దేశంలోని అత్యున్నత ఇంజనీర్లలో ఒకరైన మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి అయిన సెప్టెంబర్ 15 ను ఇంజనీరింగ్ డే గా దేశమంతటా ఘనంగా జరుపుకున్నారు. దేశంలో ఇంజనీరింగ్ విద్య, ఇంజనీరింగ్ రంగంలో ఎంతో కృషి చేసిన విశ్వేశ్వరయ్య వరదలను అరికట్టే నిర్మాణాలకు రూపకల్పన చేయడం, డాం లు రిసర్వాయిర్ ల నిర్మాణం చేయడంతో పాటు దేశంలోనే తొలిసారిగా ఇంజనీరింగ్ విద్యా సంస్థను ఏర్పాటు చేశారు. బెంగళూరులో ఆయన ప్రారంభించిన గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రస్తుతం యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ గా పిలువబడుతుంది.
ఈ రోజు దేశంలో వేల సంఖ్యలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల నుండి ప్రతి ఏటా వందలు, వేల సంఖ్యలో యువతీ యువకులు బయటకి వస్తున్నారు. ఆడపిల్లలు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడం ఈ రోజుల్లో వింత కాదు కానీ కొన్నేళ్ల క్రితం వరకూ అది ఆడపిల్లలకు సంబంధించిన రంగం కాదు. ఏ ఆడపిల్లా నడవడానికి సాహసించని ఈ దారిలో నడిచిన తొలితరం అమ్మాయిలలో ఎ. లలిత ఒకరు. ఈ ఇంజనీరింగ్ డే ఆమెను గుర్తు చేసుకోవడానికి సరైన సందర్భం.
1919 ఆగస్టు 27 న ఒక మధ్యతరగతి తెలుగు కుటుంబంలో ఏడుగురు పిల్లలలో ఒకరిగా లలిత జన్మించారు. ఆమె తండ్రి ఇంజనీర్. కొంత విశాల దృక్పధం కలిగిన వాడైనప్పటికీ పిల్లల పెంపకం విషయంలో సమాజ కట్టుబాట్లను మీరడానికి ధైర్యం చేసేవాడు కాదు. ఆ కుటుంబంలో అబ్బాయిలు అంతా ఉన్నత చదువులకు వెళితే అమ్మాయిలకు మాత్రం ప్రాధమిక స్థాయి వరకు చదువుకోగానే పెళ్ళిళ్ళు చేసేసేవారు. లలితకు కూడా 15 సంవత్సరాల వయసులోనే వివాహం అయింది. కాకపోతే ఆమె పెళ్ళి తర్వాత కూడా పదవ తరగతి వరకు చదువుకునేందుకు ఆమె తండ్రి ఏర్పాట్లు చేశారు.
అయితే దురదృష్టవశాత్తూ ఆమె వివాహ జీవితం ఎంతో కాలం సాగలేదు. ఆమెకు 18 సంవత్సరాల వయసులో భర్త మరణించారు. అప్పటికే ఆమెకు చిన్న పాప ఉంది. నాలుగు నెలల పాపతో చిన్న వయసులోనే విధవగా మారిందామె. ఆ రోజుల్లో విధవల పట్ల సమాజం ఎంతో వివక్ష చూపించేది. అయితే లలితలోని పోరాట గుణం ఆమె ఎన్నో అడ్డంకులను అధిగమించేలా చేసింది.
పుట్టింటికి తిరిగి వచ్చిన ఆమె పెద్ద చదువులు చదువుకుని తన కాళ్లపై తాను నిలబడాలి అనుకుంది. ఆమె తండ్రి అందుకు మద్దతు ఇచ్చారు. మద్రాస్ లోని క్వీన్ మేరీ కళాశాల నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసింది లలిత. ఆ తరువాత ఇక ఆమె వెనుకడుగు వేయలేదు.
ఆ రోజుల్లో స్త్రీలు చాలామంది మెడిసిన్ చదువుతున్నారు. అయితే ఆ మెడికల్ రంగంలోకి వెళితే తాను తన కూతురికి తగిన సమయం ఇవ్వలేనేమో అని లలిత అనుకుంది. తన కుటుంబంలో అనేకమంది ఇంజినీర్లు ఉండడంతో తాను కూడా ఇంజనీర్ అయితే అనే ఆలోచన వచ్చింది. అయితే అప్పటికి మనదేశంలో ఇంజనీరింగ్ విద్య ఇంకా తొలిదశలోనే ఉంది. మహిళలు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడం అనేది అసలు కలలో కూడా ఊహించని విషయం. ఏ యూనివర్సిటీ మహిళలకు ఇంజనీరింగ్ లో అడ్మిషన్ ఇచ్చేది కాదు. ఈ విషయంలో మళ్ళీ ఆమె తండ్రి పప్పు సుబ్బారావు ఆమెకు సహకరించారు. గుండీ లోని ఇంజనీరింగ్ కళాశాలలో ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తుండేవారు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ కేసీ చాకో ను ఒప్పించి ఆమెకు ఇంజనీరింగ్ లో ప్రవేశం కల్పించారు. డైరెక్టర్, ఇన్స్ట్రుక్షన్ కు కూడా దరఖాస్తు పంపి అనుమతి తీసుకున్నారు. ఆ విధంగా ఆ కాలేజీ చరిత్రలోనే తొలిసారిగా ఒక మహిళకు ఇంజనీరింగ్ లో అడ్మిషన్ ఇచ్చారు. లలిత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్స్ ను ఎంపిక చేసుకున్నారు.
ఆ విధంగా వందలాది మంది అబ్బాయిలు మాత్రమే ఉన్న కళాశాలలో ఒకే ఒక్క మహిళా విద్యార్థిగా లలిత చేరారు. అయితే ఆమెకు అది ఎప్పుడూ అసౌకర్యంగా అనిపించలేదు. ఆమెకోసం ఒక ప్రత్యేకమైన వసతి ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఆమె కూతురిని తన అన్న ఇంటిలో వదిలి వచ్చారు. ప్రతి వారాంతం వెళ్లి కూతురిని చూసుకుని వచ్చేవారు. ఆమె కళాశాల జీవితం, విద్యాభ్యాసం మొదట బాగానే ఉన్నా కొన్నిరోజులకి తాను అక్కడ ఒంటరిదానిని అనే భావన ఆమెలో మొదలయ్యింది. అదే సమయంలో ఆమె తండ్రి మరింత మంది మహిళలకు ఇంజనీరింగ్ లో ప్రవేశం ఇవ్వమని కళాశాల అధికారులను ఒప్పించారు. కళాశాల వారిచ్చిన ప్రకటన చూసి తర్వాత ఏడాది సివిల్ ఇంజనీరింగ్ లో లీలమ్మ జార్జ్, పికె త్రెసియా అనే మరో ఇద్దరు మహిళలు చేరారు.
అప్పటి నిబంధనల ప్రకారం ఇంజనీరింగ్ విద్య నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న విద్యార్థులు అందరూ ఒక సంవత్సరం పాటు ప్రాక్టికల్ విద్యను అభ్యసించవలసి ఉంటుంది. లలిత జమల్పూర్ రైల్వే వర్కుషాప్ లో తన ఏడాది అప్రెంటిస్ షిప్ ను పూర్తి చేసుకుని 1943 లో ఇంజనీరింగ్ పట్టా పొందింది. ఆ తర్వాత ఏడాది అప్రెంటిస్ షిప్ నిబంధన ఎత్తివేయడంతో ఆమె జూనియర్ మహిళా ఇంజినీర్లు ఇద్దరూ కూడా అదే ఏడాది పట్టా పొందారు.
అప్పటికే ఎన్నో అవరోధాలను దాటుకుంటూ వచ్చిన లలిత ఇక ప్రొఫెషనల్ గా కొత్త జీవితం ప్రారంభించింది. అయితే తన కుమార్తె శ్యామల తన మొదటి ప్రాధాన్యతగా భావించిన లలిత ఆమె సంరక్షణకు ఇబ్బందికలగని విధంగా ఉండే ఉద్యోగం కోసం వేట ప్రారంభించింది. సిమ్లా లోని సెంట్రల్ స్టాండర్డ్స్ ఆర్గనైజషన్స్ ఆఫ్ ఇండియా లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా ఉద్యోగం పొందింది. రెండేళ్ల పాటు ఆ ఉద్యోగంలో కొనసాగాక తన తండ్రికి పరిశోధనలలో సహాయం చేసేందుకు గానూ చెన్నై కు మారింది. ఆ పరిశోధనలు తన మేధస్సును పెంపొందించుకునేందుకు ఉపయోగపడ్డాయి కానీ ఆర్ధిక ఒత్తిడుల కారణంగా వాటిని మధ్యలో వదిలి మళ్ళీ ఉద్యోగం కోసం వెతకడం మొదలుపెట్టింది. అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ వారి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసేందుకు కలకత్తా వెళ్ళింది. మళ్ళీ ఆమె కూతురి సంరక్షణ బాధ్యత వాళ్ళ అన్న తీసుకున్నారు.
అక్కడ తాను నేర్చుకున్న విద్యనంతా పనిలో ప్రదర్శించే అవకాశం లలితకు కలిగింది. భాక్రానంగల్ ప్రాజెక్ట్ తో సహా అనేక భారీ ప్రాజెక్ట్ లకు ఆమె పని చేశారు. ట్రాన్స్మిషన్ లైన్లు, సబ్ స్టేషన్ లేఔట్, రక్షణ పరికరాలు డిజైన్ చేయడం లలిత పని. ఆమె మేధస్సు, శక్తీ సామర్ధ్యాలు ఈ సమయంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి.
1953 లో లండన్ కు చెందిన కౌన్సిల్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఆమెను అసోసియేట్ మెంబెర్ గా తన కౌన్సిల్ లోకి ఆహ్వానించారు. చక్కని చీరకట్టులో లండన్ లోని ఫ్యాక్టరీ ని సందర్శించిన ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. 1964 లో న్యూయార్క్ లో జరిగిన తొలి ఇంజినీర్లు, శాస్త్రవేత్తల అంతర్జాతీయ సదస్సుకు కూడా ఆమెకు ఆహ్వానం అందింది. ఇటువంటి సదస్సుకు హాజరయిన తొలి భారతీయ మహిళా ఇంజనీర్ ఆమె. ఆ తర్వాత కాలంలో ఆమె ఎన్నో మహిళా ఇంజినీర్ల సంస్థలలో సభ్యురాలిగా కొనసాగారు. లండన్ లోని విమెన్ ఇంజనీరింగ్ సొసైటీ లో కూడా 1965 లో సభ్యత్వం పొందారు.
1977 లో పదవీ విరమణ చేసేవరకు లలిత అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ అసోసియేట్స్ (తర్వాత కాలంలో దీనిని జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ టేకోవర్ చేసింది) లోనే కొనసాగారు. మహిళలకు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగాలలోకి బాట వేసిన తొలి తరం మహిళలలో లలిత ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఆమె కూతురు శ్యామల కూడా తల్లి లాగానే సైన్స్, మాథెమాటిక్స్ చదువుకుని మాథెమాటిక్స్ టీచింగ్ లో స్థిరపడ్డారు. తన తల్లి జీవితం, పని నుండి తాను ఏమి నేర్చుకున్నదో శ్యామల ఒక ఇంటర్వ్యూ లో ఇలా చెప్పారు. “ఆమె జీవితం నుండి నేను నేర్చుకున్నది అంతులేని ఓర్పు. ఊరికే మాటలు చెప్పడం కాకుండా నాణ్యమైన పని చేయడంపై దృష్టి. ఇతరులు మన జీవితంలోకి ఏదో ఒక కారణంతోనే వస్తారు, ఆ వచ్చిన ప్రయోజనం నెరవేరగానే మన జీవితం నుండి వెళ్ళిపోతారు అనే వారు ఆమె” .
రిటైర్ అయిన కొద్దికాలానికే 1979 లో తన అరవై ఏళ్ళ వయసులో అనారోగ్యంతో లలిత మరణించారు. ఈ రోజున ఎంతో మంది అమ్మాయిలు ఇంజనీరింగ్ కెరీర్ చేపడుతున్నప్పటికీ అందుకు దారి వేసిన ఇటువంటి మహిళల దీక్ష, పట్టుదల గురించి చాలా మందికి తెలియదు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి తల్లిగా తన బాధ్యతలను ఒంటి చేత్తో లాగుతూనే అటు చదువులో ప్రతిభను కనపరచడమే కాకుండా ఉద్యోగ జీవితంలోనూ ప్రతిభావంతురాలిగా గుర్తింపు పొందిన లలితను ఈ సందర్భంలో స్మరించుకోవడం ఎంతైనా అవసరం.
Based on a piece by Mamata