరీ లో ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పి. బ్లాకెట్ తో కలిసి పనిచేశారు. రూథర్ఫోర్డ్ ని ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ గా పిలుస్తారు. వీరంతా కలిసి స్టాటిస్టికల్ థెర్మోడైనమిక్స్, థియరీ ఆఫ్ వైట్ డ్వార్ఫ్ స్టార్స్ వంటి అంశాల మీద ఎంతో విలువైన పరిశోధనలు చేశారు. డాక్టర్ కొఠారి డిఆర్డిఓ కి మాత్రమే కాదు దేశంలో ఎన్నో ప్రముఖమైన ల్యాబ్ ల స్థాపకులు కూడా. యు.జి.సి, యెన్.సి.ఈ.ఆర్.టి వంటి సంస్థల స్థాపనలో ఆయన ఎంతో కీలక పాత్ర పోషించారు. దేశంలో తొలి విద్యా కమిషన్ చైర్మన్ గా కూడా వ్యవరించారు)

–Based on a piece by Meena

బడి చదువు మేలా? ఇంటి చదువు మేలా? TO School or Not to School

గతవారం బ్లాగ్ లో కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో బడి పిల్లల భవిష్యత్తు ఎలా ఉండనుంది అని కొంత చర్చ చేసాం. కోట్లాది మంది పిల్లలు, ఉపాధ్యాయులు అప్పటివరకు పెద్దగా పరిచయం లేని డిజిటల్ బోధన, లెర్నింగ్ వైపుకు మళ్ళవలసిన అవసరం ఏర్పడింది. పిల్లలు ఇంటి దగ్గర నుండే నేర్చుకోవాల్సి రావడంతో తల్లితండ్రులు కూడా అదనపు బాధ్యతలు తీసుకోవలసి వచ్చింది. పిల్లలు ఇంటి వద్ద నుండే నేర్చుకునేందుకు ఉన్న మార్గాలేమిటి, ఏ పద్ధతిలో వారు మెరుగ్గా నేర్చుకోగలుగుతారు అనే విషయాలపై విస్తృతమైన చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది తల్లిదండ్రులు ఈ హోమ్ స్కూలింగ్ పద్ధతే బాగుందని కూడా అభిప్రాయ పడుతున్నారు.

పాఠశాల వ్యవస్థ ఇంకా రూపుదిద్దుకోని రోజుల్లోనే కొంతమంది తల్లిదండ్రులు ఈ హోమ్ స్కూలింగ్ తో ప్రయోగాలు చేశారు. రకరకాల వినూత్న బోధనా విధానాలను ఉపయోగించారు. వాటిలో ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణని ఇక్కడ ఇస్తున్నాను. 

ఇది 1847 నాటి కథ. ఏడేళ్ల ఆల్ అనే పిల్లవాడు కేవలం మూడు నెలలు మాత్రమే బడికి వెళ్ళాక ఒక రోజు ఇంటికి తిరిగి వచ్చాడు. చేతిలో టీచర్ ఇచ్చిన చిన్న కాగితం ఉంది. అందులో ఈ పిల్లవాడికి ఆలోచించే శక్తి లేదని, చదువులో ఎంతమాత్రం శ్రద్ధ లేదనీ, బడి నుండి పంపివేస్తున్నామని సమాచారం ఉంది. ఆల్ తల్లి నాన్సీ కి తన కొడుకు పట్ల బడి ఇచ్చిన తీర్పు పట్ల ఎంతో బాధ కలిగింది. అది ఆమె సవాలుగా తీసుకుని తన కొడుకుకి తానే ఇంటి దగ్గరే చదువు చెప్పాలని నిర్ణయించుకుంది. తన కొడుకుకి ఎంతో బెరుకు అని, మొహమాటస్థుడని ఆమెకి తెలుసు. అతనికి ఏమైనా వినికిడి లోపం ఉందేమో, దాని వలననే బడిలో చెప్పే విషయాలను గ్రహించలేకపోతున్నాడేమో అనుకుంది. ఒకప్పుడు ఆమె టీచర్ కావడంతో తన పిల్లవాడిని అర్ధం చేసుకుని అంచనా వేసే ప్రయత్నం చేసింది. అతనికి సాంప్రదాయ బోధనా పద్ధతిలో చదువు చెప్పడం విసుగు తెప్పిస్తుందని ఆమె అర్ధం చేసుకుంది. తన కొడుకులో ఉన్న కుతూహలాన్నీ, పుస్తక పఠనం పట్ల ఉన్న ప్రేమని ప్రోత్సహిస్తూ అతను స్వతంత్రంగా ఆలోచించేందుకు, ప్రయోగాలు చేసేందుకు, కొత్త కొత్త పనులను ప్రయత్నించేందుకు అవకాశం కల్పించింది.

ఆ పిల్లవాడికి యంత్ర సంబంధమైన విషయాలన్నా, వాటికి సంబంధించిన ప్రయోగాలన్నా చెప్పలేనంత ఆసక్తి. అతనికి తొమ్మిదేళ్ళ వయసులో వాళ్ళ అమ్మ రసాయన మూలకాలతో వివిధ రకాల ప్రయోగాల వివరాలు ఉన్న ఒక పుస్తకం ఇచ్చింది. ఆల్ ఆ పుస్తకాన్ని వదలకుండా చదివాడు. తన పాకెట్ మనీ ఖర్చు పెట్టి వీడి చివర ఉన్న ఫార్మసీ స్టోర్ నుండి తనకి కావలసిన రసాయన పదార్ధాలను కొనుక్కుని ప్రయోగాలు చేసేవాడు. తనకి పదేళ్ల వయసులో తమ ఇంటి బేస్మెంట్ లో ఒక చిన్న ప్రయోగశాలను ఏర్పాటు చేసుకుని గంటల తరబడి అందులోనే గడిపేవాడు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సాహిత్యం, చరిత్ర కూడా విస్తృతంగా చదివాడు. అలా కేవలం మూడు నెలలు మాత్రమే బడి ముఖం చూసిన పిల్లవాడు తన జీవితాంతం నేర్చుకుంటేనే ఉండేందుకు పునాదులు ఏర్పడ్డాయి.

అలా ఆల్ అని పిలవబడే థామస్ ఆల్వా ఎడిసన్ తన వినూత్న ఆవిష్కరణలతో ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తిగా ఎదిగాడు. లైట్ బల్బ్, ఫోనోగ్రాఫ్, మోషన్ పిక్చర్ కెమెరా లను ఆవిష్కరించడంతో పాటు టెలిగ్రాఫ్, టెలిఫోన్ ఆవిష్కరణలను కూడా ఎంతో మెరుగుపరిచాడు. తన 84 ఏళ్ళ జీవితంలో 1093 పేటెంట్ లను పొందాడు. కేవలం ఆవిష్కర్తగా మిగిలిపోకుండా తాను కనిపెట్టిన ఉత్పత్తులను పెద్ద ఎత్తున తయారు చేసి విజయవంతమైన వ్యాపారవేత్త గానూ మారాడు.

ఎడిసన్ కు 24 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు అతని తల్లి నాన్సీ మరణించింది. కానీ ఆమె తన జీవితాంతం తనకు స్ఫూర్తినిస్తూనే ఉందని ఎడిసన్ చెప్పుకునేవారు. “నన్ను ఇలా రూపుదిద్దింది ఆమే. నాపైన అమ్మకు అపారమైన విస్వాసం ఉండేది. ఆమెకోసమే నేను జీవించాలని, ఆమెని ఎప్పుడూ నిరాశపరచకూడదు అనీ అనిపిస్తుంది” అని ఒక సందర్భంలో ఎడిసన్ అన్నారు.

ఇంటి వద్దే చదువు చెప్పే తల్లితండ్రులందరూ నాన్సీ ఎడిసన్ లు కాలేరు. అలాగే ఇంటి వద్ద చదువుకున్న పిల్లలందరూ థామస్ ఆల్వా ఎడిసన్ లు కాలేరు. ఈ కథలో నాకు అన్నిటికన్నా ఆసక్తి కలిగించిన అంశం విద్యా విధానం పట్ల ఎడిసన్ కు ఉన్న దృక్పథం. అది అతని కాలానికి మాత్రమే పరిమితమైనది కాదు. అది ఈనాటి పరిస్థితులకు కూడా సరిగ్గా సరిపోయే ఆలోచనా దృక్పధం.

తన కాలంలో ఉన్న విద్యా వ్యవస్థను ఎడిసన్ ఇలా విమర్శించారు. “ఇప్పటి విద్యా వ్యవస్థ మనోవికాసానికి అవకాశం ఇవ్వదు. అది బుద్ధిని ఒక మూసలో ఉంచేందుకు ప్రయత్నిస్తుంది. బడిలో చెప్పిన దానిని పిల్లవాడు ఒప్పుకుని తీరాలి అని నేర్పిస్తుంది. వారి సృజనాత్మక ఆలోచనలకు, ప్రశ్నించే తత్వానికి అవకాశం ఇవ్వదు. పరిశీలన ద్వారా నేర్చుకోవడం కన్నా బట్టీ పట్టి నేర్చుకునేందుకే ప్రాధాన్యత ఇస్తుంది. తమ జీవితాలతో సంబంధం లేని విషయాలను బట్టీ కొట్టడమే తప్ప స్వంత ఆలోచనలకు తావు లేదు. దాని వలన భయం, భయం నుండి అజ్ఞానం పుట్టుకొస్తాయి”

ఎడిసన్ ది తీరని జ్ఞాన తృష్ణ. కేవలం పుస్తకాలలో ఉన్నదానిని అనుసరించడం కాకుండా తాను స్వయంగా పరిశోధించి విషయాలను తెలుసుకోవాలి అనుకునేవాడు. తన జీవితమంతా తాను చేసిన ప్రయోగాలను, పరిశీలనలను, తన ఆలోచనలను వివరంగా తన ప్రయోగశాలలోని నోటు పుస్తకాలలో రాసుకునేవారు. తాను ఒక వ్యాపారవేత్తగా ఎదిగాక కూడా తన కార్పొరేట్ ఆఫీస్ ను తన లైబ్రరీ లో ఏర్పాటు చేసుకున్నారు అంటే ఆయనకి అధ్యయనం అంటే ఎంత మక్కువో అర్ధం అవుతుంది. తన చిన్నతనంలో మొదలైన వినికిడి సమస్య తనతో పాటే పెరిగినా దానిని ఎప్పుడూ ఆయన సమస్యగా అనుకోలేదు. ఇన్ని కొత్త ఉత్పత్తులను కనిపెట్టిన మీరు ఒక వినికిడి యంత్రాన్ని ఎందుకు కనిపెట్టలేదు అని ఒకసారి ఆయనని ఎవరో అడిగారు. బయటి శబ్దాలు వినపడకపోవడం మంచిదే కదా నా ప్రయోగాల మీద ఎక్కువ ధ్యాస కుదురుతుంది అన్నారు ఎడిసన్. 

తాను ఎన్నో ప్రయోగశాలలు ఏర్పాటు చేసి, ఎంతో మంది సిబ్బందిని నియమించుకున్నాక కూడా తానే స్వయంగా పరిశోధనలు చేసుకునేందుకు ఆసక్తి చూపేవారు. 1890 లలో ఆయన ఒక వినూత్న పరిశోధన మొదలుపెట్టారు. భవనాల నిర్మాణానికి వాడే ఇటుకలు ఓపెన్ గా ఉండే గూడ్స్ రైళ్లలో తరలిస్తున్నప్పుడు వర్షం పడినట్లైతే తేమ ని పీల్చుకుని తడిగా ఉండేవి. ఆ పరిస్థితి లేకుండా వాన నీటిని గ్రహించి తేమ గా ఉండే ఇటుకలు తయారు చేయాలి అనుకున్నారు. రకరకాల పదార్ధాలతో బైండింగ్ సొల్యూషన్ ను తయారు చేసి చూసారు. ఎడిసన్, అతని సహోద్యోగులు దానిని “మక్” అని పిలిచేవారు. దానితో ఆ ప్రయోగంలో భాగస్వామ్యులైన వారందరినీ ఎడిసన్ “మక్కర్స్” అని పిలుస్తుండేవారు. ఇక ఎడిసన్ ప్రయోగశాలల్లో పని చేసే సిబ్బంది అందరికీ ఉమ్మడి పేరుగా “మక్కర్స్” స్థిరపడి పోయింది. వారంతా తర్వాత కాలంలో “ఎడిసన్స్ మక్కర్స్” పేరుతో మరొక సంస్థని కూడా స్థాపించుకున్నారు.

ఒక పేరెంట్ గా కూడా తన పిల్లలను పరిశీలన, పరిశోధన వైపు ప్రోత్సహించాడు. తాను ఏ పుస్తకం చదవాలనుకుంటున్నాడో పిల్లలకి చెప్పి తన విశాలమైన లైబ్రరీలో ఆ పుస్తకం కోసం వెతకమని పిల్లలకి చెప్పేవాడు. ఒక్కోసారి కొన్ని పేజీలు వెతికి పెట్టమని అడిగేవాడు. ఆ విధంగా పిల్లలకు పుస్తకాలతో సమయం గడిపే అవకాశం ఇస్తూ వారిని పుస్తక పఠనం వైపు ప్రోత్సహించాడు. 

ప్రస్తుత విద్యా విధానం పట్ల తన అసంతృప్తిని ప్రకటిస్తూనే తనకు మాంటిస్సోరి విద్యా విధానం పట్ల ఉన్న గౌరవాన్ని వ్యక్తం చేసాడు. “నాకు మాంటిస్సోరి పద్ధతిలో బోధన అంటే ఇష్టం. అది పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. ఈ పద్దతిలో నేర్చుకోవడం అనేది ఆనందాన్ని కలిగిస్తుంది తప్ప పిల్లలకు ఇబ్బందిగా ఉండదు. మనిషి సహజాతాలను అర్ధం చేసుకుంటే బోధించే వ్యవస్థ ఇది” అని ఒకచోట రాశారు. 1913 లో మరియా మాంటిస్సోరి తొలిసారి అమెరికా సందర్శించినప్పుడు ఎడిసన్ ఇంట్లోనే బస చేశారు.

ఎడిసన్ ఆవిష్కరణలు ప్రపంచంలో ఎన్నో మార్పులు తెచ్చాయి. సాంకేతిక విప్లవానికి ఆద్యులలో ఆయనను ఒకడిగా చెప్పుకోవచ్చు. కేవలం ప్రయోగాలు, ఫలితాల పట్ల మాత్రమే కాక ఎడిసన్ విద్యా విధానం పట్ల, నేర్చుకునే ప్రక్రియ పట్ల ఎంతో ఆసక్తి చూపించేవారు. తన తల్లి నేర్పిన నాలుగు సూత్రాలను తన జీవితాంతం పాటించారు. 

ఓటమి ఎదురైనప్పుడు నిరాశ చెందవద్దు. దాని నుండి నేర్చుకో. మళ్లీ ప్రయత్నించు. 

బుద్ధితో, చేతులతో రెండింటితో నేర్చుకో 

విలువైనవన్నీ పుస్తకాలలోనే దొరకవు – ప్రపంచాన్ని పరిశీలించు 

నేర్చుకోవడం ఎప్పటికీ ఆపవద్దు. అన్ని రకాల సాహిత్యాన్ని అధ్యయనం చెయ్యి.

ప్రతి పేరెంట్ కూడా ఈ విధమైన సూత్రాలను తమ పిల్లలకు నేర్పినట్లైతే వారు జీవితాంతం నేర్చుకునే ప్రక్రియని కొనసాగిస్తూనే ఉంటారు. 

దాదాపు శతాబ్దం తర్వాత కూడా విద్యా వ్యవస్థలో పెద్ద మార్పులేమీ రాలేదు. ఈ వ్యవస్థ భవిష్యత్తు ఎలా ఉండనుంది అనే ప్రశ్న ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సమాచార సాంకేతిక యుగంలో విద్యా వ్యవస్థని పునర్వ్యవస్థీకరించాలి అనుకుంటే పిల్లలను “మక్కర్స్” గా ఉండేలా ప్రోత్సహించేందుకు అవకాశం కల్పించాలి. అప్పుడే వారు నేర్చుకోవడంలోని ఆనందాన్ని గ్రహించగలుగుతారు.

–Based on a piece by Mamata

సుందరలాల్ బహుగుణ కి నివాళి: Sundarlal Bahugunaji

1970, 80 లలో యువతకు అత్యధికంగా స్ఫూర్తినిచ్చిన ఉద్యమాలలో చిప్కో ఒకటి. ఈ ఉద్యమం యువతకు పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి కలిగేలా చేయడమే కాదు శాంతియుతంగా ఉద్యమాలు నడిపే విధానాలకు కూడా ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచింది.

గాంధేయవాదం, సర్వోదయ ఉద్యమాలచే స్ఫూర్తి పొందిన సుందరలాల్ బహుగుణ, చండీప్రసాద్ భట్ ఈ చిప్కో ఉద్యమాన్ని ముందుండి నడిపిన కార్యశీలురు. పర్యావరణ వినాశనానికి ప్రజల సంక్షేమం, జీవనోపాధులకు మధ్య ఉన్న సంబంధాన్ని అర్ధం చేసుకున్న తొలి ఉద్యమంగా చిప్కోని చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో ఉన్న తెహ్రి గరవాల్ ప్రాంతంలోని ప్రజలను సర్వోదయ పద్ధతులకు అనుగుణంగా సమీకరించడంతో పాటు వారి జీవనోపాధులు, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి ఎన్నో అంశాలపై బహుగుణ అనేక దశాబ్దాల పాటు పని చేశారు.

ఆ దశాబ్దాల తరబడి సాగిన కృషే చిప్కో ఉద్యమానికి బీజాలు వేసింది.

చిప్కో ఉద్యమ ప్రస్థానం 1970 వర్ష ఋతువులో ప్రారంభమయ్యింది. అలకనంద తో పాటు ఇతర హిమాలయా నదులన్నీ పోటెత్తి ఆ పక్కన లోయలోని గ్రామాలన్నింటినీ వరద నీటితో ముంచెత్తాయి. ఊర్లన్నీ నీటిలో మునిగి ఎంతో విధ్వంసం జరిగింది. కొండ వాలులలో ఉన్న వృక్షాలను కొట్టి వేసుకుంటూ పోవడమే ఈ ఉత్పాతానికి కారణం అయింది అని అక్కడి ప్రజలందరికీ స్పష్టంగా అర్ధమయ్యింది. అప్పటికి ఎన్నో సంవత్సరాల నుండి అటవీ కాంట్రాక్టర్ లు ఆ ప్రాంతంలోని చెట్లని నరికి కలపని నగరాలకు తరలిస్తున్నారు. దానితో కొండవాలులన్నీ పెళుసుగా మారి, నీటి ప్రవాహాన్ని ఆపలేక వరదలకు కారణమవుతున్నాయి. ఇంతే కాకుండా చెట్లని నరికేందుకు కాంట్రాక్టర్లకు అనుమతి నివ్వడం వలన తమ ఆహారం కోసం, వంట చెరకు కోసం, వైద్యం కోసం, కలప కోసం అడవిపై ఆధారపడి జీవించే స్థానికులకు ఆ చెట్లపై ఏ హక్కు లేకుండా పోయింది. అక్కడి అడవి అంతా ఓక్ చెట్లతో నిండి ఉంది. స్థానికులకు ఆ చెట్లతో ఎంతో అనుబంధం ఉంది. ఆ చెట్ల ఉత్పత్తులను వివిధ ప్రయోజనాలకు ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన ఉంది. అయితే కాంట్రాక్టర్లు ఆ చెట్లను నాశనం చేయడంతో పాటు చిర్ పైన్ చెట్లను అక్కడ పెంచడం మొదలుపెట్టారు. ఈ పైన్ చెట్లు అక్కడి వాతావరణానికి తగినవి కావు. స్థానికులకు వాటివలన ఉపయోగమూ లేదు. అయితే పైన్ కలపకి మార్కెట్ లో ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని కాంట్రాక్టర్లు వాటిని పెంచడం ప్రారంభించారు. ఇవన్నీ కూడా అక్కడి స్థానికులలో అసహనానికి కారణమయ్యాయి.

1973 మార్చ్ లో ఒక ఉదయాన తొలిసారిగా ఉద్యమానికి అగ్గి రగులుకుంది. అలహాబాద్ లోని ఒక క్రీడా ఉత్పత్తులు తయారు చేసే ఫ్యాక్టరీ కి సంబంధించిన మనుషులు చమోలీ జిల్లాలోని గోపేశ్వర్ గ్రామానికి వచ్చారు. అక్కడి చెట్లను నరికి క్రికెట్ బాట్ ల తయారీ చేయాలనేది వారి ఉద్దేశం.

గ్రామస్థులు ఆ చెట్లని ధ్వంసం చేసేటందుకు ఎంతమాత్రమూ సిద్ధంగా లేరు. ఆ చెట్లు నరికేందుకు వచ్చిన మనుషులను వెనక్కి వెళ్లిపోవాలని కోరారు. అయితే వారికి చెట్లని నరకమని ఆదేశాలు ఉండడంతో వారు వెనక్కి వెళ్లేందుకు తిరస్కరించారు. గ్రామస్థులంతా కలిసి అప్పటికప్పుడు ఆలోచించుకుని తమ ప్రాణాలు పోయినా సరే ఒక్క చెట్టుని కూడా తాకనివ్వకూడదని నిర్ణయించుకున్నారు. చిప్కో, చిప్కో (చెట్లని కౌగలించుకోండి) అని అరుచుకుంటూ ముందుకు నడిచారు. చెట్లను చుట్టుకుని వదలలేదు. ఏమి చేయాలో తెలియని ఫ్యాక్టరీ మనుషులు ఒక్క చెట్టుని కూడా నరకకుండానే తిరిగి వెళ్లిపోయారు.

ఆ పోరాటంలో వారు స్థానికులు విజయం సాధించారు. కానీ యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండు నెలల తర్వాత గోపేశ్వర్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంపూర్ ఫతా గ్రామం దగ్గర అడవిలో చెట్లను కొట్టేందుకు అటవీ అధికారుల నుండి కాంట్రాక్టర్లు అనుమతి సంపాదించారు.

ఈ వార్త గోపేశ్వర్ కు చేరింది. జనం మండిపడ్డారు. మొత్తం గ్రామంలోని స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అంతా కలిసి ఒక ఉరేగింపులాగా ఫతా బాట పట్టారు. తప్పెట్లు, తాళాలు మోగిస్తూ దారిలోని అందరి దృష్టిని ఆకర్షించారు. “నన్ను నరకండి, చెట్టును మాత్రం నరకొద్దు” అని రాసి ఉన్న బ్యానర్లు ప్రదర్శించారు. పాటలు పాడుతూ, నినాదాలు చేస్తూ ఫతా కు చేరుకున్నారు. దారిలో అనేక గ్రామాల ప్రజలు వారితో జత కలిశారు. వారందరి నోటి నుండి వెలువడిన ‘చిప్కో’ నినాదం ఆ అటవీ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది.

చెట్ల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్న అంత పెద్ద జనసందోహాన్ని చూసిన కాంట్రాక్టర్ల మనుషులు తిరిగి ఉట్టి చేతులతో వెళ్ళక తప్పలేదు. 

తమ అడవిని, పర్యావరణాన్ని తాము కాపాడుకోగలమనే నమ్మకం స్థానికులలో బలపడింది.

అయితే కాంట్రాక్టర్లు కూడా తమ పధకాలు తాము రచిస్తూనే ఉన్నారు. లాభాల పంట కురిపించే చెట్లను అంత తేలికగా వదులుకునేందుకు వారు సిద్ధంగా లేరు. ఒకసారి రేని గ్రామంలో మగవారు అంతా ఊరిలో లేరని తెలుసుకున్న కాంట్రాక్టర్లు ఇదే అదనుగా తమ మనుషులను చెట్లు కొట్టుకురమ్మని పంపారు. ఆ వార్త ఊరంతా తెలిసింది. గౌరా దేవి ఆధ్వర్యంలో ఊరిలోని మహిళలు, పిల్లలు ఊరేగింపుగా అడవి వైపు నడిచారు. ఈ మహిళలు తమనేమి చేయగలరులే అని వచ్చిన వారు ధీమాగా ఉన్నారు. వారి ఊహ తప్పని వెంటనే తెలిసింది. తాము అంతా చెట్లని కౌగలించుకుని ఉంటామని, ఒక్క చెట్టుని కూడా ముట్టుకోనివ్వమని గౌరా దేవి స్పష్టంగా చెప్పింది. “ముందు మమ్మల్ని నరకండి. అప్పుడే మా తల్లి లాంటి ఈ అడవి జోలికి వెళ్ళండి” అని మహిళలంతా ఎదురు నిలబడ్డారు.

మరొకసారి కాంట్రాక్టర్ల మనుషులు ఉట్టి చేతులతో తిరుగు ప్రయాణమయ్యారు. 

వారిని ఉట్టి చేతులతో పంపించడమే కాదు. మహిళలంతా కలిసి అసలా కాంట్రాక్టర్ల మనుషులు అడవిలోకి ఎటు నుండి వస్తున్నారు అని ఆలోచన చేశారు. వారు అడవిని చేరుకుంటున్న మార్గాన్ని కనిపెట్టారు. కొండవాలులో ఉన్న ఒక దారి గుండా వారు అడవికి వస్తున్నారు. కొండచరియలు విరిగి పడినప్పుడు ఆ దారి మధ్యలో విరిగిపోతే ఆ విరిగిన దారిని ఒక పెద్ద సిమెంట్ రాయి సహాయంతో కాంట్రాక్టర్లు దాటుతున్నారు. అది ఒక్కటే ఊరి వారి కంట పడకుండా అడవిలోకి రావడానికి కాంట్రాక్టర్లకు ఉన్న మార్గం. మహిళలంతా కలిసి చర్చించారు. ఒక బలమైన దుంగ సహాయంతో వారందరి బలం ఉపయోగించి ఆ సిమెంట్ రాయిని లోయలోకి తోసేశారు. ఇక ఆ దారిలోనుండి కాంట్రాక్టర్లు అడవిలోకి రాలేరు!

అలా మొదలైన చిప్కో ఉద్యమం ఆ ప్రాంతంలోనే కాదు దేశంలోనూ, ప్రపంచంలోనూ అనేకమందిలో పర్యావరణ స్పృహ పెరిగేలా చేసింది. 

సుందరలాల్ బహుగుణ హిమాలయ ప్రాంతంలో దాదాపు 5000 కిలోమీటర్లు కాలినడకన తిరిగి ఈ ఉద్యమం పట్ల అన్ని ఊర్లలోని ప్రజలలో విస్తృతంగా చైతన్యం తేగలిగారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీతో మాట్లాడి 1980 నుండి దాదాపు 15 సంవత్సరాల పాటు పచ్చని చెట్లను నరకకుండా ఆదేశాలు తేగలిగారు. తెహ్రి డామ్ కు వ్యతిరేకంగా కూడా బహుగుణ గాంధేయమార్గంలో అనేక శాంతియుత ఉద్యమాలు నిర్వహించారు. 

ప్రజా సంక్షేమం కోసం తాను నమ్మిన మార్గంలో రాజీ లేకుండా నడిచిన అరుదైన వ్యక్తిత్వం బహుగుణది. అటువంటి వ్యక్తులు తమ వారసత్వంగా మనకి అందించిన మార్గంలో మనం నడుస్తున్నామా లేదా అనేదే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న!

— Based on a piece by Meena

శ్రీనివాస రామానుజన్: ఒక పుస్తకం, ఒక సినిమా: Srinivasa Ramanujan

మొన్న ఏప్రిల్ 26 న 20 వ శతాబ్దపు అరుదైన గణిత మేధావులలో ఒకరైన శ్రీనివాస రామానుజన్ 101 వ వర్ధంతి. అనుకోకుండా అదే రోజుకు నేను డేవిడ్ లీవిట్ రాసిన “ది ఇండియన్ క్లర్క్” అనే పుస్తకాన్ని చదవడం పూర్తి చేసాను. ఆ తర్వాత “ది మాన్ హూ న్యూ ఇన్ఫినిటీ” అనే సినిమా కూడా చూసాను.

పుస్తకానికి వచ్చేసరికి ఎన్నో చోట్ల ప్రధాన వస్తువు నుండి విషయం పక్కదోవ పట్టినట్లు అనిపించినా గణిత మేధావి రామానుజన్ నుండి మాత్రం దృష్టి మరల్చలేదు. దక్షిణ భారత దేశంలోని ఒక దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన పిల్లవాడు 1910 ప్రాంతంలో ఏ మాత్రం సంసిద్ధంగా లేకుండానే ఇంగ్లాండ్ ప్రయాణానికి బయలుదేరడం ఎంతో హృద్యంగా వివరించబడింది. గణితంలో అద్భుతమైన మేధావిగా ప్రపంచ ఖ్యాతి పొందిన రామానుజన్ యువకుడిగా ఎంతో బలహీనంగా, ఒంటరిగా, బెరుకుగా, మూడీ గా ఉండేవాడు. ఆరోగ్యంగా ఉండడానికి తగినంత ఆహారం తీసుకునేవాడు కాదు. తాను పూర్తి శాకాహారి కావడంతో తన ఆహారం తానే తయారుచేసుకునేవాడు. మొదటి ప్రపంచ యుద్ధం మొదలయిన సందర్భంలో వంట చేసుకునేందుకు సరుకులు, పండ్లు, కూరగాయలు దొరికేవి కావు. దీనికి తోడు అక్కడి చలి వాతావరణం అలవాటు లేకపోవడం అతని ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసి 32 ఏళ్ళ చిన్న వయసులోనే అకాలమరణానికి కారణమయింది.

బంధుమిత్రులకు, భార్యకు దూరంగా తనది కాని కొత్త ప్రాంతంలో అతనెంతో ఒంటరితనాన్ని అనుభవించి ఉంటాడు.

శరీరం, హృదయం, ఆత్మ దిగులుతో కృశిస్తున్నా అతని మెదడు మాత్రం ఉత్సాహంతో పరుగులు తీసింది. అతనిని ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జి కి రప్పించిన ప్రొఫెసర్ హార్డీ తో ఎన్నో మేధోపరమైన చర్చలు జరిపేవాడు. గణితంలో తన మేధాశక్తికి కారణమైన అంశాలను గుర్తించడం పట్ల రామానుజన్ కి ఉన్న వ్యతిరేకత వలన వారిద్దరికీ తరచూ వాదన జరిగేది. తన మేధోశక్తికి కారణం నామగిరి దేవత అనుగ్రహమే అనే అతని వాదన హార్డీకి ఆగ్రహం తెప్పించేది.

మొత్తం 37 పబ్లిష్ చేయబడిన పేపర్లు, మూడు నోట్ పుస్తకాలలో ఆయన రూపొందించిన గణిత సూత్రాల సమాచారం అంతా పొందుపరచబడి ఉంది. మరొక నోట్ పుస్తకం 1976 లో దొరికింది. అందులో దాదాపు 4000 గణిత సూత్రాలు ఉన్నప్పటికీ తగిన ఆధారాలతో నిరూపించబడి లేవు. ఆయన మరణం తర్వాత ఈ శతాబ్ద కాలంలో అవి అన్నీ నిరూపించబడ్డాయి. ఇప్పటికీ ఎంతో మంది గణిత శాస్త్రవేత్తలకు రామానుజన్ గణిత సూత్రాలే స్ఫూర్తినిస్తున్నాయి.

ఇవన్నీ ఆ పుస్తకం నుండి గ్రహించిన విషయాలు. 

ఇక సినిమా విషయానికి వస్తే రామానుజన్ గా దేవ్ పటేల్ నటించడం నన్నెంతో అసంతృప్తికి గురిచేసింది. పొట్టిగా, పీలగా, బలహీనంగా కనిపించే రామానుజన్ పాత్రలో పొడవుగా, దృఢంగా ఉన్న పటేల్ అసలు ఇమడలేకపోయాడు. నటుడు ఎంత గొప్పవాడైనా శారీరకంగా కూడా ఇద్దరికీ సారూప్యత ఉండడం అవసరం అనిపించింది. గాంధీ సినిమాలో బెన్ కింగ్స్లే నటన గాంధీ పాత్రకు ఎంత ప్రాణం పోసిందో అతని రూపం కూడా అంతగా న్యాయం చేసిందని చెప్పాలి. దానితో పాటు ఒక శతాబ్దం క్రితం తమిళనాడులోని జీవన విధానం పట్ల కూడా మరింత దృష్టి పెట్టి ఉండవలసింది అనిపించింది.

పుస్తకం, సినిమా రెండు కూడా సాధారణ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ గణితాన్ని చొప్పించకుండా రూపొందించినప్పటికీ కాస్తో కూస్తో పుస్తకమే గణితాన్ని తగినంతగా చర్చించింది అని చెప్పాలి. రామానుజన్ భార్య, తల్లిల మధ్య ఉన్న అత్తాకోడళ్ల వివాదాలను పుస్తకం, సినిమా రెండింటిలో చిత్రించినప్పటికీ సినిమాలో తల్లిపాత్ర పట్ల కొంత ఎక్కువ సానుభూతి వ్యక్తం చేసినట్లు అనిపించింది.

మొత్తం మీద ఒక గణిత మేధావి జీవితాన్ని, తన స్వల్ప జీవితకాలంలో ఆయన సాధించిన అసమాన విజయాలను అర్ధం చేసుకునేందుకు ఈ రెండూ ఉపయోగపడతాయి. మన సమయానికి తగిన విలువ అని ఖచ్చితంగా చెప్పగలను.

అయితే ఈ పుస్తకం కన్నా రాబర్ట్ కనిగళ్ రాసిన ‘ది మాన్ హూ న్యూ ఇన్ఫినిటీ” మరింత లోతైన పుస్తకం. ‘రామానుజన్’ పేరుతోనే మరొక సినిమా కూడా ఉంది. దానిని నేను ఇంకా చూడలేదు.

–Based on a piece by Meena

బహుముఖ ప్రజ్ఞాశాలి కమలాదేవి చటోపాధ్యాయ: Kamaladevi

మహిళలను ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనమని పిలుపు నివ్వవలసిందిగా కోరి గాంధీజీ ని ఒప్పించిందామె.

జవహర్లాల్ నెహ్రు తో కలిసి ప్రచార కార్యక్రమాలలో పాలుపంచుకుంది.

సర్దార్ పటేల్ తో వాదించి ఆయనని ఒప్పించింది.

కంచి శంకరాచార్యులతో కలిసి ఆలయాలలో ఉన్న బ్యూరోక్రసీ వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేశారు.

ఇందిరా గాంధి మీద ఫిర్యాదు చేసింది. (అందుకు ప్రతిఫలం కూడా అనుభవించింది)

తన నాటక బృందంతో కలిసి విస్తృతంగా పర్యటించి ప్రేక్షకుల మెప్పు పొందింది.

మొదటి కన్నడ మూకీ సినిమాలో నటించింది

భారతదేశంలో ఎం.ఎల్.ఏ పదవికి పోటీ చేసిన తొలి మహిళ కూడా ఆమే.

పిల్లల భద్రత గురించి, పని ప్రదేశాలలో మహిళల ప్రాతినిధ్యానికి సంబంధించి చట్టాల గురించి చర్చకు మొదటిగా తెరలేపింది ఆమే.

ఆరోగ్యం మహిళల హక్కు అని అంతర్జాతీయ స్థాయిలో చర్చించి, ఇళ్ళలో స్త్రీలు చేసే పనికి ఆర్ధిక విలువని లెక్కకట్టడంపై ప్రపంచమంతా దృష్టి పెట్టేలా చేసింది కూడా ఆమే.

ఆమె అంతరించిపోతున్న హస్తకళలకు పునరుజ్జీవనం చేసే ప్రయత్నం చేసింది..

ఈ రోజు దేశ పురోగతిలో ప్రముఖ పాత్ర వహిస్తున్న అనేక సంస్థలను ఆమె స్థాపించింది.

మొన్న ఏప్రిల్ మూడవ తేదీన ఆమె జయంతి సందర్భంగా స్మరించుకున్న కమలాదేవి చటోపాధ్యాయ బహుముఖ ప్రజ్ఞావంతురాలు. ఆమె కు ముందు కాలంలోనూ, ఆమె జీవించిన కాలంలోనూ అంత ప్రతిభ కలిగిన స్త్రీ మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఎంతో మంది ఎన్నో జన్మలెత్తినా సాధించలేని పనులను ఆమె ఒక్క జీవితకాలంలో సాధించారు.

1903 లో మంగళూరు లో జన్మించిన ఆమెపై అప్పటికే జాతీయవాద ఉద్యమాలలో చురుకుగా పాలుపంచుకుంటున్న తల్లిదండ్రుల ప్రభావం ఎంతో ఉంది. మహాదేవ్ రనడే, రమాబాయి రనడే, గోపాలకృష్ణ గోఖలే, అనిబిసెంట్ వంటి స్వాత్రంత్ర సమరయోధులు వారి కుటుంబానికి స్నేహితులు కావడం ఆమె జీవిత గమనాన్ని నిర్దేశించింది. ఆమె తండ్రి తన చిన్న వయసులోనే మరణించగా ఆమె తల్లి తనను ఎంతో ప్రోత్సహించి ఆమె వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది.

ఆమెకు 14 సంవత్సరాల వయసులో వివాహం జరగగా రెండు సంవత్సరాలకు ఆమె భర్త మరణించారు. తర్వాత హరింద్రనాథ్ చటోపాధ్యాయ ను పునర్వివాహం చేసుకున్నా కొన్ని సంవత్సరాల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు.

ఆమె దేశానికి అందించిన సేవలకు ప్రధానంగా మూడు దశలు ఉన్నాయి.

స్వాతంత్రోద్యమంలో ఆమె పాత్ర: 1923 లో ఆమె ఇంగ్లాండ్ లో ఉండగా గాంధీజీ ప్రారంభించిన సహాయనిరాకరణోద్యమం గురించి విని వెంటనే భారతదేశం తిరిగివచ్చి ఉద్యమంలో పాలుపంచుకున్నారు. సేవాదళ్ లో చేరారు. అఖిల భారత మహిళా సదస్సుకు వ్యవస్థాపక సభ్యురాలిగా ఉన్నారు. ముంబై లో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించేందుకు సహకరించారు.

కాందీశీకుల కోసం ఆమె చేసిన సేవలు: దేశ విభజన తర్వాత పాకిస్థాన్ నుండి భారతదేశం చేరుకుంటున్న అనేక మంది దుర్భర పరిస్థితులు చూసి చలించిన ఆమె వారి సమస్యలపై పని చేశారు. స్వయం సహాయం, సహకారం ప్రగతికి మార్గాలని బలంగా నమ్మి కాందిశీకుల పునరావాసం పై పని చేసేందుకు ఇండియన్ కోఆపరేటివ్ యూనియన్ ను స్థాపించారు. ఫరీదాబాద్ దగ్గర నిర్మించిన టౌన్షిప్ ఆమె ప్రయత్నాలలో ఒకటి. దాదాపు 50000 మంది కాందిశీకులకు అక్కడ గృహాలు నిర్మించడంతో పాటు వారికి నూతన నైపుణ్యాలు నేర్పించడం ద్వారా జీవనోపాధి కల్పించే ప్రయత్నాలు చేశారు.

కళాకారులు, హస్తకళలపై ఆమె చేసిన కృషి: కళలు, హస్తకళల పట్ల ఎంతో అనురక్తి ఉన్న ఆమె దేశంలో ఎన్నో కోట్ల మందికి జీవనోపాధి కల్పించడంలో వాటికి ఉన్న పాత్రని గుర్తించింది. పెద్ద ఎత్తున జరుగుతున్న యాంత్రికీకరణ వలన ఈ కళలు మరుగున పడే అవకాశం ఉన్నదని గుర్తించిన ఆమె వాటిని పునరుజ్జీవింప చేసి తద్వార వారి జీవనోపాధులకు భద్రత కల్పించే ప్రయత్నం చేసింది.

సంగీత నాటక అకాడమీ, సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఎంపోరియం, క్రాఫ్ట్స్ కౌన్సిల్, ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ వంటి ఎన్నో సంస్థలలో ఆమె చురుకైన పాత్ర పోషించారు.

ఆమె గొప్ప రచయిత్రి కూడా ఆమె ఆత్మ కథ ఇన్నర్ రేసెస్స్, ఔటర్ స్పేసేస్, మెమొయిర్స్ చదివితే ఆమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవొచ్చు. జస్లీన్ ధామిజా ప్రేమతో రాసిన కమలాదేవి జీవిత చరిత్ర కూడా ఎంతో గొప్ప పుస్తకం. 200 పేజీలలో నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ఈ పుస్తకం చదివితే అంత చిన్న పుస్తకంలో ఇన్ని విషయాలను కూర్చవచ్చా అని ఆశ్చర్యానికి లోనవుతారు. దాని ధర కూడా కేవలం వంద రూపాయలే.

From a post by Meena

సంకోఫా – Sankofa

కొన్ని రోజుల క్రితం నా మేనకోడలు, భారతదేశంలో ‘సంకోఫా’ మాదిరిగానే మనకు ఒక భావన లేదా చిహ్నం ఉందా అని అడిగింది. ఇది నాకు క్రొత్త పదం. నేను వెంటనే దీని గురించి మరింత తెలుసుకోవాలనుకున్నాను. కొంత పరిశోధనతో ఎంతో అర్ధవంతమైన సంకోఫా భావన గురించి తెలుసుకున్నాను.

సంకోఫా భావన పశ్చిమ ఆఫ్రికాలోని ఘనాలోని అకాన్ ప్రజల రాజు ఆదింకెరా నుండి తీసుకోబడింది. సంకోఫా అనే పదం అకాన్ భాషలోని మూడు పదాల నుండి ఉద్భవించింది: శాన్ (తిరిగి), కో (వెళ్ళు), ఫా (చూడండి, వెతకండి మరియు తీసుకోండి).  దీనిని యధాతధంగా అనువదిస్తే “తిరిగి వెళ్ళి చూడండి” అని అర్ధం వస్తుంది. అకాన్ మాండలికంలో ఈ భావన “సే వో ఫి ఫి నా వోసాన్ కోఫా ఎ యెంకి” అని వ్యక్తీకరించబడింది. దీని అర్థం “తిరిగి వెళ్లి మీరు మరచిపోయిన వాటిని పొందడం నిషిద్ధం కాదు” అని.

భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకునేందుకు గతం మార్గదర్శనం చేస్తుందనే అకాన్ ప్రజల బలమైన నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. కాలంతో పాటు ముందుకు సాగడం, కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల అకాన్ ప్రజలకు విశ్వాసం ఉన్నప్పటికీ గతం నుండి నేర్చుకున్న వివేకమే బలమైన భవిష్యత్తుకి పునాది అని కూడా వారు సూచిస్తారు.

ఈ సంకోఫా అనే భావనకు ప్రతీకగా వారు ఒక పౌరాణిక పక్షి రూపాన్ని ఉపయోగిస్తారు. దాని పాదాలు నేలపై దృఢంగా ఆనించి  (లేదా ముందుకు సాగుతున్నట్లు సూచించేలా ఎగురుతున్నట్లుగా) ఉండి తల మాత్రం వెనుకకి తిరిగి (గతాన్ని చూస్తున్నట్లు) ఉంటుంది.

సంకోఫా పక్షిని ఎప్పుడూ నోటిలో గుడ్డుతో చూపిస్తారు. ఒక్కోసారి వెనుకకి తిరిగి గుడ్డు ని నోటితో తీస్తున్నట్లుగా కూడా చూపిస్తుంటారు. ఈ గుడ్డు అనేది గతం నుండి పొందిన విజ్ఞానానికి లేదా ఆ విజ్ఞానం వలన లబ్ది పొందే భవిష్యత్తు తరానికి ప్రతీకగా వారు భావిస్తారు. ఈ విధంగా, భవిష్యత్ ప్రణాళికలకు గతం ఒక మార్గదర్శిగా ఉపయోగపడుతుందనే అకాన్ ప్రజల నమ్మకాన్ని ఈ పక్షి దృశ్యాత్మకంగా చూపిస్తుంది.

గతకాలపు అనుభవాలను అవలోకనం చేసుకుని, వాటి నుండి నేర్చుకున్న పాఠాలను గ్రహించడానికి ఎంతో ప్రయత్నం అవసరం అనేది వెనుక ఉన్న గుడ్డును మెడని చాచి పక్షి అందుకున్నట్లుగా చూపించడం వెనుక ఉన్న ఉద్దేశం.

జీవితంలో మనం ముందుకు సాగాలంటే మన మూలాలకు తిరిగి వెళ్లాలని సంకోఫా మనకు బోధిస్తుంది. దాని అర్ధం గతంలోనే ఉండిపొమ్మని కాదు. గడిచిపోయిన కాలం మనకు అందిస్తున్న పాఠాలను, జ్ఞానాన్ని ప్రస్తుత జీవనానికి అన్వయించుకోవడం ద్వారా భవిష్యత్తు వైపు ప్రయాణించమని దాని అర్ధం. గతకాలంలో మనం చేసిన మంచి చెడులే మన ప్రస్తుత పరిస్థితిని నిర్దేశిస్తాయి. మనం చేసిన లేదా మనకు ఎదురైన మంచి పనుల నుండే కాకుండా గతంలో మనం చేసిన చెడు నుండి, తప్పుల నుండి కూడా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరాన్ని సంకోఫా సూచిస్తుంది. ఈ అవలోకనం వలన గతంలో చేసిన తప్పులు మనం తిరిగి చేయకుండా ఉంటాము.

గతానికి, గత చరిత్రకు, పెద్దలకు, పూర్వీకులకు ఇవ్వవలసిన గౌరవాన్ని సంకోఫా మనకు గుర్తు చేస్తుంది. ప్రపంచంలోని అన్ని పురాతన సంస్కృతులు కూడా పెద్దలను గౌరవించే సాంప్రదాయాన్ని పాటిస్తూ వారిని గత కాలపు జ్ఞానాన్ని, అనుభవాలను తర్వాత తరాలకు అందించే జ్ఞాన బాండాగారాలుగా భావిస్తాయి. అయితే ఇటీవల కాలంలో ఈ పెద్దల సహజ విజ్ఞానాన్ని చాదస్తం పేరుతో కొట్టిపడేసే ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. గూగుల్ గురు లో సమస్త సమాచారం అందుబాటులో ఉన్నప్పుడు ఏదైనా పాత విషయాల గురించి తెలుసుకోవాలంటే తాతలను, మామ్మలను అడగడం ఎందుకు? అయితే ఈ పారంపర్య జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసే ప్రయత్నం ఇటీవల ఒకటి జరిగింది. 

2007 జులై లో నెల్సన్ మండేలా తన 89 వ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచంలోని దీర్ఘకాల సంక్షోభాలను పరిష్కరించడానికి, యుద్ధాలను నివారించి, శాంతిని పెంపొందించడానికి గానూ కొత్త మార్గాలను కనుగొనటానికి అంకితమైన పెద్దల మండలిని ఏర్పాటు చేశారు. మండేలా మాటలలో చెప్పాలంటే ఈ వృద్దులు భయం నెలకొని ఉన్న చోట ధైర్యాన్ని నింపుతారు, సంఘర్షణ ఉన్న చోట శాంతి నెలకొల్పుతారు; నిరాశా నిస్పృహల స్థానంలో ఆశని నింపుతారు.

ఈ పెద్దలంతా అంతర్జాతీయంగా గౌరవాన్ని, గుర్తింపును, విశ్వాసాన్ని చూరగొన్న నాయకులు. వారు ఇప్పుడు ప్రభుత్వంతో, మరే ఇతర లాభాపేక్ష గల సంస్థతో సంబంధం లేకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తారు.

ఈ పెద్దల మండలిలో భారత దేశం నుండి ఈలా భట్; ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్; మాజీ అమెరికన్ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్; సౌత్ ఆఫ్రికా కు చెందిన విశ్రాంత ఆర్చిబిషప్ డెస్మండ్ టూటూ ముఖ్య సభ్యులుగా ఉన్నారు. మాజీ నార్వే ప్రైమ్ మినిస్టర్ గ్రో హార్లెమ్; బాలల హక్కులపై పని చేస్తున్న మండేలా సతీమణి గ్రాసా మాచెల్; మాజీ ఐరిష్ ప్రెసిడెంట్ మేరీ రాబిన్సన్; మైక్రో-క్రెడిట్ ఉద్యమ రూపశిల్పి, గ్రామీణ బ్యాంకు వ్యవస్థాపకుడు అయినా ముహమ్మద్ యూనిస్ లు ఇందులో ఇతర సభ్యులుగా ఉన్నారు.

సంఘర్షణ, గందరగోళాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచానికి మార్గదర్శకత్వం చేయడానికి ఇది ఎంతో స్ఫూర్తిదాయకమైన, అవసరమైన ప్రయత్నం.

అయితే ఈ నాటి ప్రపంచం గతాన్ని చూసే పద్దతిలో ఒక ప్రమాదకరమైన ధోరణి కనిపిస్తుంది. గత అనుభవాల నుండి నేర్చుకునే దాని కన్నా గతం నుండి తమకు అనుకూలమైన వాటిని వెలికి తీసి ప్రస్తుత రాజకీయ అజెండాలకు, మత వాతావరణానికి తగినట్లు ఆ భావాలను శాశ్వతంగా కొనసాగేలా చూడడానికి ప్రయత్నం జరుగుతుంది. మరొకవైపు కొన్ని అంశాలలో అసలు చరిత్ర అంతటినీ తుడిచిపెట్టి మళ్ళీ కొత్త భావాలను పునర్నిర్మించే ప్రయత్నం జరుగుతుంది.

మన అహంకారపు భావజాలాలతో గతం మనకి అందించే అమూల్యమైన పాఠాలను విస్మరించకూడదనీ, మన గత అడుగులను తరచి చూసుకుంటూ అవసరమైన చోటల్లా మన దారులను మార్చుకునేందుకు సిద్ధంగా ఉండాలనీ సంకోఫా మనకు గుర్తుచేస్తుంది. ఒక పాత సామెతలో ప్రస్తావించినట్లు, చరిత్రను మర్చిపోయిన వారు దానినే పునరావృతం చేస్తుంటారు.

వెనక్కి తిరిగి మన మూలలను తరచి చూసుకోవడానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు. సంకోఫా అనే ఈ చిన్న పదం ఇంత లోతైన భావనను సూచిస్తుంది.

ఈ పదాన్ని నాకు పరిచయం చేసిన సుపర్ణకు కృతజ్ఞతలు.

From a piece by Mamata.

మరియా మాంటిస్సోరి : Montessori–For All Our Children

ఆగస్ట్ 31 మరియా మాంటిస్సోరి జయంతి. ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. దాదాపు మన పిల్లలందరూ చదువుకునే మాంటిస్సోరి విద్యా వ్యవస్థ రూపకర్త ఆమె. అయితే ఈ విప్లవాత్మకమైన విద్యా వ్యవస్థను రూపొందించకపోయినా ఆమె పేరు చరిత్ర పుటలలో  మరో రూపంలో నిలిచే ఉండేది. 1883-84 లో తన పదమూడు సంవత్సరాల వయసులో ఆమె అందరూ మగపిల్లలే ఉండే సాంకేతిక విద్యా పాఠశాలలో చేరింది. ఆమె ఈ సాంకేతిక విద్యను ఎంతో ఇష్టంతో ఎన్నుకుంది. ఇంజనీర్ కావాలనేది ఆమె కోరిక. అది ఆ రోజుల్లో ఆడపిల్లలు కలలో కూడా ఊహించనిది. 1890 లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకునే నాటికి ఆమె మనసు మార్చుకుని డాక్టర్ కావాలనుకుంది. అది కూడా ఏమంత తేలికగా సాధ్యమయ్యే విషయం కాదు. యూనివర్సిటీ ఆఫ్ రోమ్ లో మెడిసిన్ కోసం అప్లై చేసుకుంటే ఆమెకు ఏ మాతం ప్రోత్సాహం లభించలేదు. దానితో ఆమె నాచురల్ సైన్సెస్ ను ఎంపిక చేసుకుని 1892 లో డిప్లొమా ఇన్ డి లైసెంజా పట్టా పొందింది. దీనితో పాటు లాటిన్, ఇటాలియన్ భాషలలో కూడా పట్టు సాధించడంతో 1893 లో ఆమెకు యూనివర్సిటీ లో మెడిసిన్ సీట్ లభించింది. అయితే అది మొదటి అడుగు మాత్రమే. ఇతర విద్యార్థుల నుండి, ప్రొఫెసర్ ల నుండి ఆమె ఎంతో వివక్ష, ఒత్తిడులను ఎదుర్కొంది. మగపిల్లలతో కలిసి నగ్న మృత దేహాలను పరిశీలించడానికి ఆమెకు అనుమతి లేదు. కాలేజీ వేళలు ముగిశాక ఆమె ఒంటరిగా మృతదేహాలకు డిసెక్షన్ నిర్వహించవలసి వచ్చేది. ఇవేమీ ఆమెను ఆపలేకపోయాయి. 1896 లో యూనివర్సిటీ ఆఫ్ రోమ్ నుండి ఆమె గ్రాడ్యుయేషన్ పట్టా పొందింది. అప్పటి సమాజ కట్టుబాట్ల వలన ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో వేదనను ఎదుర్కొంది. తన సహోద్యోగి అయిన గిసుఎప్పీ మోంటేసానో ను ఆమె ప్రేమించి అతనితో ఒక బిడ్డను కూడా కన్నది. అయితే అతనిని పెళ్ళి చేసుకోలేకపోయింది. పెళ్ళి చేసుకున్నట్లైతే ఆమె తన ఉద్యోగ జీవితం నుండి విరమించుకోవలసి వచ్చేది. ఆమె చిన్న పిల్లల వైద్యంలో ప్రత్యేక శిక్షణ పొందింది. మానసిక వైకల్యం గల పిల్లలకు విద్యను అందించేందుకు కృషి చేసింది. 1906 లో రోమ్ లోని శాన్ లోరెంజో అనే చిన్న పట్టణంలోని అత్యంత నిరుపేద వర్గాల పిల్లల కోసం ఒక చైల్డ్ కేర్ సెంటర్ ను ప్రారంభించింది.వారికి గతంలో పాఠశాల ముఖం చూసిన అనుభవమే లేదు. ఆ కేంద్రాన్ని కేస డెయి బాంబిని అని పిలిచేవారు. ఇటాలియన్ లో దీని అర్ధం పిల్లల ఇల్లు అని. వారికి చదువు అబ్బదు అని ముద్ర వేయబడ్డ పిల్లలందరికీ అక్కడ ఎంతో నాణ్యమైన విద్య అందే ఏర్పాటు చేసిందామె. దాదాపు 50-60 పిల్లలు అక్కడ పేర్లు నమోదు చేసుకున్నారు. ఆ కేంద్రం యొక్క భవన సంరక్షకుడి కుమార్తె డాక్టర్. మాంటిస్సోరి మార్గదర్శకత్వంలో అక్కడ మొదటి టీచర్ గా పని చేసింది.

Bunny

ఈ పాఠశాల అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. కొన్ని రోజులకే పిల్లలు పజిల్స్ ను పరిష్కరించడం, వంట చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటివి నేర్చుకోవడంతో పాటు క్రమశిక్షణతో పద్దతిగా ఉండి విషయం పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు ఎంతో ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు.

మాంటిస్సోరి ఈ పాఠశాలలో చేసిన ప్రయోగాలు సత్ఫలితాలను ఇచ్చి కొద్దినాళ్ళకే కేవలం ఇటలీ లోనే కాక ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఈ నమూనాను అమలు చేయడం ప్రారంభించారు. మాంటిస్సోరి అనేది ప్రతి ఇంటిలోనూ చిరపరిచితమైన పేరుగా మారింది. భారతదేశంలో కూడా మాంటిస్సోరి విద్యా విధానం 1920 నుండే అమలు చేసిన చరిత్ర ఉంది.

ఈ విద్యా విధానం ఇప్పటి పిల్లలకు ఎంతో అవసరం అనడంలో ఏ సందేహమూ లేదు. ప్రతి అంగన్వాడీ, ప్రాధమిక పాఠశాల మాంటిస్సోరి పాఠశాల కావాలి. ఈ మాంటిస్సోరి విద్య ప్రధానంగా తమ కుటుంబాలలో చదువుకుంటున్న మొదటి తరం పిల్లలను, అత్యంత నిరుపేద కుటుంబాల పిల్లలను దృష్టిలో పెట్టుకుని రూపొందించింది. మొదటి ఉపాధ్యాయురాలు కూడా పెద్దగా చదువు లేని ఒక భవన సంరక్షకుడి కూతురు. వీటిని దృష్టిలో పెట్టుకుంటే మాంటిస్సోరి విద్య అత్యంత అవసరమైన, తప్పనిసరిగా అమలు చేయాల్సిన, అన్ని వర్గాలకూ అందుబాటులో ఉండే విద్యా నమూనాగా అర్ధం చేసుకోవచ్చు.

అయితే మన విద్యా విధానం అంతా ధనికులు, పలుకుబడి కలిగిన వర్గాల పిల్లలకోసం ఏర్పాటు చేసిన పాఠశాలల నమూనాలో నడుస్తుండటం మన దురదృష్టం. ఈ పాఠశాలల ఫీజులు కనీసం మధ్య తరగతి వర్గాల వారికి కూడా అందుబాటులో ఉండటం లేదు.

మాంటిస్సోరి పద్ధతుల మూల సూత్రాలను పక్కనపెట్టి తక్కువ ఖర్చుతో చేయవల్సిన విద్యా బోధనను ఎవరికీ అందుబాటులో లేని, విస్తృతంగా అమలు చేయడానికి వీలుకాని నమూనాగా మనమే మార్చివేశామా?

ఇప్పుడు కొత్తగా ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధానం 5 సంవత్సరాల కన్నా తక్కువ వయసుగల పిల్లలకు కూడా విద్యను అందించవలసిన అవసరాన్ని గుర్తించింది. మాంటిస్సోరి విద్యా విధానం గురించి పునర్విమర్శ చేసి ప్రతి విద్యా సంస్థలోనూ దీనిని ఒక అభ్యాస ప్రాతిపదికగా, విద్యా బోధనా విధానంలో భాగంగా మార్చేందుకు ఇదే సరైన సమయం. 

Translated by Bharathi Kode from Meena’s piece

శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళల ప్రాతినిధ్యం: Day for Women and Girls in Science

గగన్ దీప్ కాంగ్: వెల్లూర్ క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో డిపార్ట్మెంట్ అఫ్ గాస్ట్రో ఇంటస్టినల్ సైన్సెస్ లో ప్రొఫెసర్, వైరాలజిస్ట్. రాయల్ సొసైటీ కి ఫెలో గా ఎంపికైన మొదటి భారతీయ మహిళ. కోవిద్ కు సంబంధించిన పరిశోధనలలో చురుకుగా పాలుపంచుకుంటుంది.

కిరణ్ మజుందార్ షా: క్లినికల్ రిసెర్చ్ లో అనేక విజయాలు సాధించిన బయోకాన్ ఇండియా గ్రూప్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్. యునైటెడ్ స్టేట్స్ కు, యూరప్ కు ఎంజైమ్స్ ను ఎగుమతి చేసిన మొదటి భారతీయ కంపెనీ బయోకాన్. కొలెస్ట్రాల్ ను తగ్గించే అణువును తయారుచేసేందుకు అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం పొందిన తొలి భారతీయ కంపెనీ కూడా ఇదే.

టెస్సీ థామస్: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్ రూపొందించే అగ్ని క్షిపణులను అవసరమైన సాలిడ్ ప్రొపెల్లన్ట్స్ తయారీలో నిష్ణాతురాలు. ఎన్నో క్షిపణుల తయారీలో పాలుపంచుకుని అగ్నిపుత్రి గా పిలవబడుతుంది.

జె.మంజుల: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్ లో అత్యంత ప్రతిభ గల శాస్త్రవేత్త. డిఫెన్స్ ఆవియానిక్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ కు డైరెక్టర్

మినల్ సంపత్: భారత దేశపు అంగారక గ్రహ మిషన్ లో పనిచేస్తున్న సిస్టమ్స్ ఇంజనీర్; అనురాధ టికే: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజషన్ లో సీనియర్ ఆఫీసర్; నందిని హరినాథ్: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజషన్ యొక్క మార్స్ మిషన్ లో డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్ మరియు ప్రాజెక్ట్ మేనేజర్ మిషన్ డిజైన్; వీరు మాత్రమే కాక మార్స్ మిషన్ లో ఇంకా అనేక మంది మహిళలు ఉన్నారు.

ఎంతమంది స్ఫూర్తిదాయకమైన మహిళలు! వీరే కాక సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో విజయాలు సాధించిన మహిళలు ఇంకెందరో ఉన్నారు.

కానీ వారి సంఖ్య ఎంత చిన్నది!

భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండం మొత్తంలో ఎక్కడ చూసినా సాంకేతిక రంగంలో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది.

ఉదాహరణకు:

ఉన్నత విద్యా సంస్థలలో STEM కోర్సులలో (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథెమాటిక్స్) చేరుతున్న వారిలో కేవలం 35% మంది మాత్రమే మహిళలు

ప్రపంచంలో పరిశోధనా రంగంలో కేవలం 28% మాత్రమే మహిళా శాస్త్రవేత్తలు ఉన్నారు

ఇటీవల యునెస్కో స్టెమ్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ అండ్ విమెన్ ఇన్ ఆసియా పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక అమ్మాయిలు సాంకేతిక విద్యను అభ్యసించలేకపోవడానికి గల అనేక కారణాలను విశ్లేషించింది. చాలా చిన్న వయసు నుండే సైన్స్ సబ్జెక్టు లు అమ్మాయిలకు తగినవి కావు అనే మాట తరచుగా వింటూ ఉండడం వల్ల ఆడపిల్లలకు ఆ సబ్జెక్టు ల పట్ల ఆసక్తి పెరగకపోవడం ఒక కారణం. విజయాలు సాధించిన మహిళా రోల్ మోడల్స్ గురించి తెలియకపోవడం మరొక కారణం. ఈ అవరోధాలను అధిగమించి అమ్మాయిలు స్టెమ్ సబ్జెక్ట్స్ లో అడుగుపెట్టినా అక్కడ ఎదుర్కునే వివక్ష, ఉద్యోగానికి బయట వారికి ఉండే అదనపు బాధ్యతలు, గ్లాస్ సీలింగ్ వంటి ఎన్నో అడ్డంకులను వారు దాటాల్సి ఉంటుంది.

ఈ సమస్యలన్నింటినీ గుర్తించిన ఐక్యరాజ్యసమితి 2015 లో మహిళలు, బాలికలు సాంకేతిక రంగంలో సమాన భాగస్వామ్యం పొందడం, లింగ సమానత్వం సాధించడం అనే లక్ష్యాలతో ఫిబ్రవరి 11 ను ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ గా ప్రకటించింది.

ఈ ఏడాది ఈ రోజును ‘కోవిద్ 19 పై పోరాటంలో ముందున్న మహిళా శాస్త్రవేత్తలు’ అనే థీమ్ తో నిర్వహించనున్నారు. నిజంగానే మహిళలు పరిశోధకులుగా, డాక్టర్లుగా, ఆరోగ్య కార్యకర్తలుగా, వాక్సిన్ లు, మందులు తయారు చేయడంలో ఎంతో చురుకుగా పాల్గొంటున్నారు.

ప్రయాణమైతే మొదలయ్యింది. అయితే వెళ్లాల్సిన దూరం చాలా ఉంది. 50% జనాభా యొక్క శక్తియుక్తులను సాంకేతిక రంగ అభివృద్ధికి వినియోగించుకోలేకపోవడం నిజానికి ఎంతో విషాదం.

ఎవరైనా ఒక అమ్మాయికి సైన్స్ పట్ల ఆసక్తి కలిగేలా చేయాలని ఈ రోజు ఒక తీర్మానం చేసుకుందాం. ఆమెను ఒక సైన్స్ మ్యూజియంకు తీసుకువెళ్ళొచ్చు. ఒక సైన్స్ కిట్ కొని ఇవ్వొచ్చు. ఏదైనా ఒక సాంకేతిక సంస్థకి తీసుకువెళ్ళొచ్చు. మహిళా శాస్త్రవేత్తల స్ఫూర్తిదాయక గాథలను పరిచయం చెయ్యొచ్చు. సైన్స్ కు, సైంటిస్ట్ లకు సంబంధించిన ఏదైనా పుస్తకాన్ని ఆమెకు బహుమతిగా ఇవ్వొచ్చు. ఏదైనా చేయండి. ఏ ఒక్కటైనా చేయండి.

Translated from Meena’s Piece

PS: A book suggestion: Fantastic Adventures in Science—Women Scientists of India. Nandita Jayaraj, Aashima Freidog. Puffin Books.