అరుదైన సంగీతోత్సవం ‘త్యాగరాజ ఆరాధనోత్సవం’: Thyagaraja Aradhana

తమిళనాడు లోని తిరువాయూర్ లో ప్రతి ఏటా త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఎంతో అట్టహాసంగా జరుగుతాయి. త్యాగరాజ స్వామి వర్ధంతి ని పురస్కరించుకుని ఆ మహా సంగీతకారుని గౌరవార్ధం జరిగే ఈ ఉత్సవాలు ఈ ఏడాది జనవరి 22 న జరగనున్నాయి.

కర్ణాటక సంగీత విద్వాంసుడైన త్యాగరాజ స్వామి (1767-1847) ప్రహ్లాద భక్తి విజయం, నౌకా చరితం అనే రెండు సంగీత నాటకాలతో పాటు దాదాపు 25000 పాటలకు స్వరకల్పన చేసినట్లు చెబుతారు. అయితే వాటికి సంబంధించిన రికార్డులు సరిగా లేకపోవడంతో ఆయన స్వరకల్పన చేసిన పాటలు ఎన్ని అనే దానిపై ఖచ్చితమైన అంచనా లేదు. ఇప్పుడు మనకు అందులో లభిస్తున్నవి కేవలం ఏడు వందల పాటలు మాత్రమే. తాళపత్ర గ్రంధాలలో పొందుపరచిన ఎన్నో పాటలు ప్రకృతి వైపరీత్యాలకు, కాల ప్రభావానికి లోనై కాలగర్భంలో కలిసిపోయాయి.

త్యాగరాజ స్వామి కృతులన్నీ రాముల వారి పై భక్తితో రూపొందించనవే. అప్పటి తంజావూర్ రాజుగారు త్యాగరాజుల సంగీత ప్రతిభను గురించి విని తన ఆస్థానానికి రమ్మని కబురు పంపినట్లు చెబుతారు. అయితే ఆయన ఆ ఆహ్వానాన్ని తిరస్కరించడమే కాక తన స్పందనగా  ‘నిధి చాల సుఖమా’ అనే పాటను కూడా రచించారు.

ఇక మళ్ళీ ఆరాధనోత్సవాల విషయానికి వద్దాం. సన్యాసం తీసుకున్న కొన్నాళ్ళకు 1847 లో త్యాగరాజస్వామి తనువు చాలించారు. కావేరీ నది ఒడ్డున ఆయన అంత్యక్రియలు జరిగాయి. అక్కడ ఒక చిన్న స్మారకచిహ్నాన్ని నిర్మించారు కానీ అది కొంతకాలానికే నిర్లక్ష్యానికి గురయ్యింది. 1903 లో ప్రముఖ సంగీత విద్వాంసులు, త్యాగరాజస్వామి శిష్యులు అయినా ఉమయాలపురం కృష్ణ భాగవతార్, సుందర భాగవత తిరువాయూర్ కు వెళ్లారు. అక్కడ శిధిలావస్థలో ఉన్న స్మృతి చిహ్నాన్ని చూసి వారిద్దరూ బాధపడి ఇక నుండి ప్రతి ఏటా తమ గురువైన త్యాగరాజస్వామి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నారు. దానివలన ఆయనను గుర్తు చేసుకోవడంతో పాటు ఆయన సమాధి కూడా సంరక్షించబడుతుందని వారి ఆశ.

ఆ తర్వాత ఏడాది నుండే అంటే 1904 నుండే ఈ ఆరాధనోత్సవాలు మొదలయ్యాయి. 1905 లో ప్రఖ్యాత కళాకారుల ప్రదర్శనలు, పేదలకు అన్న సంతర్పణలతో రోజులతరబడి ఈ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కృష్ణ భాగవతార్, సుందర భాగవతార్ దీని వెనుక ఉన్న చోదకశక్తులయితే వారికి ఈ ఉత్సవాలు జరిపేందుకు తగిన అంగబలం, అర్ధబలం ఉన్న ఎంతో మంది చేయూతనందించారు. తిళైస్థానం నరసింహ భాగవతార్, తిళైస్థానం పంజూ భాగవతార్ అందులో ముఖ్యులు. అయితే తర్వాత కాలంలో ఈ అన్నదమ్ములిద్దరికీ మనస్పర్థలు వచ్చి 1906 లో ఎవరికి వారే విడివిడిగా ఆరాధనోత్సవాలు నిర్వహించారు. తర్వాత కాలంలో పెద్దలు వారిద్దరి మధ్య రాజీ కుదిర్చి ఒక ఒప్పందం చేశారు. ఆ ఒప్పందం ప్రకారం ఇద్దరిలో చిన్నవాడు, అతని బృందం వర్ధంతి రోజుకు ఐదు రోజుల ముందు ఉత్సవాలు ప్రారంభించి వర్ధంతి రోజు వరకు జరపాలి. పెద్దవాడైన నరసింహ, అతని బృందం వర్ధంతి రోజుతో ప్రారంభించి తర్వాత నాలుగు రోజులపాటు ఉత్సవాలు కొనసాగించాలి.

తర్వాత కొన్నాళ్ళకు ఆ మనస్పర్థలు పూర్తిగా తొలగిపోయి రెండు బృందాలూ ఒక్కటయ్యాయి. అయితే ఒక విషయంలో మాత్రం ఈ రెండు బృందాలూ ఎప్పుడూ ఒకే మాట మీద ఉన్నాయి. ఈ ఆరాధనోత్సవాలలో స్త్రీలు ప్రదర్శనలు చేయకూడదు అనేది వారి నియమం. అప్పట్లో సాధారణంగా దేవదాసీ స్త్రీలు మాత్రమే బహిరంగ సంగీత, నాట్య ప్రదర్శనలు ఇచ్చేవారు. ఇటువంటి పవిత్ర ఉత్సవంలో వారు పాల్గొనకూడదని ఆ అన్నదమ్ములు, అప్పటి సమాజ పెద్దలు విధించిన నియమం.

అప్పట్లో బెంగుళూరు నాగరత్నమ్మ ఎంతో పేరున్న సంగీత విద్వాంసురాలు. ఆమెకు ఎంతో పేరు, పరపతి ఉన్నాయి. ఆమెకు త్యాగరాజ స్వామి అంటే ఎంతో అభిమానం. తన ప్రతిభ అంతా ఆయన వరమే అని ఆమె నమ్మకం. ఎన్నో సంగీత సభలలో ఆయన కృతులు పాడటం వల్లనే ఆమెకు అంత గుర్తింపు లభించింది. అయితే స్త్రీ కావడం వలన ఆమెకు త్యాగరాజ ఆరాధనలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది.

1921 లో నాగరత్నమ్మ తనకున్న అపారమైన సంపదను స్వామి వారికోసం ఉపయోగించాలని నిర్ణయించుకుంది. ఆయన సమాధి చుట్టూ ఉన్న భూమిని కొని అందులో ఒక ఆలయాన్ని నిర్మించి దాని ముందు త్యాగరాజస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించింది. ఆ ఆలయం 1926 నాటికి  పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందింది.    

ఆరాధనోత్సవాలు నిర్వహించే బృందం ఆమె తన స్వంత ఖర్చుతో ఇవన్నీ చేస్తుంటే సంతోషంగా ఒప్పుకున్నారు. కానీ ఉత్సవాలలో ప్రదర్శనకు వచ్చేటప్పటికి ఆమెకు అనుమతి ఇవ్వలేదు. దీనిని అవమానంగా భావించిన ఆమె ఆ గుడికి దగ్గరలో తన స్వంతంగా ఆరాధనోత్సవాలను నిర్వహించాలని అనుకుంది. ఇందులో ఎంతో మంది మహిళా కళాకారులకు ప్రదర్శనకు అనుమతి లభించి ఆ ఉత్సవాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. గతంలో ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్న బృందం ఆ ఆలయం దగ్గర ఉత్సవాలు నిర్వహించకూడదనీ, అది తాను స్వయంగా నిర్మించిన ఆలయం అనీ ఆమె న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది. న్యాయస్థానం ఆమె కోరికను తిరస్కరించింది కానీ కొన్ని నియమిత గంటల పాటు ఆమె బృందం, మిగిలిన గంటలు మిగిలిన రెండు బృందాలు ఆరాధనను నిర్వహించవచ్చు అని తీర్పు ఇచ్చింది.  

ఆ సమయంలో ఎస్. వై. కృష్ణస్వామి అనే ఇండియన్ సివిల్ సర్వెంట్ అధికారి ముందుకువచ్చి ఈ మూడు బృందాల మధ్య సంధి కుదిర్చారు. 1941 నుండి ఈ మూడు శత్రు బృందాలు ఒక్కటయ్యాయి. స్త్రీలు కూడా ఆ ఉత్సవాలలో పాల్గొనే అవకాశం సాధించడం ద్వారా నాగరత్నమ్మ విజయం సాధించారు.

ఎప్పటిలాగా ఈ ఏడాది కూడా త్యాగరాజ స్వామి ఐదు కృతులను పంచరత్నాల పేరుతో సామూహికంగా ఆలపించే సంప్రదాయ ప్రదర్శనతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అందరూ కలిసి ఎంపిక చేసిన ఐదు కృతులను ఒకే గొంతుతో ఆలపించడం ఒళ్ళు గగుర్పొడిచే అనుభూతి. యూట్యూబ్ లో చూడండి.

–Based on a piece by Meena

Biju Patnaik: అరుదైన సాహసి ‘ బిజు పట్నాయక్ ‘

ఒక్కోసారి అనుకోకుండానే మనమెంత అజ్ఞానంలో ఉన్నామో మనకి తెలిసివచ్చే సందర్భాలు ఎదురవుతుంటాయి. ఈ మధ్య బిజూ పట్నాయక్ కు  సంబంధించిన ఒక లింకెడిన్ పోస్ట్ చదవడం నాకు అటువంటి ఒక సందర్భం. నాకు ఆయన గురించి తెలిసింది ఎంత తక్కువో ఆ పోస్ట్ ద్వారా అర్ధమయ్యింది. నాకు బిజూ గురించి ఉన్న పరిజ్ఞానం మొత్తం కొన్ని బులెట్ పాయింట్ల రూపంలో చెబితే: ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుడు, కొన్ని సంవత్సరాల పాటు ఒరిస్సా ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఎమర్జెన్సీ ని వ్యతిరేకించాడు, రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేశాడు, భుబనేశ్వర్ ఎయిర్పోర్ట్ కు ఆయన పేరు పెట్టారు, ఆ ఎయిర్పోర్ట్ బయట ఆయన నిలువెత్తు విగ్రహం ఉంది, ఆయన కుమారుడు కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చాలాకాలం ఉన్నారు. 

అయితే ఆయన జీవిత చరిత్ర గురించిన పరిచయం చదివాకనే నాకు తెలిసింది ఎంత తక్కువో తెలిసివచ్చింది. దానితో వెంటనే నేను  “లెజెండరీ బిజూ: ది మాన్ అండ్ ది మిషన్” అనే ఆ పుస్తకం ఆర్డర్ చేసాను.

Biju Patnaik
Biju Patnaik

పుస్తక రచనలోని వివరాలలోకి నేను వెళ్లదలుచుకోలేదు. మజుందార్ మొహంతి తో పాటు బిజూ ను అభిమానించే మరికొందరు కలిసి ఈ పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఇది చదవడం ఆ అరుదైన నాయకుని జీవితంలోకి తొంగిచూసిన అనుభవం.

1916 లో ఒక ఉన్నత కుటుంబంలో జన్మించిన బిజూ మొదటినుండీ అందరూ నడిచే దారిని ఎన్నుకోలేదు. ధైర్యం, సాహసం ఆయన లక్షణాలు. ఆయన స్కూల్ లో చదువుకునే రోజుల్లో ఒక రోజు బడి మానేసి వాళ్ళ ఊరికి దగ్గరలో ఆగిన విమానాన్ని చూడడానికి వెళ్ళాడు. ఆ రోజుల్లో విమానాన్ని చూడగలగడం ఎంతో అరుదు. దానిని చూసి ఎంతో ఆనందపడ్డ బిజూ ఎలాగైనా దానిని నడిపే పైలట్ కావాలి అనుకున్నాడు. విమానం చుట్టూ నిలబడ్డ గార్డులు దాని దగ్గరకు అతనిని వెళ్లనివ్వకుండా తరిమేయడం అతని కోరికను మరింత బలపరచింది. 

పెరిగి పెద్దవాడయ్యాక ఒకసారి తన స్నేహితులతో కలిసి భుబనేశ్వర్ నుండి పెషావర్ కు సైకిల్ మీద ప్రయాణం చేసాడు. రావెన్షా కాలేజీ లో చేరాడు కానీ మధ్యలోనే మానేసి పైలట్ ట్రైనింగ్ కు వెళ్ళాడు. విమానాలు నడపడంలో నైపుణ్యం సాధించాడు. 

పైలట్ గా ఆయన చేసిన విన్యాసాల గురించి చదివితే ఏదో కల్పిత కథలాగా ఉంటుంది తప్ప నిజ జీవితంలో జరిగినట్లు ఊహించలేము.

పైలట్ శిక్షణ పూర్తయిన తర్వాత ముందుగా ఒక ప్రైవేట్ ఎయిర్లైన్ సంస్థలో పనిచేసిన ఆయన తర్వాత ఎలాగో రాయల్ ఎయిర్ ఫోర్స్ సంస్థలో ప్రవేశించారు. అది రెండవ  ప్రపంచ యుద్ధ సమయం. స్టాలిన్గ్రాడ్ ను నాజిలు చుట్టుముట్టారు. రెడ్ ఆర్మీ కు నగరాన్ని ఆధీనంలోకి తీసుకునేందుకు తగినన్ని ఆయుధాలు లేవు. స్టాలిన్గ్రాడ్ ను నాజిలు ఆక్రమించుకుంటే వారికి మాస్కో కు చేరే మార్గం సుగమం అవుతుంది. అది ఎంతో ప్రమాదకరమైన పరిణామం. అప్పుడే బిజూ వారి సహాయానికి వచ్చాడు. మొత్తం 27 సార్లు విమానాన్ని నడిపి వారికి కావాల్సిన ఆయుధాలను స్టాలిన్గ్రాడ్ కు చేరవేసాడు. దానితో రెడ్ ఆర్మీ స్టాలిన్గ్రాడ్ ను నాజీల చేతిలో పడకుండా కాపాడగలిగింది. అది రెండవ ప్రపంచ యుద్ధంలో అతిపెద్ద మైలురాయి.

క్విట్ ఇండియా ఉద్యమ సమయానికి బిజూ బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేస్తున్నాడు. నిజానికి ఆయన అప్పుడు భారతదేశ వైస్రాయ్ గా ఉన్న లార్డ్ వావెల్ కు పైలట్. ఆయనకు బిజూ అంటే ఎంతో అభిమానం, నమ్మకం. కానీ బిజూ మాత్రం తనకు అందుబాటులో ఉన్న అన్ని బ్రిటిష్ వారి రహస్యపత్రాలను స్వాతంత్రోద్యమ నాయకులకు చేరవేస్తుండేవాడు. బర్మా లో బ్రిటిష్ వారి తరపున పోరాడుతున్న భారతీయ సైనికులకు విమానం నుండి రాజకీయ కరపత్రాలను విసిరి వారికి సమాచారం చేరవేసేవాడు. అరుణ అసఫ్ అలీ తో సహా ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులను తన విమానంలో తిప్పేవాడు. చివరికి బ్రిటిష్ వారి చేతికి చిక్కి కారాగారం పాలయ్యాడు. నిజానికి జేమ్స్ బాండ్ కంటే సాహసవంతుడైన సీక్రెట్ ఏజెంట్ బిజూ.

స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒక పైలట్ గా ఆయన సాహసం, నైపుణ్యం ఎన్నో సందర్భాలలో దేశానికి ఉపయోగపడ్డాయి. డచ్ వారి నుండి స్వాతంత్రం కోసం పోరాడుతున్న ఇండోనేషియా కు అప్పట్లో భారత్ సహాయం చేసింది. ఒకసారి నెహ్రు ఇండోనేషియన్ నాయకులు అప్పుడు జరుగుతున్నా ఇంటర్ ఆసియా కాన్ఫరెన్స్ కు హాజరయ్యి అక్కడ తమ వాదనను వినిపిస్తే ప్రపంచ నాయకుల మద్దతు వారికి లభిస్తుందని భావించారు. కానీ అధికారంలో ఉన్న డచ్ నాయకులకు స్వాతంత్రోద్యమ నాయకులు అక్కడికి వెళ్లడం ఇష్టం లేదు. దానితో దేశం నుండి బయటకు వెళ్లే అన్ని విమాన, సముద్ర మార్గాలను మూసివేశారు. కానీ బిజూ రహస్యంగా విమానాన్ని నడిపి నాయకులను కాన్ఫరెన్స్ కు తీసుకువచ్చి మళ్ళీ క్షేమంగా వారిని వారి దేశంలో వదిలివచ్చారు.

1947 లో పాకిస్తాన్ సైన్యం శ్రీనగర్ పై దాడి జరిపినప్పుడు భారతదేశపు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. జమ్మూ, కాశ్మీర్ లో చాలా కొద్దిపాటి సైన్యం, ఆయుధాలు మాత్రమే ఉన్నాయి. ఆ ప్రాంతాన్ని రక్షించాలంటే కొంత సైన్యాన్ని, ఆయుధాలను విమానంలో వెంటనే చేరవేయాల్సి ఉంది. అయితే ఎయిర్పోర్ట్ ఆక్రమణదారుల అధీనంలో ఉందా, మన చేతిలోనే ఉందా అనేది కూడా తెలియడం లేదు. ఆయుధాలను, సైన్యాన్ని చేరవేసే పని చేయలేమని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా చేతులెత్తేసింది. అప్పుడే మళ్ళీ బిజూ సహాయం అవసరమైంది. ఆయన శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యి, టవర్ ను తన నియంత్రణలోకి తీసుకుని ఎయిర్ ఫోర్స్ విమానాలు అక్కడ ల్యాండ్ అయ్యేలా చూడగలిగారు. అది మన చరిత్రనే మార్చివేసిన సందర్భం.

నేపాల్ కు కూడా ఆయన చేసిన సహాయం ఎంతో ఉంది. అప్పుడు నేపాల్ ను పరిపాలిస్తున్న రాణాలకు, నేపాల్ స్వాతంత్రోద్యమకారులకు మధ్య ఘర్ణణలు చెలరేగుతున్న నేపథ్యంలో  మనదేశం స్వాతంత్ర సమరయోధులకు మద్దతు ఇచ్చింది. అయితే పొరుగుదేశపు అంతర్గత వ్యవహారాలలో అధికారికంగా జోక్యం చేసుకునే వీలులేదు. అయినా బిజూ ధైర్యం చేసి రాజరికానికి వ్యతిరేకంగా పోరాడుతున్న నాయకులకు దాదాపు 15000 తుపాకీలు చేరవేసాడు.

ఇవన్నీ ఒక పైలట్ గా ఆయన ఘనతను నిరూపించే సందర్భాలే. ఒక వ్యాపారవేత్తగా, రాజకీయ  నాయకునిగా ఆయన సాధించిన విజయాలు మరెన్నో ఉన్నాయి. ఒరిస్సా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాడు. 

సాహసి, మొండివాడు అనే మాటలు పుస్తకంలో ఎన్నోసార్లు వస్తాయి. బిజూ ఆ మాటలకు తగిన వాడు. వివాదాస్పద వ్యక్తి అని కూడా అనొచ్చేమో. ఆయన పదవిలో ఉన్న కాలంలో అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు ఎదుర్కున్నాడు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అవినీతి అధికారులను కొట్టమని ప్రజలను ప్రోత్సహించి విమర్శలు ఎదుర్కున్నాడు.

నిజానికి మరింత వివరంగా ఆయన జీవితచరిత్ర రావాల్సి ఉంది. ఇటువంటి అరుదైన వ్యక్తిత్వం గల నాయకునికి అది దేశం ఇవ్వాల్సిన కనీస గౌరవం.

–Based on a piece by Meena

కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీల పర్యావరణ సదస్సు: COP 26

గత కొద్ది వారాలుగా పేపర్లలో, వార్తలలో కాప్ (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP) సదస్సుకు సంబంధించిన విషయాలే ప్రముఖంగా చూస్తూ ఉన్నాం. గ్లాస్గో లో ఈ సదస్సు జరుగుతుందనీ, వాతావరణ మార్పులకు సంబంధించిన విషయాలను చర్చిస్తున్నారనీ మనందరికీ తెలుసు. ఇక్కడ తీసుకున్న నిర్ణయాలు మన భూగోళం యొక్క, మానవాళి యొక్క భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని కూడా తెలుసు.

అసలు ఈ కాప్ అంటే ఏమిటి? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది ఈ కాప్ పూర్తిపేరు. యునైటెడ్ నేషన్స్ ఫ్రేంవర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (UNFCC) పై సంతకం చేసిన దేశాలన్నింటినీ కలిపి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు. వాతావరణ మార్పులపై ఆ సంతకం చేసిన దేశాలన్నిటి మధ్య ఒప్పందాన్ని ఇది సూచిస్తుంది. ఈ ఒప్పందం 1992 లో రియో లో జరిగిన సదస్సు నుండి అమలులోకి వచ్చింది. ఈ ఫ్రేంవర్క్ కన్వెన్షన్ ద్వారా వాతావరణ మార్పులను ఒక సమస్యగా ఈ దేశాలు గుర్తించి, దాని పరిష్కారానికై అందరూ కలిసి కృషి చేయాలని తీర్మానించడం జరిగింది. అయితే ఖచ్చితమైన ప్రణాళిక ఏదీ ఈ ఒప్పందంలో పొందుపరచలేదు. వివిధ దేశాలు, ప్రాంతీయ స్థాయి అనుబంధ సంస్థలు ఈ సమస్య దిశగా చేసిన ప్రయత్నాలను ఆమోదించడం మాత్రమే ఈ ఫ్రేంవర్క్ లో భాగంగా ఉంది.

అయితే వాతావరణ మార్పులపై పరిజ్ఞానం పెరిగి సమాచారం విస్తృతమయ్యే కొద్దీ ఈ దేశాలమధ్య ఒక అంగీకారం కుదిరింది. ఈ ఫ్రేంవర్క్ మరింత మెరుగైంది. ఖచ్చితమైన ఒప్పందాలు, ప్రొటొకాల్స్, బాధ్యతలు నిర్వచించబడ్డాయి. క్యోటో ప్రోటోకాల్, పారిస్ అగ్రిమెంట్ వంటి ఖచ్చితమైన ఒప్పందాలు దేశాలమధ్య కుదిరింది UNFCC ఫ్రేంవర్క్ ఆధారంగానే. వీటన్నిటినీ ప్రతి ఒక్క దేశమూ సంతకం చేసి ఆమోదించాల్సి ఉంటుంది. అదే అత్యంత కీలకమైన అంశం. మంచి ఆకాంక్షలతో నిండిన పత్రాలపై సంతకాలు చేయడం సులభమే. పత్రాలలో ఉన్న ఒప్పందాలకు కట్టుబడి ఉండడం ఏమంత తేలికైన అంశం కాదు. దానికి వివిధ స్థాయిలలో నిబద్ధత అవసరం.

UNFCC ను 1992 లో జూన్ 4 న జరిగిన రియో సదస్సులో కాప్ సభ్యుల ఆమోదానికి ప్రవేశపెట్టడం జరిగింది. ఇది 1994 మార్చ్ 21 నుండి అమలులోకి వచ్చింది. 1992 జూన్ 10 న భారతదేశం కూడా ఈ ఒప్పందంపై సంతకం చేసి 1993 నవంబర్ లో దానిని ఆమోదించింది.

COP 26

ఇప్పటికి మొత్తం 197 పార్టీలు (196 దేశాలు, ఒక ప్రాతీయ ఆర్ధిక అనుసంధాన సంస్థ) ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనే మాటలో ఉన్న పార్టీలు ఇవే. UNFCC కి సంబంధించిన ఏ ప్రధాన నిర్ణయమైనా ఈ పార్టీలే తీసుకుంటాయి. ఇందులో భాగంగా ఉన్న దేశాలు వాటిని అమలు చేసే బాధ్యతను కలిగిఉంటాయి.

ఈ కాప్ ఏడాదికి ఒకసారి సమావేశం అవుతుంది. ఒప్పందం అమలులోకి వచ్చిన మొదటి ఏడాది అయిన 1995 లోనే బాన్ లో మొదటి సమావేశం జరిగింది. కాప్ అధ్యక్ష పదవి ఐదు ఐక్యరాజ్యసమితి ప్రాంతాల మధ్య మారుతూ ఉంటుంది. మనదేశంలో 2002 లో న్యూ ఢిల్లీ లో ఎనిమిదవ కాప్ సమావేశం జరిగింది.

ఒప్పందంలో భాగంగా ఉన్న పార్టీలే కాకుండా ఇతర దేశాలు కూడా ఈ సమావేశాలకు హాజరవుతాయి. వీరే కాకుండా పత్రికలు, మీడియా కు సంబంధించిన ప్రతినిధులు, ఇతర పరిశీలనా సంస్థల ప్రతినిధులు కూడా హాజరవుతారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు, ఇంటర్గవర్నమెంటల్ ఆర్గనైజషన్స్, స్వచ్చంద సంస్థలు కూడా ఈ పరిశీలనా సంస్థల కేటగిరీ లో ఉన్నాయి.

ఇప్పుడు గ్లాస్గో లో జరుగుతున్న సదస్సుకు రిజిస్టర్ చేసుకున్న మొత్తం ప్రతినిధుల సంఖ్య 40000. 2019 లో జరిగిన కాప్ 25 సదస్సుకు హాజరయిన ప్రతినిధుల సంఖ్యకు దాదాపుగా ఇది రెట్టింపు. అయితే రిజిస్టర్ చేసుకున్న వారిలో చాలామంది ఆయా దేశాలలో ఉన్న కోవిద్ నిబంధనల వలన సమావేశానికి హాజరుకాలేనట్లు తెలుస్తుంది.

రిజిస్టర్ చేసుకున్న ప్రతినిధులు అందరూ హాజరవలేదు అనే విమర్శతో పాటు మరొక విమర్శ కూడా ఈ సదస్సు ఎదుర్కొంటుంది. సదస్సు పూర్తయ్యే నాటికి సాధించిన ప్రగతి కానీ, చర్చించిన అంశాలు కానీ పెద్దగా లేవు. ఇదేదో రెండు వారాల వేడుక లాగా ఉంది అని గ్రేటా థున్బర్గ్ బాధపడిందంటే ఆ సదస్సు నిర్వహణలో నిబద్ధత ఎంతగా లోపించింది అనేది అర్ధమవుతుంది.

అయితే మన స్థాయిలో ఈ దేశాలన్నీ కలిసి ఏమైనా మంచి నిర్ణయాలు తీసుకుంటాయేమో అని ఆశపడటం తప్ప చేసేదేమీలేదు. అయితే వ్యక్తిగతంగా పర్యావరణ మార్పులు తెచ్చే సమస్యలను ఎదుర్కొనేందుకు చేయదగిన చిన్న చిన్న ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి. అవి మనందరికీ తెలియనివి కావు. మన స్థాయిలో మనం వాటిని అమలు చేయడమే ఇప్పుడు చేయదగినది.

Post 42

Based on a piece by Meena