ఒక్కోసారి అనుకోకుండానే మనమెంత అజ్ఞానంలో ఉన్నామో మనకి తెలిసివచ్చే సందర్భాలు ఎదురవుతుంటాయి. ఈ మధ్య బిజూ పట్నాయక్ కు సంబంధించిన ఒక లింకెడిన్ పోస్ట్ చదవడం నాకు అటువంటి ఒక సందర్భం. నాకు ఆయన గురించి తెలిసింది ఎంత తక్కువో ఆ పోస్ట్ ద్వారా అర్ధమయ్యింది. నాకు బిజూ గురించి ఉన్న పరిజ్ఞానం మొత్తం కొన్ని బులెట్ పాయింట్ల రూపంలో చెబితే: ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుడు, కొన్ని సంవత్సరాల పాటు ఒరిస్సా ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఎమర్జెన్సీ ని వ్యతిరేకించాడు, రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేశాడు, భుబనేశ్వర్ ఎయిర్పోర్ట్ కు ఆయన పేరు పెట్టారు, ఆ ఎయిర్పోర్ట్ బయట ఆయన నిలువెత్తు విగ్రహం ఉంది, ఆయన కుమారుడు కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చాలాకాలం ఉన్నారు.
అయితే ఆయన జీవిత చరిత్ర గురించిన పరిచయం చదివాకనే నాకు తెలిసింది ఎంత తక్కువో తెలిసివచ్చింది. దానితో వెంటనే నేను “లెజెండరీ బిజూ: ది మాన్ అండ్ ది మిషన్” అనే ఆ పుస్తకం ఆర్డర్ చేసాను.

పుస్తక రచనలోని వివరాలలోకి నేను వెళ్లదలుచుకోలేదు. మజుందార్ మొహంతి తో పాటు బిజూ ను అభిమానించే మరికొందరు కలిసి ఈ పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఇది చదవడం ఆ అరుదైన నాయకుని జీవితంలోకి తొంగిచూసిన అనుభవం.
1916 లో ఒక ఉన్నత కుటుంబంలో జన్మించిన బిజూ మొదటినుండీ అందరూ నడిచే దారిని ఎన్నుకోలేదు. ధైర్యం, సాహసం ఆయన లక్షణాలు. ఆయన స్కూల్ లో చదువుకునే రోజుల్లో ఒక రోజు బడి మానేసి వాళ్ళ ఊరికి దగ్గరలో ఆగిన విమానాన్ని చూడడానికి వెళ్ళాడు. ఆ రోజుల్లో విమానాన్ని చూడగలగడం ఎంతో అరుదు. దానిని చూసి ఎంతో ఆనందపడ్డ బిజూ ఎలాగైనా దానిని నడిపే పైలట్ కావాలి అనుకున్నాడు. విమానం చుట్టూ నిలబడ్డ గార్డులు దాని దగ్గరకు అతనిని వెళ్లనివ్వకుండా తరిమేయడం అతని కోరికను మరింత బలపరచింది.
పెరిగి పెద్దవాడయ్యాక ఒకసారి తన స్నేహితులతో కలిసి భుబనేశ్వర్ నుండి పెషావర్ కు సైకిల్ మీద ప్రయాణం చేసాడు. రావెన్షా కాలేజీ లో చేరాడు కానీ మధ్యలోనే మానేసి పైలట్ ట్రైనింగ్ కు వెళ్ళాడు. విమానాలు నడపడంలో నైపుణ్యం సాధించాడు.
పైలట్ గా ఆయన చేసిన విన్యాసాల గురించి చదివితే ఏదో కల్పిత కథలాగా ఉంటుంది తప్ప నిజ జీవితంలో జరిగినట్లు ఊహించలేము.
పైలట్ శిక్షణ పూర్తయిన తర్వాత ముందుగా ఒక ప్రైవేట్ ఎయిర్లైన్ సంస్థలో పనిచేసిన ఆయన తర్వాత ఎలాగో రాయల్ ఎయిర్ ఫోర్స్ సంస్థలో ప్రవేశించారు. అది రెండవ ప్రపంచ యుద్ధ సమయం. స్టాలిన్గ్రాడ్ ను నాజిలు చుట్టుముట్టారు. రెడ్ ఆర్మీ కు నగరాన్ని ఆధీనంలోకి తీసుకునేందుకు తగినన్ని ఆయుధాలు లేవు. స్టాలిన్గ్రాడ్ ను నాజిలు ఆక్రమించుకుంటే వారికి మాస్కో కు చేరే మార్గం సుగమం అవుతుంది. అది ఎంతో ప్రమాదకరమైన పరిణామం. అప్పుడే బిజూ వారి సహాయానికి వచ్చాడు. మొత్తం 27 సార్లు విమానాన్ని నడిపి వారికి కావాల్సిన ఆయుధాలను స్టాలిన్గ్రాడ్ కు చేరవేసాడు. దానితో రెడ్ ఆర్మీ స్టాలిన్గ్రాడ్ ను నాజీల చేతిలో పడకుండా కాపాడగలిగింది. అది రెండవ ప్రపంచ యుద్ధంలో అతిపెద్ద మైలురాయి.
క్విట్ ఇండియా ఉద్యమ సమయానికి బిజూ బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేస్తున్నాడు. నిజానికి ఆయన అప్పుడు భారతదేశ వైస్రాయ్ గా ఉన్న లార్డ్ వావెల్ కు పైలట్. ఆయనకు బిజూ అంటే ఎంతో అభిమానం, నమ్మకం. కానీ బిజూ మాత్రం తనకు అందుబాటులో ఉన్న అన్ని బ్రిటిష్ వారి రహస్యపత్రాలను స్వాతంత్రోద్యమ నాయకులకు చేరవేస్తుండేవాడు. బర్మా లో బ్రిటిష్ వారి తరపున పోరాడుతున్న భారతీయ సైనికులకు విమానం నుండి రాజకీయ కరపత్రాలను విసిరి వారికి సమాచారం చేరవేసేవాడు. అరుణ అసఫ్ అలీ తో సహా ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులను తన విమానంలో తిప్పేవాడు. చివరికి బ్రిటిష్ వారి చేతికి చిక్కి కారాగారం పాలయ్యాడు. నిజానికి జేమ్స్ బాండ్ కంటే సాహసవంతుడైన సీక్రెట్ ఏజెంట్ బిజూ.
స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒక పైలట్ గా ఆయన సాహసం, నైపుణ్యం ఎన్నో సందర్భాలలో దేశానికి ఉపయోగపడ్డాయి. డచ్ వారి నుండి స్వాతంత్రం కోసం పోరాడుతున్న ఇండోనేషియా కు అప్పట్లో భారత్ సహాయం చేసింది. ఒకసారి నెహ్రు ఇండోనేషియన్ నాయకులు అప్పుడు జరుగుతున్నా ఇంటర్ ఆసియా కాన్ఫరెన్స్ కు హాజరయ్యి అక్కడ తమ వాదనను వినిపిస్తే ప్రపంచ నాయకుల మద్దతు వారికి లభిస్తుందని భావించారు. కానీ అధికారంలో ఉన్న డచ్ నాయకులకు స్వాతంత్రోద్యమ నాయకులు అక్కడికి వెళ్లడం ఇష్టం లేదు. దానితో దేశం నుండి బయటకు వెళ్లే అన్ని విమాన, సముద్ర మార్గాలను మూసివేశారు. కానీ బిజూ రహస్యంగా విమానాన్ని నడిపి నాయకులను కాన్ఫరెన్స్ కు తీసుకువచ్చి మళ్ళీ క్షేమంగా వారిని వారి దేశంలో వదిలివచ్చారు.
1947 లో పాకిస్తాన్ సైన్యం శ్రీనగర్ పై దాడి జరిపినప్పుడు భారతదేశపు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. జమ్మూ, కాశ్మీర్ లో చాలా కొద్దిపాటి సైన్యం, ఆయుధాలు మాత్రమే ఉన్నాయి. ఆ ప్రాంతాన్ని రక్షించాలంటే కొంత సైన్యాన్ని, ఆయుధాలను విమానంలో వెంటనే చేరవేయాల్సి ఉంది. అయితే ఎయిర్పోర్ట్ ఆక్రమణదారుల అధీనంలో ఉందా, మన చేతిలోనే ఉందా అనేది కూడా తెలియడం లేదు. ఆయుధాలను, సైన్యాన్ని చేరవేసే పని చేయలేమని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా చేతులెత్తేసింది. అప్పుడే మళ్ళీ బిజూ సహాయం అవసరమైంది. ఆయన శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యి, టవర్ ను తన నియంత్రణలోకి తీసుకుని ఎయిర్ ఫోర్స్ విమానాలు అక్కడ ల్యాండ్ అయ్యేలా చూడగలిగారు. అది మన చరిత్రనే మార్చివేసిన సందర్భం.
నేపాల్ కు కూడా ఆయన చేసిన సహాయం ఎంతో ఉంది. అప్పుడు నేపాల్ ను పరిపాలిస్తున్న రాణాలకు, నేపాల్ స్వాతంత్రోద్యమకారులకు మధ్య ఘర్ణణలు చెలరేగుతున్న నేపథ్యంలో మనదేశం స్వాతంత్ర సమరయోధులకు మద్దతు ఇచ్చింది. అయితే పొరుగుదేశపు అంతర్గత వ్యవహారాలలో అధికారికంగా జోక్యం చేసుకునే వీలులేదు. అయినా బిజూ ధైర్యం చేసి రాజరికానికి వ్యతిరేకంగా పోరాడుతున్న నాయకులకు దాదాపు 15000 తుపాకీలు చేరవేసాడు.
ఇవన్నీ ఒక పైలట్ గా ఆయన ఘనతను నిరూపించే సందర్భాలే. ఒక వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకునిగా ఆయన సాధించిన విజయాలు మరెన్నో ఉన్నాయి. ఒరిస్సా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాడు.
సాహసి, మొండివాడు అనే మాటలు పుస్తకంలో ఎన్నోసార్లు వస్తాయి. బిజూ ఆ మాటలకు తగిన వాడు. వివాదాస్పద వ్యక్తి అని కూడా అనొచ్చేమో. ఆయన పదవిలో ఉన్న కాలంలో అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు ఎదుర్కున్నాడు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అవినీతి అధికారులను కొట్టమని ప్రజలను ప్రోత్సహించి విమర్శలు ఎదుర్కున్నాడు.
నిజానికి మరింత వివరంగా ఆయన జీవితచరిత్ర రావాల్సి ఉంది. ఇటువంటి అరుదైన వ్యక్తిత్వం గల నాయకునికి అది దేశం ఇవ్వాల్సిన కనీస గౌరవం.
–Based on a piece by Meena