వసంత పంచమి: Basant Panchami

శిశిరం ముగిసి వసంతం మొదలయ్యే మాఘ మాసం ఐదవ రోజున మనం వసంత పంచమి పండుగను జరుపుకుంటాం. వేసవి మొదలవడానికి సుమారు నలభై రోజుల ముందుగా, హోళీ పండుగ కన్నా ముందుగా వచ్చే పండుగ ఇది.  

Basant Panchami

పసుపు ఈ పండుగకు సంబంధించిన రంగు. అందుకు తగిన కారణం లేకపోలేదు. ఎన్నో రకాల పసుపు రంగు పూలు పూసే సమయం ఇది. ముఖ్యంగా ఉత్తరభారతదేశంలో ఈ సమయంలో పూసే ఆవ పూలు ఆ ప్రాంతం మొత్తాన్ని కొన్ని నెలలపాటు బంగారు రంగులోకి మారుస్తాయి. దేశంలోని అనేకప్రాంతాలలో ఈ పండుగ నాడు సరస్వతీ దేవిని పూజిస్తారు. పసుపు సరస్వతి దేవికి సంబంధించిన రంగు కూడా.

రుతువులు మారే కాలాన్ని సూచించడమే కాకుండా ఈ పండుగకు సంబంధించిన ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో నాకు ఇష్టమైనది కవి కాళిదాసుకు సంబంధించిన కథ. ఆ కథ తెలియని వారి కోసం క్లుప్తంగా ఇక్కడ చెబుతాను. ఉత్తరభారతదేశంలో ఒక రాజ్యానికి చెందిన యువరాణి ఎంతో తెలివైనది. పొడుపుకథల పోటీలో తనను ఓడించిన వాడినే వివాహం చేసుకుంటానని షరతు పెట్టింది. ఎంతోమంది యువకులు ముందుకు రావడం, వారిని ఆమె తిరస్కరించడం జరిగాయి. వారిలో ఆ దేశ ముఖ్యమంత్రి కుమారుడు కూడా ఉన్నాడు. యువరాణి తనను తిరస్కరించడంతో అహం దెబ్బతిన్న ముఖ్యమంత్రి కుమారుడు, తనలా తిరస్కరించబడిన మరికొందరితో కలిసి ఆమెకు గుణపాఠం చెప్పాలి అనుకున్నాడు. తమకన్నా తెలివైన స్త్రీ ఉండడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. ఆ రాజ్యంలో అందరికన్నా తెలివితక్కువ యువకుడి కోసం వెతకడం మొదలుపెట్టారు. అలా వెతుకుతున్నప్పుడు వాళ్లకు ఒక గొర్రెలు కాసుకునే కుర్రవాడు ఒక చెట్టుపై ఎక్కి తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటూ కనిపించాడు. దానితో పాటు తానూ పడిపోతాననే గ్రహింపు లేని అతనికన్నా తెలివితక్కువ వాడు ఉండడు అనుకుని అనేక ప్రయత్నాల ద్వారా ఇతను ఎంతో తెలివైన వాడు అని యువరాణిని నమ్మించారు. యువరాణి అతనిని వివాహమాడింది కానీ ఆ రహస్యం ఎంతోకాలం దాగలేదు. అతను మందబుద్ధి కలవాడని గ్రహించిన యువరాణి అతనిని ఇంటి నుండి తరిమివేసింది. అతను ఎంతో బాధపడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఆ సమయంలోనే సరస్వతీ దేవి అతనికి ప్రత్యక్షమై అక్కడ ఉన్న నదిలో స్నానమాచరించమని అతనికి చెప్పింది. అంతే, ఆ తర్వాత అద్భుతం జరిగింది. నదీ స్నానం చేసి వణుకుతూ బయటకి వచ్చిన అతని నోటినుండి అప్రయత్నంగా దేవిని స్తుతిస్తూ శ్యామలా దండకం వెలువడింది! అపార భాషా సంపద, జ్ఞానం, తెలివి, కవిత్వం అతనికి వశమయ్యాయి. ఆ కాళిదాసే తర్వాత కాలంలో అభిఙ్ఞానశాకుంతలం, కుమారసంభవం, రితుసంహార, మేఘదూత వంటి కావ్యాలను రచించాడు. మాఘమాసంలో ఐదవ రోజున సరస్వతీ దేవి అతనికి ప్రత్యక్షమై జ్ఞానాన్ని ప్రసాదించింది కాబట్టి అటువంటి జ్ఞానసంపదలు తమకు కూడా అందించమని భక్తులంతా సరస్వతీ దేవిని ఆరాధిస్తారు. కొంతమంది ఇది సరస్వతీ దేవి జన్మదినం అనికూడా అంటారు.

రెండవది శివపార్వతులకు సంబంధించిన కథ. శివుని ప్రియమైన భార్య సతీదేవి మరణించింది. దానితో ఆయనను తీవ్రమైన దుఃఖం, కోపం ఆవరించాయి. దానితో ప్రపంచాన్ని, దానికి సంబంధించిన తన బాధ్యతలను విస్మరించి ధ్యానంలో మునిగిపోయాడు. అయితే జననమరణ చక్రం సాఫీగా తిరగాలంటే ప్రపంచానికి శివుని అవసరం ఉంది. అప్పట్లో కల్లోలం సృష్టిస్తున్న ఒక రాక్షసుడిని అంతం చేయాలంటే శివునికి పుట్టిన బిడ్డ వలన మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి ఆయన అవసరం మరింత ఉంది. సతి అప్పటికే హిమాలయ రాజుకు పుత్రికగా పార్వతి రూపంలో పునర్జన్మించి ఉంది. కానీ ఆయనను ఎవరూ ధ్యానం నుండి మరల్చలేకపోయారు. అప్పుడే దేవతలంతా కలిసి కామదేవుడిని పంపారు. ఆయన విసిరిన మన్మధ బాణానికి శివుడు కళ్ళు విప్పాడు. కానీ ఆయన అత్యంత క్రోధంతో మూడవ కన్ను కూడా తెరవడంతో కామదేవుడు అక్కడికక్కడే భస్మమయిపోయాడు. అయితే అనుకున్నది జరిగింది. శివుడు పార్వతిని చూడడం ఆమెతో ప్రేమలో పడటం కూడా జరిగింది. మన్మధుని భార్య రతి దుఃఖంతో 40 రోజులు కఠోర తపస్సు చేసింది. దానితో కరుణించిన శివుడు ఏడాదికి ఒకరోజు కాముడు తన శరీరాన్ని ధరిస్తాడని వరం ఇస్తాడు. ఆ రోజే వసంత పంచమి.

దక్షిణ భారతం కన్నా ఉత్తర, తూర్పు భారతదేశంలో వసంత పంచమిని ఎంతో ఘనంగా జరుపుకునే సంప్రదాయం ఉంది. కనీసం నాకు తెలిసిన మా తమిళ కుటుంబాలలో ఈ పండుగను జరుపుకోవడం చూడలేదు. కానీ నా బెంగాలీ స్నేహితుల ఇళ్లల్లో ఎన్నో సార్లు వసంత పంచమి వేడుకలకు వెళ్లి ఉండటాన వారెంత శ్రద్ధగా ఈ పండుగను జరుపుకుంటారో తెలిసింది. మంచి పుసుపు వస్త్రాలు ధరించే అవకాశం వచ్చింది.

మనవెన్ని సంప్రదాయాలు, వేడుకలు, కథలో కదా. ఇవే మన జీవితాలకు మరిన్ని రంగులద్ది ఆసక్తికరంగా మార్చేవి.

–Based on a piece by Meena

మంత్ర ప్రపంచానికి తీసుకుపోయే కథలు: Gijubhai Badheka

నవంబర్ 14 మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి నాడు బాలల దినోత్సవంగా జరుపుకుంటాము అని మనందరికీ తెలుసు. ఆ రోజున దేశవ్యాప్తంగా పిల్లలకోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. వాటిలో చాలావరకూ కథలు, ఆటల చుట్టూ తిరిగేవే.
ఈ ఏడాది గుజరాత్ ప్రభుత్వం పిల్లల జీవితంలో కథల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి నవంబర్ 15 ను పిల్లల కథల దినోత్సవం (బాలవర్త దిన్) గా ప్రకటించింది.
నవంబర్ 15 గుజరాత్ కు చెందిన ప్రముఖ విద్యావేత్త, కథా రచయిత అయిన గిజుభాయి బదేక జయంతి. బాల సాహిత్య బ్రహ్మ అని ప్రేమగా అందరూ పిలుచుకునే గిజుభాయి ఎంతో సుసంపన్నమైన బాల సాహిత్య నిధిని భవిష్యత్తు తరాలకు అందించారు. ఈయన కథలను తమ తల్లిదండ్రుల నుండి, తాతలు, నానమ్మలు, అమ్మమ్మల నుండి పెరిగిన ఈ తరం పిల్లలు ఎందరో ఉన్నారు. 

1885 లో జన్మించిన గిజుభాయి ఒక జిల్లా కోర్టు లో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1920 ల ప్రాంతంలో తన కొడుకు పెంపకంలో పూర్తి బాధ్యత తీసుకున్నారు.  భావనగర్ లోని దక్షిణామూర్తి విద్యాసంస్థలలో చేరి మాంటిస్సోరీ మేడం నుండి పొందిన స్ఫూర్తితో విద్యార్థి కేంద్రక విద్యపై ఎంతో కృషి చేశారు. ఈ రంగంలో తన అనుభవాలు 1920 లో దక్షిణామూర్తి బాలమందిర్ ఏర్పాటుకు దోహదపడ్డాయి. పిల్లలతో ఆయన చేసిన చర్చల వలన వారు ఏవైనా విషయాలను నేర్చుకోవాలంటే కథల ద్వారా చెబితే ఎంత ప్రయోజనకరమో ఆయన అర్థం చేసుకున్నారు. దానితో అనేక నేపథ్యాలకు చెందిన పిల్లల కథలను సేకరించడం, స్వయంగా కథలు రాయడం, చెప్పడం మొదలుపెట్టారు. పిల్లల సంపూర్ణ వికాసానికి తోడ్పడేది కథలే అని ఆయన బలమైన నమ్మకం.
ఆ సమయంలో గుజరాతీ భాషలో బాలసాహిత్యం ఎక్కువగా లేదు. పిల్లవాడిని ఒక సంపూర్ణ వ్యకిగా గుర్తించి వారికోసం ప్రత్యేకమైన వనరులను, సాహిత్యాన్ని సృజించిన గుర్తింపు గిజుభాయికే దక్కుతుంది. 


వార్తను శాస్త్ర అనే తన పుస్తకంలో ఆయన ఇలా రాశారు: పిల్లల కథ అని పేరు పెట్టిన ప్రతి కథా పిల్లల కథ కాలేదు. ఏ కథ నుండి అయితే పిల్లలు ఉత్సాహాన్ని, ఆనందాన్ని పొందుతారో అదే నిజమైన పిల్లల కథ. పిల్లలకు సరళంగా, క్లుప్తంగా ఉండే కథలు కావాలి. వారి చుట్టూ ఉన్న పరిసరాలు కథలలో ప్రతిబింబించాలి. పక్షులు, జంతువులు, చిన్న చిన్న పాటలు ఉంటే వారికి గుర్తు పెట్టుకోడానికి సులభంగా ఉంటాయి. అందుకే అవి పిల్లల కథలలో భాగం కావాలి.
అయితే ఆ సమయంలో ఇటువంటి కథలు ఎక్కువగా అందుబాటులో లేవు. అందుకే జానపద సాహిత్యంలో అలాంటి కథల్ని గుర్తించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దక్షిణామూర్తి సంస్థలోని ఉపాధ్యాయులను, ఉపాధ్యాయ శిక్షణలో ఉన్న విద్యార్థులను వారి వారి ఇండ్లలో, గ్రామాలలో, పరిసరాలలో ప్రాచుర్యంలో ఉన్న పిల్లల జానపద కథలను సేకరించమని కోరారు. 
వార్తనుశాస్త్ర లో ఆయన ఇలా రాశారు. జానపద సాహిత్యాన్ని వెతకాలంటే నువ్వు పట్టణాన్ని వదిలి గ్రామాలకు, అక్కడి నుంచి అడవుల్లోకి, పొలాల్లోకి వెళ్ళాలి. పళ్లూడిన ఒక బామ్మ తన పనులు ముగించుకుని కూర్చోగానే పిల్లలు చుట్టూ చేరినప్పుడు చెప్పే కథలు వినాలి. అవి బామ్మ పంచిన ప్రసాదంలాగా పిల్లల నుండి పిల్లలకి మొత్తం ఊరంతా చేరిపోతాయి. 


గిజుభాయి, ఆయన సహోద్యోగులు అటువంటి కథల కోసం రాష్ట్రమంతా జల్లెడ పట్టారు. ఎన్నో కథలు, పాటలు, సామెతలు, పొడుపుకథలు సేకరించారు. వాటిని ఆయన తనదైన శైలిలో చిన్న చిన్న వాక్యాలలో, పదాలతో ఆటల రూపంలో, సంభాషణల రూపంలో పిల్లలకు అందుబాటులోకి తెచ్చారు.


ప్రతి ఉదయం పిల్లలకు ఒక కథ చెప్పేవారు ఆయన. ఆ కథను పిల్లలు మధ్యాహ్నానికి నాటకం రూపంలో చూపించాలి. కొద్ది రోజులలోనే పిల్లలు ఎలా తయారయ్యారు అంటే పదాలను తేలికగా గుర్తుపెట్టుకునేవారు. వారి నోటి వెంట ప్రాస అలవోకగా వచ్చేసేది. కథ మధ్యలో మర్చిపోతే వారే ఏదో ఒక కథను అల్లేసే వారు. అందుకే ఆయన ఇలా రాశారు: నువ్వు కొంతమంది పిల్లలను పోగేసి వారికి ఒక కథ చెప్పావంటే వారు నీకు పది కథలు చెబుతారు.


కథల కోసం, జానపద సాహిత్యంకోసం గిజుభాయి పరిశోధన రాష్ట్రాన్ని దాటి దేశమంతా విస్తరించింది. వివిధ రాష్ట్రాల నుండి, దేశాల నుండి ఎంతో బాల సాహిత్యాన్ని సేకరించి వాటిలోని సారూప్యతలను, వైవిధ్యాలను గుర్తించారు. వాటికి గుజరాతీ స్థానికతను జోడించి తిరిగి రాశారు. అవి గుజరాతీ కథలుగా, గిజుభాయ్ కథలుగా పేరుపొందాయి. 


గిజుభాయి కథలు ఎంతో సరళంగా, ప్రాసతో కూడి ఉంటాయి. అందుకే అవి వినేవారిని వెంటనే ఆకట్టుకుంటాయి. ఆయన కథలలో పిల్లలకు తెలిసిన జంతువులు, పక్షులు ఉంటాయి. అవి మనుషుల్లా మాట్లాడుతూనే తమవైన జంతు లక్షణాలను ప్రదర్శిస్తుంటాయి. మనుషులకు, జంతువులకు మధ్య సంబంధాలు, సంభాషణలు పిల్లలను విస్మయానికి గురిచేసి ఆసక్తి కలిగిస్తాయి. ఆ కథలలో రాజులు, రాణులు, రాజకుమారులతో పాటు సాధారణ దర్జీలు, మంగలులు, కుమ్మరులు కనపడతారు. మానవ సహజమైన బలాలు, బలహీనతలను, దురాశను, అసూయను ఈ పాత్రలు ప్రతిబింబిస్తుంటాయి. చాలా కథలు అనగనగా అంటూ మొదలై చివరికి సుఖాంతమవుతూ వందేళ్ల తర్వాత కూడా అనేక తరాల పిల్లలకు ఆనందాన్నిస్తూనే ఉన్నాయి. 


గిజుభాయి జన్మదినాన్ని, ఆయన కథలను గుర్తు  చేసుకునేందుకు నవంబర్ 15 ను పిల్లల కథల దినోత్సవంగా ప్రకటించడం ఆహ్వానించదగిన విషయం. పిల్లలంతా డిజిటల్ పరికరాలకు అతుక్కుని పోతున్న ఈ రోజుల్లో పిల్లలకే కాదు పెద్దవారికి కూడా కథలు చెప్పడంలోని ఆనందాన్ని గుర్తు చేసేందుకు కనీసం ఒక రోజైనా ఉండాలేమో.


నా తోటి పెద్దలకు ఒక విన్నపం. ఎన్నో కథలు మనకు ఉన్నాయి. వాటిని మీ పిల్లలకు చెప్పండి. అందంగా, పూర్తిగా వాటిలో లీనమై చెప్పండి. పిల్లలు కూడా అంతే లీనమై ఆనందిస్తారు. వారికేదో జ్ఞానాన్ని అందివ్వాలని కథ చెప్పకండి. ఏ ఉద్దేశ్యంతోనూ కథను మొదలుపెట్టకండి. కథలోకి వెళుతూ పిల్లలను మీతో పాటు దానిలోకి తీసుకుని వెళ్ళండి. ఒక మంత్ర ప్రపంచం మీ ముందు నిలుస్తుంది. మీ పిల్లలతో కలిసి అందులో వివరించండి. ఆస్వాదించండి.


మీ పిల్లలతో మంచి సంబంధాలు పెంచుకోవాలి అనుకుంటున్నారా? కథలతో ప్రారంభించండి

Post 44

Based on a piece by Mamata

ఒక నంది – కొన్ని వేరుశనగలు (Peanuts for Bulls)

దొడ్డ బసవన్న గుడి బెంగుళూరు లో ఒక ప్రసిద్ధి చెందిన దేవాలయం. దక్షిణ బెంగుళూరు లోని బసంవన్ గుడి ప్రాంతంలోని బుల్ టెంపుల్ రోడ్డు లో ఉంది ఈ గుడి. 1537 లో బెంగుళూరు నగరాన్ని నిర్మించిన కెంపెగౌడ ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు. 4. 6 మీటర్ల ఎత్తు, 6. 1 మీటర్ల పొడవు ఉన్న నిలువెత్తు ఏకశిలా నంది విగ్రహం అక్కడ కొలువై ఉంది. బహుశా ప్రపంచంలోనే అతి పెద్ద నంది విగ్రహం కావచ్చు.

గుడి గురించి మాట్లాడుతూ ఈ వేరుశనగలు ఏమిటి అనుకుంటున్నారా? నిజానికి ఎన్నో శతాబ్దాలుగా ఇది ప్రధానంగా వేరుశనగలు పండించే ప్రాంతం. కానీ కొన్ని సంవత్సరాల క్రితం సరిగ్గా వేరుశనగ పంట చేతికి వచ్చే సమయానికి ఒక ఎద్దు చేలల్లో పడి పంటను నాశనం చేస్తుండేది. రానూ రానూ రైతులకు ఇది అతి పెద్ద సమస్యగా పరిణమించింది. దానితో ఈ ఎద్దు ఆగడాలు ఆగినట్లైతే నందికి గుడికి కట్టిస్తామని రైతులంతా మొక్కుకున్నారు. ఏదో అద్భుతం జరిగినట్లు, ఆ ఏడాది నుండి ఎద్దు చేలల్లోకి రావడం ఆగిపోయింది.

అయితే గుడి దగ్గర రాసి ఉన్న ఒక శాసనంలో మరొక కథ ఉంది. ఆ కథ ప్రకారం. ఎద్దు చేలల్లో పడినప్పుడు ఒక రైతు కోపంతో ఒక రాయి తీసుకుని దానిని కొట్టాడని, అనుకోకుండా అది తగలడంతో విస్తుపోయిన ఎద్దు అకస్మాత్తుగా పరుగు ఆపి కూర్చుని రాయిలా మారిపోయినదని రాసి ఉంటుంది. ఆ తర్వాత అది పెరుగుతూనే ఉంది. దానితో భయపడిన రైతులు శివుడిని ప్రార్ధించారు. ఆ ఎద్దు పాదాల వద్ద దొరికిన త్రిసూలాన్ని దాని తలపై ఉంచగానే ఆ విగ్రహం ఎదగడం ఆగిపోయింది. తర్వాత రైతులంతా కలిసి అక్కడ ఒక చిన్న గుడిని నిర్మించారని, కెంపెగౌడ దానిని మరింత అభివృద్ధి చేసాడని ఇక్కడి స్థలపురాణం చెబుతుంది.

ఆ ఎద్దు కు కృతజ్ఞతగా దానికి ఇష్టమైన వేరుశనగలతో ఆ గుడి ప్రాంతంలో రైతులు ప్రతి ఏటా వేరుశనగల జాతరను జరుపుతారు. కార్తీక మాసంలో చివరి సోమవారం నాడు జరిపే ఈ జాతరకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మొదట్లో బెంగుళూరు చుట్టుపక్కల ప్రాంతాల రైతులే నేరుగా తమ పంటను తెచ్చి ఈ జాతరలో అమ్ముతుండేవారు. కానీ ఇటీవల కాలంలో ఇక్కడంతా దళారులే అమ్మకాలు చేస్తున్నారు. ఏడాదికి సరిపడా వేరుశనగలు కొనుక్కుని దాచుకోవడమే కాదు, వేరుశనగలతో చేసిన ఎన్నో రకాల చిరుతిండ్లు కూడా ఈ జాతరలో దొరుకుతాయి. ఉడకబెట్టినవి, వేయించినవి, మసాలా అద్దినవి ఇలా ఎన్నో రకాలలో చిరుతిండ్లు లభిస్తాయి.

రుచికరంగా ఉంటుందనే కాక శరీరానికి అవసరమైన ప్రోటీన్ ను అందించే ఒక ముఖ్యమైన ఆహారంగా వేరుశనగను చెప్పుకోవచ్చు. మన దేశంలో ప్రధానంగా పండించే చమురుపంటలలో అతి ముఖ్యమైనది కూడా. వేరుశనగ ఆకులు పశువుల దాణాగా కూడా ఉపయోగిస్తారు. చిక్కుడుజాతికి చెందిన పంట కావడంతో భూమికి కూడా కావాల్సినంత నత్రజనిని అందించి భూసారం పెంచేందుకు తోడ్పడుతుంది. దేశంలో దాదాపు 85 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిలో వేరుశనగ సాగు జరుగుతుంది. దాదాపు 7200 వేల టన్నుల వేరుశనగ ఏటా దేశంలో ఉత్పత్తి అవుతుంది.

కోవిద్ నిబంధనల వలన గత సంవత్సరం ఈ వేరుశనగల జాతర జరగలేదు. ఈ ఏడాది అయినా జరుగుతుందేమో వేచి చూడాలి. ఈ సారి ఎప్పుడైనా కార్తీక మాసం సమయంలో బెంగుళూరు వెళితే ఈ జాతరను మిస్ కాకండి. 

–Based on a piece by Meena

చిరంజీవ – Bless You

కరోనా వైరస్ దేశాన్ని పట్టి కుదిపేయడం మొదలుపెట్టాక ఎవరైనా తుమ్మితే సహజంగా వచ్చే స్పందన వాళ్ళని తిట్టుకుని దూరంగా వెళ్ళిపోవడం. అయితే ముందు పరిస్థితి ఎలా ఉండేదో మనకు తెలుసు. ఎవరైనా తుమ్మగానే “చిరంజీవ” అని ఆశీర్వదించడం కరోనా కు ముందు ఉన్న సహజమైన స్పందన. తుమ్మితే చిరంజీవ అనే ఆచారం మన తెలుగు వాళ్లలోనే కాదు, ప్రపంచమంతా ఉన్నదే. ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఎవరైనా తుమ్మగానే ‘బ్లెస్స్ యు’ అంటారని మనకు తెలియనిది కాదు.   

ఈ ఆచారం అసలు ఎలా మొదలయ్యింది అని కొంచెం చరిత్రలోకి చూస్తే అనుకోకుండా అది మరో మహమ్మారి దగ్గరకి వెళ్లి ఆగింది. ప్రపంచమంతా ప్లేగు వ్యాధి ప్రబలిన సమయం అది. నిజానికి ప్లేగ్ ఒకసారి కాదు, అనేక వేవ్స్ లో అనేక సార్లు అనేక దేశాలను, ముఖ్యంగా యూరోపియన్ దేశాలను పట్టి కుదిపేసింది. ఎవరికైనా ప్లేగు వ్యాధి సోకగానే మొదట జలుబు, దగ్గు ప్రారంభం అయ్యేవి. తర్వాత జ్వరం, శ్వాస ఇబ్బందులు, రక్తపు వాంతులు, చర్మం నల్లగా మారిపోవడం వంటి అనేక లక్షణాలు కనపడి దాదాపు ఏడు నుండి పది రోజులలో వ్యాధి సోకిన వ్యక్తులు ప్రాణాలు కోల్పోయేవారు. అసలీ వ్యాధి ఎలా ఇంత తీవ్రంగా ప్రబలింది, దీనికి చికిత్స ఏమిటి అనేదానిపై అవగాహన లేక ప్రజలు స్థానికంగా దొరికిన ఆకులు, మూలికలతో వైద్యం చేసుకుంటూ, వ్యాధిని తగ్గించమని ప్రార్ధనలు చేసుకుంటూ గడిపారు.

యూరప్ లో ఈ మహమ్మారి ప్రబలిన సమయంలో పోప్ కూడా దాని బారిన పడి మరణించడంతో పోప్ గ్రెగొరీ I కొత్త పోప్ అయ్యారు. ఫిబ్రవరి 16, 600 వ సంవత్సరంలో ఎవరైనా తుమ్మిన వెంటనే ఆ చుట్టు పక్కల ఉన్న ప్రజలు ఆ వ్యక్తి కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తూ మూడు పదాలతో కూడిన ఒక ప్రార్ధన చేయవలసిందిగా ప్రజలకు సందేశం ఇచ్చారు. తుమ్ముతూ ఉన్న వ్యక్తి కి ప్రజల దీవెనలు, ప్రార్ధనలు అందినట్లైతే అతను త్వరగా కోలుకుంటాడని ఆయన ఆశించారు. ఇంగ్లీష్ మాట్లాడే దేశాలన్నిటిలో ఎవరైనా తుమ్మగానే “గాడ్ బ్లెస్స్ యు” అని ప్రార్ధించడం అప్పటి నుండి ఆచారంగా మారింది.

యూరోపియన్ దేశాలలో పోప్ సూచనతో ఆచారంగా మారిన ఈ “గాడ్ బ్లెస్స్ యు” ప్రార్ధన అంతకు ముందు నుండే ఎన్నో దేశాలలో అలవాటుగా ఉంది. ఎన్నో ప్రాచీన సంస్కృతులలో తుమ్ములను అశుభ సూచకంగా, దేవుని నుండి వచ్చిన ప్రమాద సంకేతంగా భావించేవారు. తుమ్మగానే వ్యక్తి ఆత్మ అతని నుండి కొంతసేపు బయటకు వెళుతుందని, ఆ కొద్దిసేపటిలో దెయ్యాలు, దుష్ట శక్తులు ఆ వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తాయని అనుకునేవారు. గాడ్ బ్లెస్స్ యు అనడం వలన ఆ దుష్ట శక్తులు ఆ మనిషి దగ్గరకి చేరలేవని, అతని ఆత్మ అతని వద్దకు తిరిగి వస్తుందని నమ్మేవారు. తర్వాత కాలంలో, తుమ్మినప్పుడు వ్యక్తి గుండె కొద్దిసేపు స్పందనలు కోల్పోతుందనీ, గాడ్ బ్లెస్స్ యు అని ప్రార్ధించడం వలన అది తిరిగి కొట్టుకోవడం మొదలుపెడుతుందనే నమ్మకం కూడా కొన్ని సమూహాలలో ఉండేది. 

ప్రాచీన గ్రీకులు, ఈజిప్షియన్లు, రోమన్లు తుమ్మడం అంటే దేవుడు భవిష్యత్తు గురించి ఇస్తున్న సందేశం అని భావించేవారు. అది శుభసూచకం అయినా కావొచ్చు. అశుభసూచకం కూడా కావచ్చు. అదృష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు. దురదృష్టాన్నీ తీసుకురావచ్చు.

ఇవి యూరోపియన్ దేశాలలో ఉన్న కొన్ని నమ్మకాలు మాత్రమే. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో ఇంకా అనేక నమ్మకాలు  ఉండేవి.

ఇంగ్లాండ్, స్కాట్లాండ్ లలో నవజాత శిశువు మొదటి సారి తుమ్మేవరకూ ఆ బిడ్డ ఇంకా దేవలోకపు పరిధిలోనే ఉన్నట్లు భావించేవారు. పాలినేషియన్ ప్రజలు కూడా అలాగే పసిపిల్లల తుమ్ములో ఏదో దైవ సందేశం ఉందని భావించేవారు. టోంగా లో పసిపిల్లలు తుమ్మితే ఆ కుటుంబానికి ఏదో కీడు జరుగుతుంది అనుకునేవారు. మరోయులలో పిల్లలు తుమ్మితే దానిని ఏదైనా ప్రయాణానికి, లేదా ఏదైనా శుభవార్తకు సూచనగా భావించేవారు. 

నావికులు కూడా తుమ్ములను బట్టి తమ ప్రయాణం ఎలా ఉండనుండో అంచనా వేసేవారు. ఓడ బయలుదేరే ముందు సరంగు ఓడ ముందుభాగంలో నిలబడి తుమ్మినట్లైతే ఆ ప్రయాణం సవ్యంగా సాగనుందనీ, వెనక భాగంలో ఉన్నప్పుడు తుమ్మితే ప్రయాణానికి వాతావరణం అనుకూలించకపోయే ప్రమాదం ఉందనీ అనుకునేవారు.

పోలిష్ సంస్కృతిలో తుమ్ము అశుభ సూచకం. ఎవరైనా తుమ్మితే, ఆ సమయంలో వారి అత్తగారు వారి గురించి చెడు ఆలోచనలు చేస్తుంది అనుకునేవారు. తుమ్మిన వ్యక్తి అవివాహితులు అయినట్లయితే వారికి వివాహం అయ్యాక అత్తగారితో సంబంధాలు సరిగ్గా ఉండవు అని భావించేవారు. ఈ నమ్మకం ఇప్పటికీ అక్కడి ప్రజలలో ఉంది. ఇటాలియన్ సంస్కృతిలో పిల్లి కనుక తుమ్మినట్లైతే దాన్ని శుభసూచకం అనుకునేవారు. పెళ్లికూతురు తన వివాహ దినోత్సవాన పిల్లి తుమ్మడం విన్నట్లైతే ఆ వివాహ బంధం కలకాలం సంతోషంగా వర్ధిల్లుతుందని వారి నమ్మకం. అయితే అది మూడు సార్లు వరుసగా తుమ్మితే, ఆ కుటుంబానికంతటికీ జలుబు చేస్తుందని కూడా అనుకునేవారు.

కొన్ని తూర్పు ఆసియా దేశాలలో మీకు తుమ్ము వచ్చింది అంటే మీకు తెలియకుండా ఎవరో ఎక్కడో మీ గురించి మాట్లాడుతున్నారని నమ్మేవారు. ఒకసారి తుమ్మితే మంచి విషయాలు మాట్లాడుతున్నట్లు, రెండు సార్లు తుమ్మితే చెడ్డ విషయాలు మాట్లాడుతున్నట్లు నమ్మకం. వరుసగా మూడు సార్లు తుమ్మితే మీతో ఎవరో ప్రేమలో ఉన్నట్లు లేదా మీరు త్వరలో ప్రేమలో పడబోతున్నట్లు. నాలుగు లేదా అంతకన్నా ఎక్కువ తుమ్ములైతే ఆ కుటుంబానికి లేదా కుటుంబంలో ఎవరో ఒకరికి నష్టం జరగనున్నట్లు.

చైనా లో కూడా తుమ్ముల గురించి ఎన్నో ప్రాచీన గాధలు ఉండేవి. టాంగ్ వంశంలో చక్రవర్తి తల్లి కనుక తుమ్మినట్లైతే రాజప్రాసాదంలోని అధికారులంతా “వాన్ సుయ్” (చిరంజీవ) అనేవారని ఆ వంశానికి సంబంధించిన ఆచార వ్యవహారాలను పొందిపరిచిన ఒక పుస్తకంలో రాసి ఉంది. ఇప్పటికీ చైనాలో కొన్ని ప్రాంతాలలో ఈ ఆచారం ఉంది.

తుమ్మిన సమయాన్ని బట్టి కూడా కొన్ని నమ్మకాలు ఉండేవి. తెల్లవారు జామున ఒకటి నుండి మూడు మధ్య తుమ్మితే నిన్ను ఎవరో గుర్తు చేసుకుంటున్నట్లు; మూడు నుండి ఐదు మధ్య తుమ్మితే నిన్నెవరో ఆ రోజు రాత్రి భోజనానికి ఆహ్వానిస్తారు; ఐదు నుండి ఏడు మధ్య తుమ్మితే నీకు త్వరలో అదృష్టం పట్టనుంది అని; 11 నుండి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో తుమ్మితే దూరం నుండి ఎవరో స్నేహితులు నిన్ను కలవడానికి వస్తున్నారని. ఇలా రోజులో మనిషి తుమ్మిన సమయాన్ని బట్టి నమ్మకాలు ఉండేవి.

భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఎవరైనా తుమ్మితే అశుభసూచకంగా భావిస్తారు. అలా తుమ్మినప్పుడు బయటకు వెళ్లకుండా ఆగి, కాసేపు కూర్చుని, కొంచెం నీళ్లు తాగి మళ్ళీ బయలుదేరినట్లయితే ఆ అశుభం జరగకుండా ఆగుతుందని నమ్మకం.

ఏదైనా వైరస్ శరీరంలో ప్రవేశించి జలుబునో, ఎలర్జీ నో కలుగచేస్తే తుమ్ములు వస్తాయని ఈ రోజు మనందరికీ తెలుసు. అయినా ఎవరైనా తుమ్మగానే “చిరంజీవ” అనే అలవాటు మాత్రం మనలో ఇంకా అలాగే ఉంది.

–Based on a piece by Mamata

మరియా, మ్యాజిక్ మష్రూమ్స్: Maria and the Magic Mushrooms

నేను ఇటీవల ఒక అందమైన కవిత చదివాను. ఆ కవిత రాసిన కవయిత్రి మరియా సబీనా గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. ఆమె ఈ కాలపు ఆధునిక కవయిత్రి అయి ఉంటుంది అనుకుని ఆమె గురించి పరిశోధన చేసినప్పుడు నాకు ఒక అద్భుతమైన జీవిత కథ దొరికింది.

మరియా సబీనా మగ్దలీనా గార్షియా అనే ఈ కవయిత్రి దాదాపు ఒక శతాబ్దం క్రితం మజాటెక్ అనే ఆదివాసీ తెగలో జన్మించింది. దక్షిణ మెక్సికో లోని ఆక్సకా ప్రాంతంలో ఈ తెగ నివసించేది. ఈ ప్రాంతంలో ఉన్న సియర్రా పర్వత శ్రేణులలో ఉన్న హుఔట్ల డె జిమెనేజ్ అనే మారుమూల గ్రామంలోనే మరియా తన జీవితమంతా నివసించింది. సంప్రదాయ వైద్యం చేసే వృత్తిలో ఉండి ఆత్మలతో సంభాషించగలిగే ప్రత్యేక శక్తి కలిగిన కుటుంబంలో మరియా జన్మించింది. అనేక ఆదివాసీ తెగలలో ఇటువంటి స్థానిక వైద్యులకు ప్రత్యేక గౌరవం, గుర్తింపు ఉంటుంది. ఈ వైద్యులకు ఈ ప్రపంచపు జీవులతోనే కాక, దేవలోకపు శక్తులతో కూడా సంభాషించే శక్తి ఉంటుందని, వారు శారీరక, ఆత్మిక సమస్యలను నయం చేయగలుగుతారని, భవిష్యత్తుని కూడా అంచనా వేయగలుగుతారనీ ఆ తెగ వారి నమ్మకం.

మజాటెక్ తెగ వారి వైద్య విధానంలో ‘హోలీ చిల్డ్రన్’ అని పిలవబడే పుట్టగొడుగులకు ప్రత్యేక స్థానం ఉంది. చిత్త భ్రాంతిని కలిగించే ఈ పుట్టగొడుగుల సహాయంతో దైవ శక్తితో సంభాషణ సాధ్యమని వారి నమ్మకం. మరియా కి ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన అక్కతో కలిసి ఒక చెట్టు కింద కూర్చుని ఉండగా ఈ పుట్టగొడుగులు కనిపిస్తే వాళ్లిద్దరూ వాటిని తినేశారని చెబుతారు. అవి తిన్న వెంటనే ఆ అమ్మాయిలిద్దరూ చిత్త భ్రాంతికి లోనయ్యారు. మరియాకు ఏదో అలౌకికమైన గొంతు వినపడింది. ఆ సమయంలో అనారోగ్యంతో ఉన్న ఆమె మామయ్యకి ఏ చెట్టు మూలికలు ఉపయోగిస్తే నయమవుతుందో ఆ గొంతు చెప్పింది. ఆ మూలికలు ఎక్కడ దొరుకుతాయో కూడా ఆ అశరీర వాణి ద్వారా విన్న మరియా ఆ సూచనలను అనుసరించి వైద్యం చేయగానే ఆయనకి వ్యాధి నయమయింది.

అప్పటి నుండి ఆ ఊరివాళ్ళు ఆ అమ్మాయిని సబియా (తెలివైన స్త్రీ) అని పిలవడం ప్రారంభించారు. మజాటెక్ తెగకు చెందిన పురాతన ఆచారాలు, వైద్య విధానాలకు సంబంధించిన జ్ఞానం మరియా కు సహజంగానే అబ్బింది. సియర్రా మజాటెక్ పర్వత శ్రేణులలో మాత్రమే దొరికే ప్రత్యేక వృక్ష మూలికలతో వారు చేసే ప్రత్యేక వైద్యం మరియా కు ఎవరూ నేర్పకుండానే వచ్చింది. దానితో వారు వెలాడా అని పిలుచుకునే ప్రత్యేక స్వస్థత కార్యక్రమాలకు ఆ మ్యాజిక్ మష్రూమ్ లు వాడడం, తర్వాత వైద్యం చేయడం మరియా జీవితకాలం కొనసాగింది. శారీరక సమస్యల వైద్యం కోసమే కాక ఆధ్యాత్మిక మార్గదర్శనం కోసం కూడా అనేక మంది స్థానికులు మరియా దగ్గరకి వస్తుండేవారు. చిత్త భ్రాంతిని కలిగించే తన మ్యాజిక్ మష్రూమ్ లను తీసుకోవడం ద్వారా అలౌకిక శక్తి పొంది మరియా వారికి వైద్యం చేసేది. ఆ పుట్టగొడుగులు తనకి ఏ వైద్యం చేయాలో సూచిస్తాయని చెప్పేది మరియా. రోగి లోపలికి తొంగిచూసి వారికి చేయవలసిన వైద్యాన్ని నిర్ధారిస్తానని ఆమె చెప్పేది.

మరియా చేసే స్వస్థత పద్దతిలో పుట్టగొడుగులు తినడం, మంత్రాలు చదవడం, చుట్ట తాగడం, మెస్కేల్ అని పిలిచే ఒక చెట్టు భాగాలను తినడం, ఔషధ మొక్కల నుండి తీసిన లేపనాలు వాడడం ముఖ్యమైన భాగాలు. పెద్దగా నవ్వడం కూడా ఈ చికిత్సా పద్దతిలో భాగం. ఈ స్వస్థత కార్యక్రమాలన్నీ రాత్రి పూటే జరిగేవి. ఈ ప్రత్యేక వైద్యులకు నక్షత్రాలే దిశానిర్దేశం చేస్తాయని వారి నమ్మకం. వెలాడా స్వస్థత కార్యక్రమాలను కేవలం రోగులకు చికిత్స చేయడం కోసమే మరియా ఉపయోగించేది.

మరియా సబీనా అనే అద్భుతమైన మహిళ తన మారుమూల గిరిజన గ్రామంలో అలాగే పుట్టగొడుగుల సహాయంతో వైద్యం చేసుకుంటూ బయటి ప్రపంచానికి తెలియకుండానే చనిపోయేదేమో. కానీ విధి ఆమె కథకి ముగింపు వేరే విధంగా రాసి ఉంచింది.

1950 ల తొలినాళ్లలో అమెరికాకు చెందిన రాబర్ట్ గోర్డాన్ వాసన్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వారిద్దరికీ ఎత్నో బోటనీ పట్ల, ముఖ్యంగా చిత్త భ్రాంతిని కలిగించే మొక్కలపట్ల, ఆదివాసీల ఆచార వ్యవహారాలలో వాటి వినియోగం పట్ల ఆసక్తి ఉంది. వారిద్దరూ మజాటెక్ సియర్రా పర్వత ప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడు హుఔట్ల ప్రాంతానికి చెందిన ఈ వైద్యురాలి గురించి విన్నారు. 1955 ప్రాంతంలో వారు మరియా నివసించే ఆ మారుమూల గ్రామానికి చేరుకున్నారు. మరియా సబీనా దగ్గర వైద్యం కోసం వచ్చామని చెప్పారు. ఒక వైద్యురాలిగా మరియా తన సహాయం కోసం వచ్చిన వారిని ఎప్పుడూ తిరస్కరించలేదు. అప్పటికే ఆమెకు అరవై సంవత్సరాలు. ఆమె చేసే స్వస్థత కార్యక్రమాల గురించి ఆ ప్రాంతంలో తప్ప బయట ప్రపంచానికి ఏ మాత్రమూ తెలియదు. తన పుట్టగొడుగులను ఉపయోగించి ఈ విదేశీయుల కోసం మరియా ఎన్నో వెలాడా స్వస్థత కార్యక్రమాలను నిర్వహించింది. వారు వాటినన్నింటినీ ఫోటోలు, వీడియోలు తీశారు. సైలోసైబ్ మెక్సికనా అని పిలవబడే ఆ పుట్టగొడుగుల మొక్కలను కూడా తమతో కొన్ని తీసుకుని వెళ్ళారు. దీనిని తర్వాత కాలంలో యూరప్ లో విస్తృతంగా పెంచారు. దీని సహాయంతోనే 1958 లో ఆల్బర్ట్ హాఫ్మన్ LSD (Lysergic acid diethylamide) అని పిలవబడే చిత్త భ్రాంతిని కలిగించే ఔషధాన్ని రూపొందించాడు.

1957 లో మరియా తో, ఆమె మ్యాజిక్ మష్రూమ్ లతో వాసన్ కి కలిగిన అనుభవాల గురించి లైఫ్ మ్యాగజైన్ ఒక వ్యాసం ప్రచురించింది. మరియా సబీనా గురించి ప్రపంచమంతా తెలిసింది. ప్రపంచం నలుమూలల నుండీ ఎంతో మంది ఆమెని కలవడానికి వచ్చారు. 1960 ల ప్రాంతంలో హుఔట్ల డె జిమెనేజ్ అనే ఆ మారుమూల గ్రామానికి యాత్రికులు, కళాకారులు, మేధావులు, మనస్తత్వ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ప్రముఖులు (జాన్ లెన్నాన్, వాల్ట్ డిస్నీ, ఆల్డస్ హాక్స్లీ, కార్లోస్ కాష్ఠనేడా వీరిలో కొందరు) బారులు తీరి వచ్చారు. అయితే వీరిలో చాలా మందికి ఆ మ్యాజిక్ మష్రూమ్ లను తిని మత్తులో మునిగిపోయి ఆనందం పొందాలనే కోరిక తప్ప స్థానిక సంప్రదాయాల పట్ల, సంస్కృతి పట్ల ఏ మాత్రం గౌరవం లేదు. ఆ పుట్టగొడుగుల కోసం పెరిగిన డిమాండ్ వలన ఆ పర్వత ప్రాంతపు జీవ వైవిధ్యం అంతా దెబ్బతింది.

ఈ అనవసరమైన ప్రచారం ఆ ప్రాంతపు సామాజిక పరిస్థితులను మార్చివేసింది. పురాతన మజాటెక్ సంప్రదాయం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. దీనికి మరియానే కారణం అని, తమ సంప్రదాయాన్ని ఆమె తన స్వలాభం కోసం వాడుకునే ప్రయత్నం చేస్తుందని హుఔట్ల డె జిమెనేజ్ గ్రామ ప్రజలంతా ఆమెని నిందించారు. ఆమె మీద దాడి చేశారు. ఆమె ఇంటిని తగలబెట్టారు. ఆమెని డ్రగ్ డీలర్ అని పోలీసులు నేరం మోపారు. ఆమె తెగ వారంతా కలిసి చివరికి ఆమెని తెగ నుండి వెలివేశారు.

అయితే అదంతా తన విధి అని, తనకు ఇలా రాసిపెట్టి ఉన్నదని ఆమె అనుకుందే తప్ప ఎవరినీ నిందించలేదు. అయితే తన వెలాడా స్వస్థత కార్యక్రమాన్ని ఒక విదేశీయుని కోసం చేయడం వలన దాని పవిత్రత దెబ్బతిన్నది అని ఆమె తర్వాత కాలంలో బాధ పడింది. తాను హోలీ చిల్డ్రన్ అని పవిత్రంగా భావించే తన పుట్టగొడుగులను ఇతరులు తమ ఆనందం కోసం డ్రగ్ లాగా వినియోగించడం ఆమెని ఎంతో బాధపెట్టింది. ఎప్పుడైతే విదేశీయులు ఇక్కడకి వచ్చారో అప్పటి నుండి ఆ పుట్టగొడుగులు తమ పవిత్రతను, శక్తిని కోల్పోయాయని, వారు అంతా నాశనం చేశారని ఆమె అనుకుంది. తన జీవితం ఇలా అయిపోయినందుకు, తన పేరుతో ఇతరులు లాభాలు పొంది తనను ఈ స్థితికి తెచ్చినందుకు ఎంతో దుఃఖించింది. తన చివరి రోజులలో ఆమె దుర్భర దారిద్య్రంలో పోషకాహార లేమితో బాధపడింది. 1985 లో తన 91 సంవత్సరాల వయసులో మరియా మరణించింది.

ఒక సమయంలో ఆమెని నిందించినా హుఔట్ల ప్రాంత ప్రజలు ఆమెని ఎంతో పవిత్రంగా ఆరాధిస్తారు. మెక్సికోలోని గొప్ప కవులలో ఒకరిగా ఆమెకి ప్రత్యేక గౌరవం, గుర్తింపు ఉన్నాయి. ఆమెకి చదవడం, రాయడం రాదు. ఆమె కవితలన్నీ తన స్థానిక భాషలో ఆశువుగా చెప్పినవే. అవి తన మాటలు కావనీ తన హోలీ చిల్డ్రన్ (పుట్టగొడుగులు) తన ద్వారా మాట్లాడుతున్నాయనీ ఆమె అనేది. పుట్టగొడుగులు తన చుట్టూ పిల్లల్లాగా నాట్యం చేస్తాయనీ, పాటలు పాడతాయనీ ఆమె చెబుతుండేది. స్థానికులకు అన్ని సమస్యలకు ఆమే దిక్కు. ఆమె కూడా వారికి ఎంతో గౌరవంతో చికిత్స చేసేది. ఆమె శ్లోకాలు, కవితలు మజాటెక్ భాష నుండి మొదట ఇంగ్లీష్ లోకి, తర్వాత స్పానిష్ భాషలోకి అనువాదం చేయబడ్డాయి.

నాకు ఇంత అద్భుతమైన జీవిత చరిత్రను పరిచయం చేసిన ఆ కవిత ఇది.

సూర్యుని కాంతి, చంద్రుని కిరణాలతో

నదులు, జలపాతాల శబ్దాలతో

సముద్రపు హోరుతో, పక్షుల కిలకిలలతో 

నిన్ను నువ్వు నయం చేసుకో

పుదీనాతో, వేప మరియు యూకలిప్టస్‌తో

నిన్ను నువ్వు నయం చేసుకో

పువ్వులతో నీ జీవితాన్ని తీయగా మార్చుకో

కోకో బీన్ ను, దాల్చిన చెక్కను ఆస్వాదించు

నీ తేనీటిలో చక్కర బదులుగా ప్రేమని కలుపు

నక్షత్రాలను చూస్తూ దానిని ఆస్వాదించు

గాలి ఇచ్చే ముద్దులతో వర్షపు కౌగిలింతలతో సేదతీరు

నీ నగ్న పాదాలతో నేలంతా పరిగెత్తి బలాన్ని పుంజుకో

నీ అంతరాత్మ ప్రబోధాన్ని విని తెలివి పెంచుకో

మూడవ కంటితో ప్రపంచాన్ని చూడు

పాటలు పాడు, నృత్యం చెయ్యి, జీవితాన్ని ఆనందంగా గడుపు 

ప్రేమతో నిన్ను నువ్వు నయం చేసుకో

నీకు నువ్వే మందు అని ఎప్పుడూ గుర్తు ఉంచుకో

ప్రస్తుతం మనం ఉన్న ఈ కరోనా సంక్షోభ సమయంలో మరియా సబీనా మాటలు ఎంత ఊరటనిస్తున్నాయో కదా!

–From a piece by Mamata

హవాల్దార్ మున్నా: Get the Goat

మార్చ్ నెల చివరి వారంలో లక్నో లోని ఆర్మీ మెడికల్ కార్ప్ సెంటర్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఆ సందర్భంగా జరిగిన సైనిక పెరేడ్ లో మార్చింగ్ బ్యాండ్ కు హవాల్దార్ మున్నా నాయకత్వం వహించారని దినపత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఈ వార్త అంత ప్రముఖంగా రావడానికి కారణం హవాల్దార్ మున్నా మనిషి కాదు, మేక కావడం. మున్నా ఈ రెజిమెంట్ లో నాన్-కమిషన్డ్ ఆఫీసర్ గా ఎంతోకాలంగా సేవలందిస్తున్నారు. ఆయన మొదటివారు కాదు. 1950 నుండి ఈ రెజిమెంట్ లో మున్నా పేరుతో ఒక మేక హవాల్దార్ గా ఉండడం ఆనవాయితీగా వస్తుంది. అందమైన మార్వారీ జాతి మేకలు ఈ హవాల్దార్ పదవికి ఎంపిక చేయబడతాయి.

ఇలా ఆర్మీ రెజిమెంట్ లలో జంతువులను మస్కట్ లుగా నియమించే సంప్రదాయం ఒక్క భారతదేశంలోనే కాక ప్రపంచంలోని అనేక దేశాలలో అమలులో ఉంది. బహుశా ఇది బ్రిటిష్ వారినుండి అలవడిన సంప్రదాయం కావొచ్చు. ప్రస్తుతం బ్రిటిష్ ఆర్మీ లో మేకలు, గుర్రాలతో పాటు తొమ్మిది రకాల జంతువులు మస్కట్ లుగా వివిధ రాంక్ లలో ఉన్నాయి.

స్పానిష్ సైనిక దళంలో ‘ఓడిన్’ అనే మేక, రాయల్ ఆస్ట్రేలియన్ రెజిమెంట్ 5 వ దళానికి బెంగాల్ టైగర్ ‘క్విన్టాస్ దుర్గ’ మస్కట్ లుగా ఉన్నాయి. “చెస్టీ XV ” అనే ఇంగ్లీష్ బుల్ డాగ్ అమెరికన్ మెరైన్ కార్ప్స్ యొక్క చిహ్నం. శ్రీలంక లో అత్యంత పురాతనమైన రెజిమెంట్ అయిన శ్రీలంకన్ లైట్ ఇంఫాన్ట్రీ కి ఏనుగు చిహ్నంగా ఉంది. ఈ సంప్రదాయం అక్కడ 1961 నుండి అమలులో ఉండగా శ్రీలంక చరిత్రలో ప్రాముఖ్యత కలిగిన ఏనుగు ‘కందుల’ పేరు ని ఈ చిహ్నానికి ఇవ్వడం జరిగింది. ‘బ్రిగేడియర్ సర్ నీల్స్ ఓలావ్’ అనే పెంగ్విన్ నార్వే కింగ్స్ గార్డ్ రెజిమెంట్ యొక్క చిహ్నం. కెనడియన్ ఆర్మీ మస్కట్ అయిన ఆడ ధృవపు ఎలుగుబంటి టొరంటో లోని జూ లో అధికారిక గౌరవాన్ని అందుకుంటుంది. యునైటెడ్ స్టేట్స్ నావెల్ అకాడమీ లో ‘బిల్’ అనే మేక మస్కట్ గా ఉంది.

అనేక దేశాల సైనిక దళాలలో వివిధ జంతువులు అధికారిక, అనధికారిక హోదాలలో ఉన్నాయి. అధికారిక మస్కట్ లకు ర్యాంక్ ఉంటుంది. వాటి నిర్వహణా ఖర్చులు అన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. మానవ సైనికులకు ఉన్నట్లే వాటికి కూడా ప్రమోషన్ లు, డిమోషన్ లు ఉంటాయి.

కారణమేమిటో సరిగ్గా తెలియదు కానీ అనేక ఆర్మీ లలో మేకలే మస్కట్ లుగా ఉన్నాయి. బహుశా ఆర్మీ మస్కట్ లుగా గౌరవం పొందిన మొదటి జంతువు మేకే కావచ్చు. రాయల్ వెల్ష్ ఫుసిలైర్స్ లో 1770 లలో అమెరికన్ స్వాతంత్ర పోరాట కాలం నుండి మేకలు మస్కట్ లుగా ఉన్నాయి. 1775 లో జరిగిన ప్రముఖ బంకర్ హిల్ యుద్ధ సమయంలో ఒక మేక దారితప్పి యుద్ధ భూమిలోకి ప్రవేశించింది. దానిని అనుసరిస్తూ వెళ్ళిన బ్రిటిష్ సేనలు అమెరికన్ సైన్యంపై విజయం సాధించాయి. అప్పటి నుండి బ్రిటిష్ రాయల్ వెల్ష్ సేనలో మేకకి గౌరవ స్థానం ఉంది.

అయితే మేకలు అంత క్రమశిక్షణ కలిగిన జంతువులు కావు. లాన్స్ కార్పోరల్ విలియం బిల్లీ విండ్సర్ అనే మేక రాయల్ వెల్ష్ మొదటి బెటాలియన్ మస్కట్. 2006 లో బ్రిటన్ రాణి ముందు జరుగుతున్న పెరేడ్ లో తన రెజిమెంట్ కు నాయకత్వం వహిస్తూ అదుపు తప్పి పక్కకి పరిగెత్తడమే కాక తన ముందు మార్చింగ్ చేస్తున్న సైనికుల్ని తలతో పొడవడానికి ప్రయత్నించడంతో దానికి డిమోషన్ లభించింది.

ఇది రాస్తుంటే నాకు మరొక మేక గుర్తు వచ్చింది. అది ఏ ఆర్మీ లో భాగం కాదు. అహ్మదాబాద్ లోని వస్త్రపుర్ ప్రాంతంలోని ఒక రోడ్డు దాని నివాసం. ఈ రోడ్ చాలా ఇరుకుగా, గతుకులతో ఉండేది. ఎన్నో షాప్ లు, పార్క్ చేయబడిన వాహనాలు, చిరు వ్యాపారుల బండ్లు, గుడులు, మనుషులతో విపరీతమైన రద్దీగా ఉండే ఈ రోడ్ కు మరొక వైపు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మానేజ్మెంట్, ఇస్రో కాలనీ వంటి ప్రముఖ ప్రాంతాలు ఉండేవి.

ఈ రోడ్ మొత్తాన్ని ఒక పెద్ద మేక పరిపాలిస్తుండేది. దానికి ఎప్పుడు పడుకోవాలి అనిపిస్తే అప్పుడు రోడ్ మధ్యలో దర్జాగా విశ్రమించేది. ట్రాఫిక్ అంతా పక్కకి తప్పుకుని వెళ్లాల్సిందే. అది నడుచుకుంటూ వెళ్లి ఎవరైనా దారిని పోయే వారిని పొడవాలని నిర్ణయించుకుంటే వారు తప్పించుకునేందుకు పరుగులు పెట్టాల్సిందే. అక్కడి దుకాణదారులు అంతా దానికి ఆహారం పెట్టి పోషిస్తుండేవారు. తనకి ఏ కూరగాయలు, పండ్లు తినాలనిపిస్తే అక్కడి తోపుడు బండ్ల మీద పడి వాటిని తినేసేది. స్వీట్లు తినాలనిపిస్తే మార్కెట్ లో ఉన్న స్వీట్ షాప్ ముందుకు వెళ్లి నిలబడేది. పండగల రోజుల్లో దానికి దండలు వేసి, బొట్లు పెట్టి అలంకరించేవారు. అక్కడ పాన్ షాప్ ల వాళ్ళు దాని నోట్లో బీడీ పెట్టి వెలిగించే వాళ్ళు. అక్కడ ఆ మేక గారికి దక్కని గౌరవం లేదు.

ఆ రోడ్డు కే ఎంతో శోభని, పేరుని తెచ్చిపెట్టిన ఆ మేక దురదృష్టవశాత్తు కొన్ని సంవత్సరాల క్రితం మరణించింది. అది ఆర్మీ మస్కట్ కాదు కాబట్టి దాని స్థానంలో మరొక మేక రాలేదు కానీ ఆ రోడ్ కాస్త విశాలంగా, ప్రయాణానికి అనువుగా మారింది.

From a piece by Meena

ఈల భాషలో మాట్లాడదామా? Whistle away!

మీ స్కూల్ టైం టేబుల్ లో వారానికి ఒక మూడు రోజులు ఈల వేయడం నేర్పించే తరగతులు ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. మనకి ఊహల్లో మాత్రమే సాధ్యమయ్యే ఈ విషయం లాగోమేరా లోని పిల్లలకి దైనందిన వాస్తవం. ఈ లాగోమేరా అనేది క్యానరీ ద్వీపాలలో ఒకటి. అట్లాంటిక్ మహాసముద్రంలో అనేక ద్వీప సమూహాలలో ఈ క్యానరీస్ ఒకటి. మొరాకో నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్పెయిన్ కి చెందిన స్వతంత్ర ప్రతిపత్తి గల భూభాగాలలో ఈ క్యానరీస్ ఒకటి. మొదటిగా అక్కడ బెర్బెర్ తెగ ప్రజలు నివసించేవారు. 15, 16 వ శతాబ్దాలలో ఈ ద్వీపాన్ని స్పెయిన్ ఆక్రమించుకుని తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ ద్వీప సమూహంలో అత్యంత ప్రత్యేకమైనది లాగోమేరా. అక్కడి ప్రజలు సంభాషించుకునే సిల్బో గొమేరా అనే ఈల భాష ఈ ద్వీపానికి ఉన్న ప్రత్యేకత. అక్కడి ఆదివాసీ తెగ అయిన బెర్బర్లు తమలో తాము సంభాషించుకునేందుకు వాడిన అత్యంత పురాతనమైన భాష ఈ ఈల భాష. తర్వాత కాలంలో స్పెయిన్ తమపై దాడులు జరిపే సందర్భంలో కూడా తమలో తాము రహస్య సంభాషణలు జరుపుకునేందుకు కూడా ఈ భాషనే వాడేవారు.

15 వ శతాబ్దపు చరిత్రకారుల రచనలలో కూడా ఈ ఈల భాషకు సంబంధించిన సమాచారం ఉంది. 16 వ శతాబ్దంలో స్పెయిన్ నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన స్పానిష్ ప్రజలకు కూడా వీరు ఈ భాష అలవాటు చేశారు. స్పానిష్ భాషలోని ఎన్నో పదాలు కూడా ఈ ఈల భాషలోకి బదిలీ చేయబడ్డాయి.

లోతైన, నిటారుగా ఉన్న లోయలతో నిండిన ఈ ద్వీపంలో ఈల భాషలో మాట్లాడుకోవడమే సరైన సమాచార సాధనం. ఇక్కడి ఇళ్లన్నీ ఒకదాని నుండి ఒకటి ఎంతో దూరంలో నిర్మించబడి ఉంటాయి. మనుషులు ముఖాముఖి కలిసి మాట్లాడుకోవడానికి అవకాశాలు అరుదుగా ఉండే ఈ ప్రాంతంలో ఏవైనా జనన, మరణాల సమాచారం అందరికీ చేరవేయాలన్నా, ఏదైనా విందు, వినోదాలకు ఇతరులను ఆహ్వానించాలన్నా విజిల్ ద్వారా మాత్రమే సమాచారం అందించగలిగేవారు. గాలి వాలు సరిగ్గా ఉన్న సమయంలో ఈ ఈల శబ్దాలు 3 కిలోమీటర్ల వరకూ వినిపిస్తాయి.

ఈల భాషతో బాగా పరిచయం ఉన్న ఈ ద్వీపపు వృద్ధుడు ఒకరు ఇలా వివరించారు. “ఈల వేయడం నేర్చుకోవడం ఇక్కడ ఏదో ఆనందం కోసం చేసే పని కాదు. అది ఇక్కడ మాకు తప్పనిసరి అవసరం. విజిల్ వేయడం నేర్చుకోలేకపోతే ఏ చిన్న మాట చేరవేయాలన్నా నువ్వు మైళ్ళ దూరం నడవాల్సి ఉంటుంది. ఇళ్లన్నీ విసిరివేసినట్లు దూరదూరంగా ఉండి, రోడ్లు, ఫోన్ వంటి సౌకర్యాలు లేని ఇటువంటి ప్రాంతంలో నడవడం కంటే ఈల వేయడం నేర్చుకోవడం చాలా తేలికైన పని.

ఇటువంటి అవసరం నుండి ఉద్భవించిన భాషే ఈ ఈల భాష. దీనిని అధికారికంగా సిల్బో గొమేరో అని పిలుస్తారు. ఈల శబ్దం యొక్క స్థాయి, దీర్ఘాన్ని బట్టి పదాలను గుర్తించగలుగుతారు. పదాలు స్పానిష్ భాషకు సంబంధించినవి. ఆ పదాలు గుర్తించేందుకు తగినట్లు 2 ఈలలతో అచ్చులు, నాలుగు ఈలలతో హల్లులు సృష్టించుకున్నారు. ఒక్కో పదానికి ఒక్కోరకమైన ఈల శబ్దం ఉంటుంది. వాక్యానికి వాక్యానికి మధ్య తేడా తెలిసేలా ఈల మధ్యలో విరామం ఇస్తారు. శబ్దం పెద్దగా వచ్చేందుకు వీలుగా వేలిని పెట్టుకుని ఈల వేస్తారు. దానిలోనూ రకరకాల శైలిలు ఉన్నాయి. కొందరు ఒకటే చేతి యొక్క వేళ్ళు రెండింటిని నోటిలో పెట్టుకుని ఈల వేస్తే మరికొంతమంది ఒక్కో చేతి నుండి ఒక్కో వేలును నోటిలో పెట్టి ఈల వేస్తారు. ఎవరు ఎలా వేసినా ఏ రకమైన ఈల శబ్దానికి ఏ అర్ధం ఉందో అక్కడి ప్రజలందరికీ తెలుసు.

1950 ల వరకు సిల్బో గొమేరో నే ఇక్కడ అధికారిక భాషగా ఉండేది. ఇండ్లలో మాట్లాడుకునే భాష, పిల్లలు నేర్చుకునే భాష ఇదే. వృద్ధ తరం అంతరించి యువతరం ఇతర ప్రాంతాలకు వలస పోవడం, విద్యా సంస్థలలో ఆధునిక స్పానిష్ భాష నేర్పించడం ప్రారంభం అయ్యాక ఇతర ప్రాచీన భాషలలాగే ఈ భాష కూడా ప్రాభవం కోల్పోయి స్పానిష్ ఇక్కడి అధికారిక భాషగా స్థిరపడిపోయింది. 1970, 80 ల నాటికి ఈల భాష వచ్చిన వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. 1990 ల నాటికి కేవలం 50 మందికి మాత్రమే ఈ భాష స్పష్టంగా తెలుసు. ఇప్పటి తరానికి ఈ భాషతో పరిచయం ఉన్నప్పటికీ వారి విద్యాభ్యాసం అంతా స్పానిష్ లో సాగడం వలన స్పానిష్ లో మాత్రమే సంభాషించగలరు. భాషా పరిశోధకుల దృష్టిలో మాత్రమే ఈ ఈల భాష అత్యద్భుతమైన భాషగా నిలిచిపోయింది. ఇక్కడ మాత్రమే కాక ప్రపంచంలో కొన్ని ఇతర ప్రాంతాలలో కూడా వివిధ రకాల ఈల భాషలు ప్రాచుర్యంలో ఉన్నాయి. గ్రీక్ ద్వీపం అయిన ఈవియా, టర్కీ లోని కుస్కోవ్ పట్టణం ఈల భాష ప్రాచుర్యంలో ఉన్న మరికొన్ని ప్రాంతాలు. అయితే ఇప్పటికీ ఎక్కువమంది ప్రజలు సంభాషిస్తున్న ఈల భాషగా, ఎక్కువ పరిశోధనలు జరుపబడిన భాషగా సిల్బో గోమెర గుర్తింపుపొందింది.

1990 ల చివరిలో సిల్బో భాష మీద స్థానికులలో ఆసక్తి మరింత పెరిగింది. ఈ అంతరించిపోతున్న భాషని ప్రాధమిక విద్యా స్థాయిలో ఒక సబ్జెక్టు గా ప్రవేశ పెట్టడం అందుకు ఒక కారణం. 1999 నుండి ప్రాధమిక, మాధ్యమిక విద్యా ప్రణాళికలో సిల్బో భాష తప్పనిసరిగా అభ్యసించవలసిన సబ్జెక్టుగా ఉంది. ఒకప్పుడు వారి ఇండ్లలో ప్రధాన భాషగా ఉన్న సిల్బో ను ఇప్పుడు అక్కడి పిల్లలు సెకండ్ లాంగ్వేజ్ గా అభ్యసిస్తున్నారు. స్థానిక భాషలను, సంప్రదాయాలను సంరక్షించుకునేందుకు చేసిన ఈ ప్రయత్నాన్ని తప్పకుండా అభినందించాలి. అది కూడా సాంకేతిక విప్లవం సమాచార ప్రసార స్వరూపాన్ని సంపూర్ణంగా మార్చివేస్తున్న ఈ తరుణంలో ఇది నిజంగానే అభినందనీయం ప్రయత్నం. 

2009 లో యునెస్కో సిల్బో గోమేరో భాషనీ అత్యంత ఎక్కువమంది మాట్లాడిన అరుదైన, పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన ఈల భాషగా గుర్తించి మానవజాతి యొక్క సాంస్కృతిక వారసత్వ అంశాల జాబితాలో ఈ భాషను కూడా చేర్చింది.

సిల్బో గోమేరా ను మాట్లాడే మిగిలిన కొద్ది మంది దృష్టిలో అది వారి ద్వీపానికి చెందిన కవిత్వం. కవిత్వం లానే అది ప్రత్యేకమైనది. అందమైనది. దానికి ఏ ప్రత్యేక ప్రయోజనమూ ఉండవలసిన అవసరం లేదు.

తమ భాషని కాపాడుకునేందుకు ఆ భాషని విద్యా ప్రణాళికలో చేర్చేందుకు ఆ ద్వీపవాసుల కృషి మాత్రం ఎంతో స్ఫూర్తిదాయకం. ఒక పాఠశాల విద్యార్థిని ఇలా  చెప్పింది “ఈ భాషని నేర్చుకోవడం అంటే మా పూర్వీకులను గౌరవించడమే. ఈ సాంకేతిక యుగంలో కూడా మా మూలాలను మర్చిపోకుండా ఉండడమే”

కొంతమంది పిల్లలు తమ రహస్య సంభాషణలను జరుపుకునేందుకు వీలుగా కూడా సరదాగా ఈ భాషని నేర్చుకుంటున్నారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ సమాచార సాధనాలు ప్రపంచంలోని మారు మూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్న ఈ కాలంలో లాగోమేరా లోని పిల్లలు మాత్రం ఒక పక్కన ట్విట్టర్ భాషలో, మరొక పక్క ఈల భాషలో సంభాషించడం కూడా నేర్చుకుంటున్నారు.

–Based on a piece by Mamata.

“ఫూల్” అయ్యారా? – Feeling Foolish?

పాఠశాలలో చదువుకునే రోజుల్లో ఈ ఏప్రిల్ ఒకటి అత్యంత ముఖ్యమైన రోజు. ఎంతో అప్రమత్తంగా గడపాల్సిన రోజు కూడా. భుజం మీద ఏమైనా పడుతున్నాయా చూసుకోవడం, ఏవైనా కవర్లు, ఎన్వలప్ లు కనపడితే జాగ్రత్తగా తెరవడం, స్నేహితులను, కుటుంబ సభ్యులను ఎలా ఫూల్స్ ని చేయాలా అని ప్రణాళికలు వేసుకోవడంతో రోజు గడిచిపోయేది. మన ప్రయత్నాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఏప్రిల్ ఫూల్ అనే అరుపులు మాత్రం భలే సరదాగా ఉండేవి.

మిగతా ప్రత్యేక దినాల్లాగా ఈ రోజు ఏ ప్రాంతానికో, సంస్కృతికో, మతానికో సంబంధించినది కాదు. కాస్తంత చిలిపి ఆలోచనలు ఉండి ఉల్లాసంగా, ఆనందంగా గడపాలని కోరుకునేవారందరూ ఈ రోజును సరదాగా గడుపుతూ, అందరినీ ఆటపట్టిస్తూ గడిపేస్తారు. ఎన్నో ఏళ్ళ నుండి ఇలా అందరూ వేడుకగా జరుపుకునే ఈ రోజుకి ఎంతో సుదీర్ఘమైన, కొంత అస్పష్టమైన చరిత్ర ఉంది. ఎన్నో దేశాలలో ఈ రోజును ఫూల్స్ డే గా జరుపుకునే ఆనవాయితీ ఉన్నప్పటికీ అసలు ఇదెక్కడ మొదలయ్యింది అనేదానిపై అంత స్పష్టత లేదు.

16 వ శతాబ్దంలో యూరప్ లో ఫ్రాన్స్ దేశం జూలియన్ క్యాలెండర్ నుండి జార్జియన్ క్యాలెండర్ కు మారినప్పుడు ఈ ఆనవాయితీ మొదలయిందని కొందరి చరిత్రకారుల ఊహ. జూలియన్ క్యాలెండర్ ప్రకారం స్ప్రింగ్ ఈక్వినాక్స్ మొదలయ్యే మొదటి రోజైన ఏప్రిల్ ఒకటిని నూతన సంవత్సర ప్రారంభంగా భావించేవారు. అయితే 1582 నుండి జార్జియన్ క్యాలెండర్ ను అనుసరించడం ప్రారంభించాక జనవరి ఒకటిని నూతన సంవత్సర ప్రారంభంగా భావించడం మొదలుపెట్టారు. ఈ మార్పును అందరూ గ్రహించి అనుసరించడం మొదలుపెట్టడానికి కొన్ని సంవత్సరాల సమయం పట్టింది అని చరిత్ర చెబుతుంది. ఎవరైతే ఈ మార్పు గురించి తెలుసుకోలేకపోయారో, తెలుసుకున్నా మార్పుకు సిద్ధపడకుండా మార్చ్, ఏప్రిల్ లలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారో వారిని ఆటపట్టిస్తూ ఏప్రిల్ ఫూల్స్ అనడం ప్రారంభమయ్యింది అని తెలుస్తుంది. ఇటువంటి వారిని ఆటపట్టించేందుకు గానూ వారి వీపులకు కాగితంతో తయారు చేసిన చేప బొమ్మలను (వాటిని ఏప్రిల్ ఫిష్ అనేవారు) అతికించేవారు. ఈ ఏప్రిల్ ఫిష్ అనేవి తేలికగా దొరికిపోయి చిన్ని చేపలు. అమాయకంగా కనిపించే వ్యక్తులను వీటితో పోలుస్తారు.

ఇంకొందరి చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ఫూల్స్ డే అనేది ఇంకా ముందే గ్రీకో-రోమన్ పండుగ అయిన హిలేరియా పండుగ జరుపుకునే రోజులనుండే ప్రారంభమయ్యింది. హిలేరియా పండుగ గ్రీకుల దేవతలకు తల్లి అయిన సైబెలె యొక్క గౌరవార్ధం జరుపుకునే పండుగ. ఆ రోజున జాతరలు, ఇంద్రజాల ప్రదర్శనలు, హాస్య ప్రదర్శనలు జరుపుకోవడం వారి ఆనవాయితీ. నిజానికి శీతాకాలం ముగిసి వసంతకాలం ప్రారంభమయ్యే సమయంలో పండుగ జరుపుకోవడం దాదాపు అన్ని సంస్కృతులలోనూ ఉంది. ఆ పండుగలలో భాగంగా ఆ ఒక్క రోజూ అందరూ సంప్రదాయాలను పక్కన పెట్టి పెద్ద, చిన్న తేడా లేకుండా ఒకరిని ఒకరు ఆటపట్టించుకోవడం, సరదాగా గడపడం జరిగేది. పిల్లలు తల్లితండ్రులను, పనివారు తమ యజమానులు ఆటపట్టించడానికి ఆరోజున అనుమతి ఉంది. సహజంగా ఆమోదయోగ్యం కానీ కొన్ని మానవ ప్రవర్తనలను (అబద్ధం ఆడడం, మోసం చేయడం, ఆటపట్టించడం) ఆ ఒక్క రోజూ ఆమోదించడం ద్వారా మనుషుల్లో ఆ ప్రవర్తనలను ప్రదర్శించడం పట్ల ఉన్న కోరిక కొంతవరకు తీరినట్లు భావించేవారని కొందరు ఆంత్రోపాలజిస్ట్ ల అభిప్రాయం.

18 వ శతాబ్దంలో ఈ ఏప్రిల్ ఫూల్స్ డే సంప్రదాయం బ్రిటన్ లో మొదలయ్యింది. తర్వాత కాలంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ రోజును జరుపుకోవడం ప్రారంభించారు. స్కాట్లాండ్, ఐర్లాండ్ లలో ఎవరో ఒకరికి ఇచ్చి ఒక సీల్డ్ కవర్ ను తాము ఎవరినైతే ఫూల్ చేయాలనుకున్నారో వారికి పంపించేవారు. అందులో ఎవరో ఆపదలో ఉన్నారని సహాయం కావాలనే సందేశం ఉండేది. దానికి చివర ‘Dinna laugh, dinna smile. Hunt the gowk another mile’ అని ఉండేది. దాని అర్ధం నవ్వుకుని ఊరుకోవద్దు. దీనిని మరొకరికి పంపు అని. ప్రతి ఒక్కరూ ఇటువంటి సందేశం అందగానే నవ్వుకుని ఎవరికైనా ఇచ్చి దానిని మరొకరికి పంపేవారు.

కాలం గడిచేకొద్దీ ఈ ఏప్రిల్ ఫూల్స్ డే సంప్రదాయం ప్రపంచమంతటా వ్యాపించి రకరకాల వినూత్న ధోరణులు మొదలయ్యాయి. స్నేహితులనో, కుటుంబ సభ్యులనో సరదాగా ఆటపట్టించే స్థాయిని దాటి పత్రికలు, రేడియోలు, టెలివిజన్ లలో కూడా పాఠకులను, ప్రేక్షకులను ఫూల్స్ చేసేందుకు తప్పుడు సమాచారాలని ఇచ్చే స్థాయికి చేరుకుంది.

ఇటువంటి వాటిలో అందరికీ బాగా గుర్తు ఉండిపోయేది బిబిసి ఛానల్ చేసిన ప్రాంక్. టెలివిజన్ రంగంలో బిబిసి కి ఉన్న పేరు ప్రఖ్యాతులు మనకి తెలియనివి కావు. 1957 ఏప్రిల్ ఒకటైన బిబిసి లో వార్తలు అందించే పనోరమా షోలో స్విట్జర్లాండ్ లో స్పాగెట్టి (నూడుల్స్ లాగా ఉండి ఇటాలియన్లు ఆహారంగా తీసుకునే పాస్తా) చెట్లు పండిస్తున్నట్లు, ఆ చెట్ల నుండి స్పాగెట్టి ని కోస్తున్నట్లు మూడు నిమిషాల వీడియో ను ప్రసారం చేసింది. ప్రేక్షకులు ఎంతో ఆశ్చర్యపోయి ఎంతో మంది బిబిసి కి వారు చెట్లకి స్పాగెట్టి ఎలా పెంచుతున్నారు అని అడుగుతూ ఉత్తరాలు కూడా రాశారు. బిబిసి కొంతమందికి “ఒక స్పాగెట్టి తీగని ఒక టమోటో సాస్ డబ్బాలో వేసి ఎదురు చూడండి” అని సరదాగా ప్రత్యుత్తరం కూడా పంపింది.

1962 లో అప్పటికింకా కలర్ టివి లు రాని కాలంలో స్వీడన్ లోని ఒక నేషనల్ ఛానల్ లో సాంకేతిక విభాగంలోని ఒక వ్యక్తి నైలాన్ సాక్స్ లను కొంచెం సాగదీసి వాటిలో నుండి టెలివిజన్ ప్రసారాలను చూస్తే అవన్నీ రంగులలో కనిపిస్తాయని ప్రకటించాడు. అది నిజం అనుకుని ఎంతో మంది తమ సాక్స్ లు పాడు చేసుకుని మరీ ప్రయత్నించి చూసారు.

పక్కనే ఉన్న జర్మన్లు కూడా తక్కువ తినలేదు. 1994 లో జర్మనీలోని ఒక రేడియో స్టేషన్ నుండి ఒక ప్రకటన వెలువడింది. అది ఉడతలు జతకట్టే సమయం అనీ, ఆ ప్రాంతంలో రోజూ జాగింగ్ చేసేవారు గంటకి పది కిలోమీటర్ల కన్నా తక్కువ వేగంతో జాగింగ్ చేస్తే వాటికి ఇబ్బంది కలిగించకుండా ఉంటారనేది ఆ ప్రకటన సారాంశం. 2004 లో ఒక బెర్లిన్ పత్రికలో అమెరికన్ ఎంబసీ ఫ్రెంచ్ ఎంబసీ ఒకే వీధిలో ఉండడం ఇష్టం లేక అమెరికన్ ఎంబసీని వేరే చోటుకి మారుస్తున్నారు అని వార్త వచ్చింది. అది కూడా ప్రజలను ఫూల్స్ చేసేందుకు ఆ పత్రిక ఇచ్చిన తప్పుడు వార్తే.

సమాచార సాంకేతిక రంగంలో ఎన్నో మార్పులు వచ్చిన ఈ కాలంలో ఈ ప్రాంక్ లు కూడా మరింత ఆధునికతను, సాంకేతికతను సంతరించుకున్నాయి. గూగుల్ లాంటి సంస్థ కూడా అత్యంత అనుభవజ్ఞులైన తమ సాంకేతిక నిపుణుల సహకారంతో ప్రతి ఏటా ప్రాంక్స్ తయారు చేస్తుంది. 2004 ఏప్రిల్ ఒకటిన గూగుల్ జిమెయిల్ యొక్క ట్రయిల్ వెర్షన్ ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించగానే అందరూ అది కూడా జోక్ అనుకునేంతగా గూగుల్ ఏప్రిల్ ఒకటి ప్రాంక్స్ ప్రజలకు గుర్తుండిపోయాయి. అయితే 2020 లో కోవిద్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దానితో పోరాడుతున్న ప్రజల గౌరవార్ధం గూగుల్ ఎటువంటి ప్రాంక్ లు, జోక్ లు విడుదల చేయలేదు. ఈ సంవత్సరం కూడా గూగుల్ అదే కొనసాగించింది.

ఒకప్పుడు ఈ తప్పుడు వార్తలు, ఆటపట్టించడాలు అన్నీ ఏడాదికి ఒకసారి చేసే పనులు. ప్రస్తుత సోషల్ మీడియా  యుగంలో ఇరవై నాలుగు గంటలు వార్తలు, గాసిప్ లు, రూమర్లు ప్రచారమవుతూనే ఉంటే ఏది అసలు, ఏది నకిలీ అని కనిపెట్టడం ఎంతో కష్టమవుతుంది. ఈ రోజుల్లో మనం ఫూల్స్ కావడానికి ఏప్రిల్ ఒకటి వరకూ ఎదురు చూడాల్సిన అవసరం లేదు.

–Based on a piece by Mamata