దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఖద్దర్ కి ఉన్న విశిష్టత మనందరికి తెలిసిందే!
ఖాదీ ధరించడం కేవలం బ్రిటిషర్ల దిగుమతులని ధిక్కరించడానికి జరిగిన స్వేచ్చా పోరాటం మాత్రమే కాదు. కొన్ని లక్షలమంది జీవనోపాధికి, ఆర్ధిక స్వాతంత్ర్యానికి, ఒక దృఢమైన చిహ్నం.
దివ్య జోషి మాటల్లో: ‘ఖాదీని గాంధీజీ ఈ దేశ జాతీయవాదనికి, సమానత్వానికి మరియు స్వాలంబనకు ప్రతీకగా నిలిపారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సత్యాగ్రహాన్ని పాటించి ఈ సమాజాన్ని పునర్నిర్మించడంలో ఖాదీ పాత్ర ముఖ్యమైనదని అని వారు బలంగా విశ్వసించారు. ఒకప్పుడు పేదరికానికి మరియు వెనకబాటుతనానికి ప్రతీకగా నిలిచిన రాట్నాన్ని స్వాలంబనకు, అహింసకు చిరస్మరణీయమైన గుర్తుగా మలిచారు గాంధీజీ.’
ఐతే! స్వాతంత్ర్య సాధనలో వస్త్రాలు నూలడం-నేయడం కేంద్ర భాగమై జరిగిన పోరాటాలు భారత్ లోనే కాకుండ మరెన్నో దేశ చరిత్రలలో కనిపిస్తుంది. అలా, బ్రిటిష్ ని ఎదురిస్తూ, వస్త్రాన్ని ఆయుధంగా మలచుకున్న ఉద్యమ చరిత్రల్లో అమెరికాది కూడా ఒకటి.

అమెరికాతో సహా తాము పాలించిన కాలనీలను బ్రిటన్ దేశం ప్రధానంగా తమ ముడి పదార్ధాల సరఫరాదారులుగా భావించారు. పత్తి ఇతరాత్రా ముడి సరుకుని తమ దేశానికి ఎగుమతి చేసుకుని, తయారైన బట్టలను రెట్టింపు పన్నులతో మళ్ళీ అవే కాలనీలలో విక్రయించేవారు. ఈ ప్రక్రియను ధిక్కరిస్తు బ్రిటన్ కు వ్యతిరేకంగా అమెరికా కాలనీ ప్రజలు 1760-1770 మధ్య కాలంలో తమ దేశభక్తిని చాటుతూ చరఖా/రాట్నం సహయంతో, ఒక శక్తిగా కదిలి వారి వస్త్రాల్న్ని వారే తయారు చేసుకోవడం జరిగింది. విధిగా ఇదే రాట్నం 20వ శతాబ్దం భారత దేశ స్వాతంత్ర్య చరిత్రలోను కీలకమైన పాత్ర పోషించింది.
అమెరికా స్వాతంత్ర్య యుద్ధంలో కీలకంగా నిలిచిన రాట్నం/స్పిన్నింగ్ ఉద్యమాల్ని మహిళలు ముందుండి నడిపించారు. ఆ ఉద్యమానికి ఊపిరి పోస్తూ బ్రిటిష్ గుత్తాధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ, ప్రతి మహిళ తమ ఇళ్లలోనే నూలు నూయడం, వస్త్రాల్ని నేయడం జరిగింది. ఆ విధంగా నేసిన వస్త్రాలు ‘హోంస్పన్’ గా ప్రసిద్ధి చెందాయి. అలా హోంస్పన్ వస్త్రాలు ధరించడం దేశభక్తికి చిహ్నంగా నిలిచింది.
కొన్ని కాలనీలలో మహిళలు, సామాజిక నిరసన వ్యక్తపరుస్తూ, కలిసి రాట్నాలు ఏర్పరుచుకొని నూలే వారు. అలా ఏర్పరుచుకున్న సామూహిక ప్రదేశాలు ‘స్పిన్నింగ్ బీస్’ గా ప్రసిద్ధి చెందాయి. మార్చి 1768 లో మొదలుకొని 32 నెలల పాటు హార్ప్స్వెల్ నుంచి, మైనె నుంచి, హంటింగ్టన్, లాంగ్ ఐలండ్ వంటి కాలనీలలో విస్తృతంగా 60 స్పిన్నింగ్ మీటింగ్స్ జరుపుకున్నారని ప్రసిద్ధి.
అమెరికా సమాజంలో ఈ స్పిన్నింగ్ బీస్ సృష్టి-ప్రేరణలో, రాజకీయ అసమ్మతివాదుల సంఘం ‘డోటర్ ఆఫ్ లిబర్టీ’ కీలకమైన పాత్ర పోషించింది. ఒకవైపు బ్రిటిష్ వారు తమ దేశంలోకి దిగుమతి చేసే వస్తువులు ముఖ్యంగా టీ, బట్టలు మొదలగు వాటి సంఘ బహిష్కరణను ప్రొత్సహించడం మరోవైపు ప్రత్యామ్నయాలని గుర్తించి సొంతంగా తయారుచేసుకునే భాద్యత దిశగా సమాజాన్ని ప్రేరేపించింది.
అమెరికాలో ధ్వనించిన తీరుగనే భారత దేశంలో కూడా స్వాతంత్ర్య సమరయోధుల ప్రచారాల్లో, ర్యాలీలలో, పిలుపులో స్పిన్నింగ్ అనేది పోరాట స్ఫూర్తి రగిలించడంలో కేంద్ర అంశంగా నిలిచింది. హోంస్పన్ వస్త్రాలలో జరుగుతున్న ప్రతి చిన్న అభివృద్దిని, పురోగతులను పత్రికలు నివేదించేవి. అలానే స్పిన్నింగ్ పాఠశాలలు స్థాపించబడ్డాయి, వాటి ద్వారా బాగా/ఎక్కువ మొత్తాలలో నేసేవారిని గుర్తించి పురస్కారాలు అందించడం చేసేవారు. అలా ప్రేరణతో చిన్నా-పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వస్త్రాలు నెయ్యడానికి ముందుకు రావడం జరిగింది, అదే విషయాన్ని గుర్తిస్తూ న్యూపొర్ట్ కి చెందిన 70 ఏళ్ళ ముసలావిడ తన జీవింతంలోనే మొదటిసారి రాట్నం తిప్పడం నేర్చుకొని వస్త్రాన్ని నేసిందని అప్పటి పత్రికలు నివేదికలు ఇచ్చాయి.
పోరాట స్ఫూర్తి ని మరింత రగిలిస్తూ 1769 సమయంలోనే ఏన్నో స్పిన్నింగ్ పోటీలు విధిగా నిర్వహించడం జరిగింది. అందులో పాల్గొన్న సభ్యులు పోటా-పోటీగా గెలిచారని అప్పటి నివేదికలు తెలియజేసాయి.
వీటన్నిటి పర్యావసానం, అమెరికాకు బ్రిటిష్ చేసే దిగుమతులు తీవ్రంగా పడిపొయాయి, ఒక సంస్థ ప్రచూరించిన లెక్క ప్రకారం 1769 ముందు సంవత్సరంతో పోలిస్తే ఆ ఏడు దిగుమతులు 4,20,000 నుంచి 2,08,000 పౌండ్ కి పడిపోయాయి.
ఆ విధంగా ఈ ప్రపంచంలోని ఏన్నో దేశాల్లో ‘స్వదేశీ’ అనేది సామ్రాజ్యవాదుల నిరంకుశ పాలన పట్ల తిరుగుబాటుకు ఒక శక్తివంతమైన ఆయుధంగా నిలిచింది.
ఇదే స్ఫూర్తి 150 ఏళ్ళ తరువాత, భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలో కనిపిస్తుంది. అదే మన ఆత్మ విశ్వాసం, మనోబలం, గుర్తింపుగా నిలిచింది, నిలుస్తుంది.
-మీన